గుడ్డు శాకాహారమా..? మాంసాహారమా..? మళ్లీ చర్చ ముందుకొచ్చింది… నిజానికి కోడి ముందా..? గుడ్డు ముందా..? అనే చర్చ ఉన్నన్నిరోజులూ… ఈ శాకాహారమా, మాంసాహారమా అనే చర్చ కూడా బతికే ఉంటుంది… ఇప్పుడు కథేమిటంటే..? కర్నాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది… మధ్యాహ్నభోజనంలో భాగంగా పిల్లలకు గుడ్డు ఇవ్వాలనేది ఆ నిర్ణయం… వారానికి మూడు గుడ్లు… అది కూడా కేవలం ఏడు జిల్లాల్లోనే… ఎందుకంటే..? ఆ జిల్లాల్లో పిల్లల పౌష్ఠికాహార స్థాయి బాగా తక్కువగా, రక్తహీనత ఎక్కువగా ఉందట… గుడ్డుదేముందిర భయ్, రాష్ట్రమంతా ఇవ్వొచ్చు కదా, పిల్లల కడుపు నిండుతుంది, కాస్త పుష్టిగా పెరుగుతారు అంటారా..? అబ్బే, ఇప్పుడు ఈ ఏడు జిల్లాల నిర్ణయం మీదే రచ్చ అవుతోంది…
కర్నాటకలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ వారి అక్షయపాత్ర మధ్యాహ్నభోజనాన్ని సప్లయ్ చేస్తూ ఉంటుంది… అఫ్‌కోర్స్, దేశంలోని చాలా రాష్ట్రాల్లో చేస్తుంది… కొంత ప్రభుత్వం భరిస్తే, కొంతమేరకు అక్షయపాత్ర భరిస్తుంది… ఆధునిక కిచెన్లు, నిర్వహణ, ఫుడ్ రవాణా, సిబ్బంది జీతాలకు తమ డబ్బే కొంత ఖర్చుపెడుతున్నట్టు అది చెప్పుకుంటూ ఉంటుంది… ఆ సంస్థ అల్లం, వెల్లుల్లి, ఎల్లిపాయను వాడదు… దాంతో పిల్లలు ఈ చప్పిడి తిండి తినలేక మళ్లీ ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారని ఆమధ్య మీడియా గొడవ చేసింది… పిల్లల మీద మతవిశ్వాసాల్ని రుద్దుతున్నారని కొన్ని సంఘాలు ఆందోళన చేశాయి… ఇప్పుడు తాజాగా గుడ్డు వివాదం…
Ads
‘‘స్కూళ్లను మిలిటరీ హోటల్స్ చేసేస్తున్నారా..? పప్పులు, మంచి పోషక విలువలున్న భోజనం ఇవ్వాలి తప్ప ఇదేమిటి..?’’ అని కస్సుమన్నాడు లింగాయత్ గురువు చెన్నబసవానంద స్వామి… ఆ నిర్ణయం విత్ డ్రా చేసుకోవాలనీ హెచ్చరించాడు కూడా… రాష్ట్రీయ బసవదళ్, లింగాయత్ ధర్మమహాసభ, అక్కనగళాంబిక మహిళా గాన కార్యకర్తారు, బసవమంటప తదితర లింగాయత్ గ్రూపు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నయ్… ప్రతిపక్ష పార్టీలకు దీనిపై ఏం స్పందించాలో అర్థం కావడం లేదు… వెజ్ పిల్లలకు అరటిపండ్లు ఇవ్వండి, నాన్-వెజ్ పిల్లలకు గుడ్లు ఇవ్వండి అని మధ్యేమార్గంగా స్పందించాయి… జగతిక లింగాయత్ మహాసభ మాత్రం ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి పోవద్దని సూచించింది… సో, సమాజం దీనిపై రకరకాలుగా చీలిపోయింది…
బీదర్, రాయచూర్, కలబుర్గి, యాదగిర్, కొప్పల్, బళ్లారి, విజయపుర జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం… పలు పౌరసంస్థలు కూడా ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి… ‘అవర్ ఫుడ్- అవర్ రైట్’ వంటి సంస్థలు చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి కూడా… ఇతర జిల్లాల్లో కూడా గుడ్డు ఇవ్వాలని, వారానికి మూడు గాకుండా రోజూ ఇవ్వాలని కోరుతున్నాయి… ‘ఆరోగ్యం-ఆహారం పిల్లల హక్కు’ అనేది వాళ్ల నినాదం… గుడ్డు సరిపోదు, పాలు కూడా ప్రొవైడ్ చేయాలంటున్నారు… ఇంకా దీనిపై అక్షయపాత్ర స్పందన తెలియదు, గతంలో ఒడిశాలో ఇదే నిర్ణయం తీసుకున్నప్పుడు, గుడ్లు మేం సప్లయ్ చేయబోమని భీష్మించింది సంస్థ… దాంతో గుడ్ల బాధ్యతను హెడ్ మాస్టర్లకు అప్పగించింది…
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే..? నిజంగా గుడ్డు మాంసాహారమా..? పర్టిక్యులర్ మతవిశ్వాసాలకు విరుద్ధమా..? అక్షయపాత్ర కావచ్చు, పలు లింగాయత్ సంస్థలు కావచ్చు… గుడ్డు మాంసమే అంటాయి… కొందరి వాదన భిన్నం… ‘‘ఏముందీ గుడ్డులో..? ఫర్టిలైజ్డ్ ఎగ్ అయితే ఓ పిండకణం, అంతే, దాని చుట్టూ ప్రొటీన్లు, మినరల్స్, ఫ్యాట్స్… పిల్లలు పొదగడానికి చాన్స్ లేని అన్‌ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అయితే ఆ జీవకణం కూడా ఉండదు… సో, గుడ్డు మాంసం కాదు’’…. ఇదీ ఆ వాదన సారాంశం… ఒక విత్తనం తీసుకొండి, అది భూమిలో పాతితే మొలకెత్తుతుంది, అదీ జీవకణమే కదా… మరి తినడం లేదా..? గుడ్డు కూడా అంతే’’ అంటారు వాళ్లు… అసలు ఇదేకాదు… పుట్టగొడుగులు కూడా మాంసాహారమే అని భావించి, చాలామంది వాటిని కూడా తినరు… నిజానికి అవి వృక్షజాతి కాదు, జంతుజాతి కాదు, ఫంగస్ టైప్… చలనం, ఆహార సంపాదన, విత్తనవ్యాప్తి, పునరుత్పత్తి తదితర అంశాల్లో వృక్ష, జంతు లక్షణాలు రెండూ ఉంటయ్… అలాగే గుడ్లు కూడా ఇంకో టైప్… ఒక జీవకణం, దాని చుట్టూ పౌష్టికపదార్థం… సో, వృక్షజాతి, జంతుజాతి, ఫంగస్ తరహాలోనే ఎగ్స్‌ను కూడా భిన్నమైన జాతిగా గుర్తిస్తే సరి…!! చివరగా ఒక ప్రశ్న… తినే పిల్లలు తింటారు, వద్దనుకున్నవాళ్లకు వద్దు, రచ్చ దేనికి..? మొత్తంగా ప్రభుత్వ వెరీ ’గుడ్డు‘ డెసిషన్‌కు ఎవరైనా ఎందుకు అడ్డుపడాలి…?!
Share this Article