అమీన్ సాబ్… అంటే సబ్ ఇన్స్పెక్టర్… ఎంత ఖదర్ ఉండాలె… గబ్బర్‌సింగ్ లెక్క ఎంత అధికారం ఉండాలె… అరె, మరీ గిట్ల చేసుకుంట, మొత్తం పోలీసు అనే పదానికే నామర్దా… నామోషీ… ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అని పెద్ద పోలీసులు చెప్పగానే, ఇంత అరాచకమా..? అబ్బే, పోలీస్ అనే పదానికే అవమానం… అసలు ఏందివయ్యా నువ్వు..? అంత కడక్ కడక్ ఖాకీ డ్రెస్సు వేసుకున్నవ్… చేతికి లాఠీ ఇచ్చిండ్రు… పైగా గన్ ఉంది… ఎంత జోష్ ఉండాలె ఆ కొలువ చేయడానికి..? నువ్వేందివయ్యా, పోలీసు అనే పదానికే తలవంపులు తెస్తున్నవ్…
అసలు ఓ అమీన్ సాబ్ అంటే ఎట్లుండాలె..? ఫుల్ ఖతర్నాక్ ఉండాలె… ఎవడైనా ఎదుట నిలబడాలంటే సుస్సు పోసుకోవాలె… చెప్పంది వినాలె… మనకు ఎవడు కమీషన్లు ఇస్తున్నడు..? వాడికి మనం ఏం ఫాయిదా చేయాలె… అది కదా ఆలోచించాల్సింది… పొద్దున లేచి ఎమ్మెల్సే సాబ్‌కు నమస్తే కొట్టి వచ్చినమంటే చాలు… ఇక మనదే రాజ్యం…
Ads
ఎక్కడ పైసలొస్తయ్..,? ఏందీ కథ..? మరీ అవసరమైతే గన్ తీసి ఎన్కౌంటర్ చేస్త బిడ్డా అని బెదిరించాలె… పొరపాటున నదరుగా ఉన్న లేడీస్ అయితే… రాత్రికి గెెస్ట్ హౌజుకు రమ్మనాలె… టైంకు మందు, మటనూ పంపించాలని ఆ బార్ వాడికి ఫోన్ చేయాలె…
అబ్బా… ఇక ఇలా చేస్తే పోలీస్ అనే పదానికి, చేతిలో లాఠీకి ఖదర్ ఏముంటది..? పవర్ ఏముంటది..? ఛిఛీ… అసలు ఎందుకొస్తారో ఇలాంటోళ్ల సర్వీసులోకి..? నిజానికి ఇలాంటోళ్లను కోర్ట్ మార్షల్ టైపులో విచారించి, శిక్షించాలె…
ఈయన ఎవరో… పాత వరంగల్ జిల్లా, పాలకుర్తిలో ఎస్సయి అట… పేరు గండ్రాతి సతీష్ అట… లక్ష్మినారాయణపురం, ఓ వృద్దురాలు… పేరు బండిపెల్లి రాజమ్మ… అసలే వికలాంగుడైన కొడుకు, కోడలు, మనమరాలు… తాటికమ్మలతో వేసుకున్న గుడిసెలో బతుకుతారు… కొన్నాళ్ల క్రితం కోడలు కన్నుమూసింది… తరువాత మనమరాలు పాము కాటికి బలైపోయింది… ఈ దెబ్బకు మనసు ఖరాబ్ అయిపోయిన కొడుకు పోయి చర్చిలో తలదాచుకుంటున్నడు… నిజమే, అన్నీ సినిమా కష్టాలే…
అయితేనేం..? ఈ ఎస్సయికి ఇదేం వ్యాధి..? వాళ్లనూ వీళ్లనూ అడిగి డబ్బులు తీసుకుని, తనూ కొంత జమేసి, ఆ ముసలామెకు ఇల్లు కట్టించి ఇచ్చాడట..! అరె, సగటు పోలీసు ఇలాంటివి చేస్తే ఇంకేమైనా ఉందా..? సార్, డీజీపీ గారూ… చర్య తీసుకోవాలె సారూ… మరీ ఇంత మానవత్వం కనిపిస్తే అసలు పోలీసు ఉద్యోగానికి ఎంత అప్రతిష్ట..? అసలు వరంగల్ పోలీసు అనే పదానికి ఉన్న పాత ప్రతిష్ట తెలుసా ఈయనకు..?
బాగాలేదు సార్, అస్సలు బాగాలేదు సార్… అసలు పోలీసు అంటేనే… అవసరమైన న్యాయాన్ని ఉల్టా అమలు చేయాలని కదా… మరి ఈయనకు ఇదేమిటి లోపం..? సస్పెండ్ చేసేయండి, వీలయితే సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయండి… ఇంకా వీలయితే ఏమైనా శిక్ష కూడా వేయండి… ఇలాంటోళ్లకు సపోర్ట్ చేసే తెలంగాణ పోలీసు అధికారుల సంఘం గుర్తింపును రద్దు చేసి, ఆ సంఘం బాధ్యులను కూడా అరెస్టు చేసి, సస్పెండ్ చేయాలి సార్…. అసలు పోలీస్ అనే పదానికే కళంకంగా మారడాన్ని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్… ప్లీజ్, పోలీసు అనే పదానికి ఉన్న భయాన్ని కాపాడండి… ప్లీజ్…
Share this Article