ముందుగా ఓ చిన్న డిస్క్లయిమర్ :: ఒక పార్టీ గెలుపు, ఒక నాయకుడి గెలుపు లేదా ఓటముల వెనుక చాలా సమీకరణాలు ఉంటయ్… ఎవరో ఓ మంత్రగాడు వచ్చి అబ్రకదబ్ర అనగానే ఆ మాయ పనిచేయదు… సంక్లిష్టమైన భారతీయ రాజకీయాల్లో, ఏ ఉద్వేగమూ లేని స్థితిలో… ఓ వ్యక్తి వచ్చి, హాంఫట్ అనగానే మార్పులు రావు… కాకపోతే క్రెడిట్స్ వస్తయ్…. ప్రశాంత్ కిషోర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్’ అనే పేరు దక్కించుకోవడానికి జస్ట్, ఇదే కారణం… పీకే అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం… అయితే… తను ఈ సోషల్ దందా, ఎన్నికల వ్యూహరాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించగానే అదే నిజమని నమ్మకండి… మనం నాణేనికి మరోవైపుకి వెళ్దాం ఓసారి… ‘‘నేను ఇక ఈ దందాలో ఉండను, బ్రేక్ తీసుకుంటున్నా, నేను ఫెయిల్డ్ పొలిటిషియన్, ఇంకేదో చేయాలని ఉంది’’ ఇదీ ప్రశాంత్ కిషోర్ ప్రకటన… ఇక పదండి ఓ విశ్లేషణలోకి…
ముందుగా ఆంధ్రజ్యోతి అనబడే పత్రిక గురించి ప్రస్తావన…. ప్రశాంత్ కిషోర్ ఘనత మీద గొప్పగా నాలుగైదు కాలాల స్టోరీ కుమ్మేసింది… కానీ ఇదే జ్యోతి క్యాంపుకు పనిచేస్తున్నది ఇదే పీకే పాత అనుచరుడు రాబిన్ శర్మ… తన నుంచి దూరమై సొంత దుకాణం పెట్టుకున్నాడు… అదేలెండి, ఎన్నికల వ్యూహరచన అనబడే దుకాణం.. ఇదే జ్యోతి క్యాంపుకి వ్యతిరేకంగా పనిచేసింది ఇదే ప్రశాంత్ కిషోర్… జగన్ కోసం ఈరోజుకూ పనిచేస్తున్నాడు, ఇదే జగన్ కనుసన్నల్లో నడుస్తున్న ‘‘విచిత్ర వ్యూహం’’లో భాగంగా షర్మిల పార్టీకి కూడా తనే వ్యూహకర్త… అంతేకాదు, పంజాబ్లో ఎన్నికల వ్యూహకర్త పని కోసం ఆల్రెడీ కంట్రాక్టు కుదుర్చుకున్నాడు, కోట్ల బేరం… అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు తను… నిన్నంతా ఒకటే చర్చ, అరె, మానేస్తున్నాడట కదా, మరి వీళ్ల గతేమిటి అని…
Ads
నిజానికి తను ఈ దందా నుంచి దూరంగా పోవడం లేదు… జస్ట్, దుకాణాన్ని తన టీంకు అప్పగిస్తున్నాడు, తనకు ఓ సమర్థమైన టీం ఉంది, అంటే ఈ దుకాణాన్ని మించిన మరో వర్కు గురించి సీరియస్గా ఉన్నాడు అని అర్థం… మమత ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడై, ఢిల్లీలో తిష్ట వేసి, తనకు పడని మోడీని గద్దె దింపడానికి, భ్రష్టుపట్టించడానికి, అన్ని మోడీయేతర పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాడు… ఇది ఒక ప్రాబబులిటీ… అంతేతప్ప తను దుకాణాన్ని మూసయడం లేదు… చూసుకోవడానికి నమ్మకస్తులైన గుమస్తాలున్నారు కాబట్టి ఈ ధీమా… ఇక తన సక్సెస్ రేటుకు వద్దాం…
నా వారసుడు అని చెప్పుకున్నబీహార్ సీఎం నితిశ్కు వెన్నుపోటు పొడిచింది ఈ పీకేయే… ఆ పార్టీలో కీలక పదవి స్వీకరించి, తరువాత వదిలేసి, ఈ ఎన్నికల వ్యూహవ్యాపారంలోనే మునిగిన వ్యాపారి పీకే… తనకు సిద్ధాంతాలు రాద్ధాంతాలు జాన్తానై… తమిళనాడులో ఒకేసమయంలో కమల్ హాసన్ పార్టీకి, స్టాలిన్ పార్టీకి వర్క్ చేశాడు… వైసీపీ, శివసేన, టీఎంసీ, ఆప్ ఏకకాలంలో తన సేవల్ని వినియోగించుకున్నయ్… అయితే తన చేతిలో మంత్రదండం ఉందా..? అబ్సర్డ్… అదే ఉంటే గత ఎన్నికల్లో యూపీలో బీజేపీకి అన్ని సీట్లు ఎలా వచ్చినయ్, ఎస్సీ-కాంగ్రెస్ ఎందుకు మట్టిగొట్టుకుపోయినయ్… సో, రకరకాల కారణాలు, సమీకరణాలు ఉంటయ్ గెలుపూ ఓటముల నడుమ… కాకపోతే బీజేపీ రెండంకెలు దాటితే సన్యాసం స్వీకరించాడు కదా అనేది ఓ ప్రశ్న…
నిజం… ఆ దందాలో ఉన్నవాడు ఆ ప్రకటన చేయకూడదు… కానీ క్షేత్ర స్థాయిలో బీజేపీ సిట్యుయేషన్ ఏమిటో నిరంతర సర్వేల ద్వారా తెలిసినవాడు కాబట్టి ఆ ధైర్యం చేశాడు, ఏపీలో కూడా దాదాపు ఇలాగే మాట్లాడాడు… ఇది వ్యాపారనీతికి వ్యతిరేకం… కానీ పీకే మార్క్ వ్యాపారంలో చల్తా… మరి కోట్లకుకోట్లు ఇట్టే రావు కదా… మరి ఇప్పుడు..? నో డౌట్… తను తెర మీదకు రాజకీయవేత్తగా రాడు, దానికి పనికిరాడు… తెరవెనుక యాంటీ మోడీ శక్తుల్ని ఏకం చేసే పనిలో ఉండబోతున్నాడు… సక్సెస్ అవుతాడా..? ఏమో, చెప్పలేం… సక్సెసయితే తను హీరో… లేదంటే…… వెలిగీ వెలిగీ అకస్మాత్తుగా తెరమరుగు అయినవాళ్లు చాలామంది ఉన్నారు దేశంలో…!! చివరగా :: వ్యూహకర్తల మంత్రదండాలే గెలిపించే స్థితి ఉంటే… ఈ సిద్ధాంతాలు దేనికి..? మేనిఫెస్టోలు దేనికి..? ఈ ప్రచారాలు దేనికి..? ఈ నాయకత్వాలు దేనికి…!!!
Share this Article