అట్టహాసాలు, రాచమర్యాదలు, భుజకీర్తులు, బృందగానాలు, వందిమాగధ కీర్తనలు తోడయితే అది ఒకప్పుడు వార్త… ఇప్పుడు సామాన్యుడు అనిపించుకోవడం ఓ వార్త… ఎందుకు..? చూశారా, వీసమెత్తు గర్వం లేదు, అధికారం తలకెక్కలేదు, ఇప్పటికీ డౌన్టుఎర్త్, దేవుడి దగ్గర ఓ సామాన్య భక్తుడు, నిరాడంబరుడు అని అందరూ చెప్పుకోవాలి… ఇదొక రకం కీర్తన… నిజమా..? ఒక ఉపరాష్ట్రపతి ఒక సామాన్యుడిలా వెంకన్న దర్శనం చేసుకున్నాడా..? చేసుకోగలడా..? నిజమే, ఒక్కసారైనా అలా చేసుకుంటే బాగుండు… మొన్నమొన్నటివరకూ ఓ గవర్నర్ ఉండేవాడు… తనకు ప్రోటోకాల్ లేకపోయినా, వేదవిహితమైన ఆశీర్వచనం దక్కకపోయినా కళ్లురిమేవాడు… క్యూ లైన్లు ఆగిపోయేవి… అర్చకగణం చేతులు కట్టుకుని గడగడా… శ్రీవారి భృత్యగణం సరేసరి… ఎవరైనా అంతే… అధికారం ఉన్నాక అది ప్రదర్శించడమే… సామాన్యుడిలా ఉండటం, ఉండగలగడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్… అది దేవుడి దగ్గరైనా సరే… పోనీ, ఈ వార్తే చూద్దాం…
సామాన్యుడు అంటే… బస్సో, రైలో తిరుపతి చేరి… టీటీడీ బస్సులో తిరుమల చేరి… రిసెప్షన్ దగ్గర పడిగాపులు గాసి… ఏ చిన్న సత్రపు గదో దొరికితే అందులో చేరతాడు… శ్రీవారి ప్రసాదం పేరిట పంపిణీ చేసే ఉప్మా పొంగల్ తినేసి… కల్యాణకట్టలో నున్నగా గీయించుకుంటాడు… స్నానం చేసి, నామాలు పెట్టుకుని భార్యాపిల్లలతో క్యూ లైన్లోకి చేరతాడు… గదులు, గదులు… వెయిటింగులు… వాళ్లు పెట్టేదేదో తింటూ… జాముల కొద్దీ గడిచాక దేవుడిని దర్శనం చేసుకుని, మనసు నిండా భక్తిగా దండం పెట్టుకుంటాడు… అన్నదాన సత్రంలో భోంచేసి… తిరుగుమొహం పట్టి… నువ్వే నన్ను రప్పించుకున్నావు స్వామీ అనే క్రెడిట్ కూడా దేవుడికే ఇస్తాడు… గోవిందా గోవిందా అని మనసారా గొంతెత్తి నినదిస్తాడు… ఓ సామాన్యుడి భక్తిగాఢత ముందు ఎవరైనా బలాదూర్…
Ads
మరి ఒక వీవీఐపీ అంటే… ఓ విలాస అతిథి భవనం… స్వాగతాలు… ఎర్ర తివాచీ మర్యాదలు… అడుగడుగుకూ పరిచారకులు… చేతులు కట్టుకుని ఆదేశాల కోసం ఎదురుచూసే అధికారగణం… పోనీ, ఆ దేవుడినే మీ దగ్గరకు తీసుకురమ్మంటారా అన్నట్టుగా చూస్తుంటారు… టీటీడీ అధికారులు కదా, వాళ్లు ఏదైనా చేయగలరు… దర్శనం గట్రా కాగానే ప్రత్యేక ఆశీస్సులు, శాలువాలు, ప్రసాదాలు, పటాలు… ఏం తక్కువ..? దేవుడికి సమానంగా..! ఇవీ జరిగేవి… ఫాఫం, ఆయనకు మహాద్వార దర్శన అనుమతి ఉన్నా సరే, క్యూ లైన్లో వెళ్లాడట… ఇక సామాన్యుడిలా శ్రీవారి సేవ అంటూ భలే దండకం చదివింది ఈనాడు… సరే, భజనలు పలురకములు… కానీ ఓ భక్త సామాన్యుడితో ఎందుకు పోల్చడం… వాడేం పాపం చేశాడు..?! సామాన్యుడిలా వ్యవహరిస్తే ఈవో, అదనపు ఈవో, సీవీఎస్వో సాదర స్వాగతాలు… ఉపముఖ్యమంత్రి, ఈవో చేతుల మీదుగా మహా ప్రసాద వితరణ ఏమిటి..? జస్ట్, క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తే ఈ స్థాయి అన్నమయ్య కీర్తనా..? ఇందులో అంత త్యాగనిరతి ఏముందబ్బా…!!??
Share this Article