మూడు రోజుల కిందట తుంగభద్ర డ్యామ్ (టీబీ డ్యామ్) 19వ గేట్ వైర్ తెగి కొట్టుకొని పోయింది. డ్యాంలో నిలువ ఉన్న 100 టీఎంసీల నీటిని మిగిలిన గేట్లు ఎత్తి నదిలోకి వదులుతున్నారు. ఈ సందర్భంగా నీరు వృథా కావలసిందేనా అనే చర్చ జరుగుతుంది. తుంగభద్ర నీరు సముద్రం పాలు కాకుండా ఎలా ఉపయోగించుకోవాలి?
కర్ణాటకలోనో హొస్పెట్ వద్ద తుంగ భద్ర నది మీద టీబీ డ్యామ్ నిర్మించారు, 1953 నాటికి డ్యామ్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ డ్యామ్ దిగువున కర్నూల్ టౌన్ కు 20 కిమీ దూరంలో ఒక టీఎంసీ స్టోరేజి కెపాసిటీ ఉన్న సుంకేసుల బ్యారేజి ఉంది. సుంకేసుల దాటిన తరువాత నుంచి అలంపూర్ వద్ద తుంగభద్రా నది కృష్ణా నదిలో సంగమిస్తుంది.
వెస్ట్రన్ ఘాట్స్ లో కురిసే భారీ వర్షాల వలన కృష్ణా నది కంటే ముందే తుంగభద్ర నదికి వరద వస్తుంది. తుంగభద్ర నది మీద ఉన్న టీబీ డ్యామ్ మరియు సుంకేసుల బ్యారేజి రెండు కలిసి కూడా స్టోరేజి కెపాసిటీ 100 – 102 టీఎంసీలే. దీనితో ఎక్కువ శాతం నీరు కృష్ణాలో కలుస్తుంది. కృష్ణా నదికి కూడా వరద వచ్చినప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజికి నీళ్లు వస్తే ఆగస్టు నెలలోనే నీరు సముద్రం పాలవుతుంది.
Ads
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కులు, నాగార్జునసాగర్ కుడి & ఎడమ కాలువల ద్వారా 20,000 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజి కింద అన్ని కాలువలు కలిపి 22,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అంటే పూర్తిస్థాయిలో నీరు ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు నుంచీ కాలువల ద్వారా తీసుకోగలిగేది కేవలం దాదాపు 80,000 క్యూసెక్కులు మాత్రమే! కానీ ఒక మోస్తరు వరద అంటేనే కనీసం లక్ష క్యూసెక్కులు తుంగ భద్ర నుంచి మరో లక్ష క్యూసెక్కులు కృష్ణ నుంచి వస్తాయి. అందుకే ఆగస్టు నెల నుంచే ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని సముద్రంలోకి వదులుతుంటారు.
మరి పరిష్కారం ఏంటి?
ఇప్పుడు చర్చ తుంగభద్ర మీద కాబట్టి, హాస్పెట – సుంకేసుల మధ్యలో మరో రిజర్వాయర్ అవసరం ఉంది. టీబీ డ్యామ్కు ఏదయినా ప్రమాదం జరిగినా, కృష్ణా నది మీద ప్రాజెక్టులు నిండుగా ఉండి, తుంగభద్ర నుంచి వచ్చే నీటి అవసరం లేకున్నా, తుంగభద్ర నీటిని నిలువ చేసుకోవటానికి మరో ప్రాజెక్ట్ కట్టవలసిన అవసరం ఉంది, ఆ ప్రాజెక్ట్ “గుండ్రేవుల”.
గుండ్రేవుల ప్రాజెక్ట్ :
కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్రా నది మీద 20 టీఎంసీల స్టోరేజి కెపాసిటితో రిజర్వాయర్ కట్టాలన్న డిమాండ్ 1980 నుంచి ఉంది. 2005-2006 వరకు సుంకేసుల మీద బ్రిటీష్ హయాంలో కట్టిన చిన్న ఆనకట్ట అంటే గేట్లు లేకుండా అలుగు మాత్రమే ఉండేది.
కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎం అయిన తరువాత తుంగభద్ర మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ కట్టాలనే డిమాండ్ పెరిగింది. కోడుమూరు నియోజకవర్గం కోట్ల విజయభాస్కర రెడ్డి సొంత నియోజకవర్గం కావటంతో ప్రాజెక్ట్ సాధ్యం అని భావించారు కానీ ఆనాటి పరిస్థితుల్లో నీటి allocations లేవని ఆయన గుండ్రేవులను పక్కనపెట్టి సుంకేసులను బ్యారేజీగా మార్చే పనుల మీద దృష్టి పెట్టారు . చంద్రబాబు హయాంలో బ్యారేజి పనులు మొదలయ్యాయి వైస్సార్ సీఎం అయిన తరువాత పనులు పూర్తయ్యి బ్యారేజి ఓపెనింగ్ జరిగింది.
ఇప్పుడు గుండ్రేవులకు అనుమతులు అవసరమా?
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 01-Nov-2013న గుండ్రేవుల సర్వే చేసి డిపిఆర్ తయారీకి ARVEE Associates కు ఇస్తూ 51.95 లక్షలు కేటాయించి GO Ms No. 100 I& CAD ను విడుదల చేశారు. సర్వే దాదాపు 95% పూర్తయిన తరువాత సర్వే కోసం తమ ప్రాంతంలో బోర్ గుంతలు వెయ్యటాన్ని తెలంగాణ వైపు కొందరు వ్యతిరేకించడంతో పనులు ఆగిపోయాయి. 15-Nov-2014న వడ్డేపల్లి MRO సర్వే యంత్రాలను సీజ్ చేశారు. అప్పటి నుంచి గుండ్రేవుల సర్వే మరియు డిపిఆర్ పనులు పూర్తిగా ఆగిపోయాయి.
ఆ తరువాత నాటి కెసి కెనాల్ DE జవహర్ రెడ్డి వడ్డేపల్లి రెవిన్యూ అధికారులతో సంప్రదించి సర్వే పనులు కొనసాగటానికి ప్రయత్నం చేశారు. చివరికి దాదాపు ఎనిమిది నెలల తరువాత సర్వే పనులు పునఃప్రారంభమయ్యి 13-Oct-2015న 2400 కోట్ల అంచనాతో ARVEE Associates రిపోర్ట్ ఇచ్చింది.
02-Jun-2014 తరువాత మొదలైన ప్రాజెక్టులు మాత్రమే కొత్తవని 2020 జూన్ మూడో వారంలో KRMB చెప్పింది. రాష్ట్ర విభజనకు ముందే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జీవో విడుదలైంది కాబట్టి గుండ్రేవుల పాత ప్రాజెక్టే. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జూరాల బ్యాక్ వాటర్స్ నుంచి 70 టీఎంసీలు ఎత్తిపోయటానికి డిపిఆర్ తయారు చేయటానికి సర్వే నిర్వహించాలని ఇచ్చిన జీవోను చూపించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాతదే అని వాదించిన విషయం గుర్తించాలి.
గుండ్రేవులకు నీటి కేటాయింపులు ఎలా?
సుంకేసుల డ్యామ్ వద్ద నుంచి కుడిగట్టు మీద కేసీ కెనాల్ మొదలవుతుంది. కేసి కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీ లు కేటాయించగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 31.90 టీఎంసీలు కేటాయించింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకా అవార్డు కాలేదు, నీటి పంపిణీ మీద కోర్టులో కేసు నడుస్తుంది.
బచావత్ ట్రిబ్యునల్ కేసి కెనాల్ కు కేటాయించిన 39.90 టీఎంసీల నీటిలో హొస్పెట్ వద్ద ఉన్న టీబీ డ్యామ్ నుంచి 10 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన 29.90 టీఎంసీల నీరు టీబీ డ్యామ్ -సుంకేసుల మధ్య ఉన్న కాచ్‌మెంట్ నుంచే రావాలి. అంటే ఆ ప్రాంతంలో పడే వర్షాలు, తుంగభద్రలో కలిసే వాగులు, వంకల నీటితోనే లభించాలి. తరువాత రోజుల్లో టీబీ డ్యాము నుంచి కేసీ కెనాల్ కు కేటాయించిన 10 టీఎంసీలను అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చే HLC కి కేటాయించారు. అంటే కేసీ కెనాల్ కు కేటాయించిన మొత్తం నీరు దాదాపుగా టీబీ డ్యామ్ దిగువ నుంచే రావాలి. అలా వచ్చిన నీటిని ఆపుకోవటానికి సుంకేసుల కెపాసిటీ సరిపోదు… అందుకే గుండ్రేవుల నిర్మాణం చేస్తే 20 టీఎంసీల నీరు నిలువ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
తుంగభద్రకు తక్కువ రోజుల్లో ఎక్కువ వరద వస్తుంది. కృష్ణ నది కన్నా ముందే తుంగభద్రలో వరద మొదలవుతుంది. ఈ సంవత్సరం కూడా జూలై మూడో వారంలోనే సుంకేసుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. పూడిక తరువాత సుంకేసుల కెపాసిటీ ఒక టీఎంసీ మాత్రమే, కేసీ కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీ 3850 క్యూసెక్కులు, అంటే ఒక రోజులో 1/3 టీఎంసీ నీటిని మాత్రమే తీసుకోగలుగుతారు. ఈ కారణాలతో తుంగభద్రలో వరద వచ్చినా కేసి కెనాల్ ఆయకట్టకు కేటాయింపు మేర నీరు అందటంలేదు.
గుండ్రేవుల వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ కాదు.. కేసి కెనాల్ కు టీబీ డ్యామ్ దిగువన రావలసిన నికర జలాలు ఆధారంగా కట్టవలసిన ప్రాజెక్ట్. గుండ్రేవుల మీద కర్ణాటకకు అభ్యంతరం ఉండదు. తెలంగాణాకు కూడా కొంత నీరు అందుతుంది.
భూసేకరణ
గుండ్రేవుల ప్రాజెక్టు వలన దాదాపు 22,000 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది. దీనిలో 7000 ఎకరాలు గద్వాల్ జిల్లాలోనిది. ప్రాజెక్ట్ ఉపయోగంతో పోల్చుకుంటే 22,000 ఎకరాలు అనేది పెద్ద సమస్య కాదు.
2021 సెప్టెంబర్ నెలలో మా రాయలసీమ నీటి అధ్యయన వేదిక బృందం గుండ్రేవుల ప్రాంతంలో పర్యటించి రైతులతో చర్చించాము. రైతులు భూమి పోయినా సరే ప్రాజెక్ట్ వస్తే మంచిదే, మా ప్రాంతం బాగుపడుతుందని కోరుకుంటున్నారు. 2018 లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ కాస్ట్ 4500 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఎంత పెరిగినా 8000 కోట్లు కాదు.
కోట్ల కీలకం
2019 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు గుండ్రేవుల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు .
ఆ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ నుంచి కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఓడిపోయారు. కానీ ఈ 2024 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 స్థానాలలో 12 గెలిచింది, కర్నూల్ & నంద్యాల ఎంపీ సీట్లు కూడా గెలిచింది.
కోడుమూరులో 1985 తరువాత మళ్ళీ టీడీపీ గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తరువాత కోడుమూరులో టీడీపీ గెలవటం ఇది కేవలం రెండోసారి మాత్రమే. టీడీపీ సునామి 1983 & 1994లో కూడా కోడుమూరులో కాంగ్రెస్ గెలిచింది. రాజకీయంగా ఇంత అనుకూలంగా ఉన్న సమయంలో గుండ్రేవుల కట్టటం టీడీపీకి కూడా మంచిదే.
తుంగభద్ర నీళ్లు సముద్రం పాలు కాకుండా ఉండాలంటే గుండ్రేవులే పరిష్కారం. గుండ్రేవుల ప్రాజెక్ట్ కడితే ఒక కాలువ ద్వారా అనంతపురానికి మరో కాలువ ద్వారా కర్నూల్ & కడప జిల్లాకు నీళ్లు తీసుకెళ్లొచ్చు……. ( అభిప్రాయం, విశ్లేషణ …. శివ రాచర్ల )
Share this Article