Sai Vamshi…… ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది?
తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి.
ఈ నోటీసుల విషయం గురించి ఎదురుగా ఉన్న యాంకర్ ఏదో మాట్లాడుతుండగా ఆయన కట్ చేసి “సీ! ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం 50 ఏళ్లుగా మిత్రులు. వాళ్ల మధ్య ఇంతకుముందు ఏమీ సమస్యలు రాలేదని మనం అనుకోలేం! అవి వాళ్ల మధ్యే పరిష్కారం అయ్యాయి. ఇదీ అలాగే పరిష్కారం అవుతుంది. ఎందుకు దాన్ని ఒక పెద్ద విషయంగా మారుస్తారు. అయినా ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం ఇంటి ముందు టెంట్ వేశారా? లేక స్టేజీ ఎక్కి నానా మాటలు తిట్టారా? న్యాయంగా నోటీసులు పంపారు. అంతే కదా! దానికి బాలసుబ్రహ్మణ్యం సమాధానం ఏమిటో మీకేమైనా తెలుసా? ఏమీ తెలియకుండా ఎందుకు మాట్లాడటం?” అని అడిగారు.
Ads
ఆ తర్వాత టాపిక్ పాటల హక్కుల మీదకు తిప్పాడు ఆ యాంకర్. పాటల మీద కాపీరైట్ ఏంటి? ఒకవేళ ఉన్నా అది డబ్బులు పెట్టిన నిర్మాతలకు కదా చేరాలి అని అన్నాడు. “అయితే సినిమాలో నటించే నటులకు అవార్డులు ఎందుకు? వాళ్లు డబ్బు తీసుకుంటున్నారు కదా! లెక్క ప్రకారం అవన్నీ నిర్మాతకు చేరాలి కదా?” అన్నారు. అవతలి నుంచి పాయింట్ ఏమీ రాలేదు.
ఆ తర్వాత ఆయన వివరించారు. “1980లో ఇళయరాజా ఉధృతంగా ఉన్న టైంలోనే ఆయన సొంత ఆడియో కంపెనీ మొదలుపెట్టారు. ఏదైనా సినిమా వస్తే దాని ఆడియో హక్కులు ఆ కంపెనీకే ఇవ్వాలని అనేవారు. ఒకవేళ అవతల ఉన్నది పెద్ద నిర్మాతలైతే ఆయన ఆ పాటల తెలుగు రైట్స్ అడిగేవారు. ఇదంతా ఇళయరాజా అడిగేవారు కాదు, ఆయన మేనేజర్ కల్యాణం చూసుకునేవారు. ఇళయరాజా చాలా బిజీ. ఆయన దగ్గర ఈ లెక్కలు, హక్కులు అంటూ కూర్చుంటే కష్టం. రెమ్యూనరేషన్, బాకీలు, హక్కులు, డబ్బులు అన్నీ కల్యాణం, మిగిలినవాళ్లు చూసేవాళ్లు.
ఇళయరాజా చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు తన టాలెంట్‌తోపాటు దానికున్న మార్కెట్ విలువ కూడా తెలుసు. అందుకే అందుకు తగ్గట్టు డిమాండ్ చేసేవారు. ఎన్నో సినిమాలు ఆయన మ్యూజిక్ వల్లే హిట్ అయ్యాయి. ఎన్నో యావరేజ్ సినిమాలు ఆయన సంగీతం వల్ల బ్లాక్ బస్టర్ అయ్యాయి. అవన్నీ తెలిసి మనిషి ఆయన. ఆయన కాల్షీట్ కోసం నెలలకు నెలలు ఎదురుచూసిన నిర్మాతలు ఉన్నారు. ముందే రైట్స్ తన కంపెనీవి అని ఆయన చెప్పి, వీళ్లు ఇచ్చాక ఇంక ఇందులో దోషం ఏముంది?”
ఆ తర్వాత యాంకర్ అసలైన ప్రశ్న సంధించారు. “హక్కులు ఆయనవే అయితే మాత్రం! ఎవరూ పాడకూడదా? ఏదో సరదాగా పాడితే తప్పా? ఇళయరాజా ఇలా అందరికీ నోటీసులు పంపిస్తారా?” అని. దానికి ఆ నిర్మాత ఫర్ఫెక్ట్ సమాధానం ఇచ్చారు. “సినిమా పాట అంటేనే అందరూ పాడుకోవడం కోసం తయారవుతుంది. ఆయన మామూలు జనాలకు ఏమైనా నోటీసు ఇచ్చారా? నా పాట మీ ఇంట్లో పాడకూడదు అని ఆదేశించారా?
ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడింది అంధుల పాఠశాలలోనా? లేక ఏదైనా సామాజిక ప్రయోజనం కోసమా? అదొక కమర్షియల్ కార్యక్రమం. దానివల్ల వాళ్లకూ, ఆ ఆర్గనైజర్లకూ డబ్బు వస్తుంది. తన పాటలతో వాళ్లు డబ్బు సంపాదించడం ఏమిటి అని ఇళయరాజా భావించి ఉండొచ్చు. మనం మన ఇంట్లో ఆయన పాట పాడితే నోటీసులు పంపలేడు కదా? అలా పంపాలంటే మొత్తం భారతదేశంలో ఎంతమందికి పంపుతాడు?
ఇంకో విషయం! కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజా పాటే కాదు, ఆ పాటలో చిన్న హమ్మింగో, ఒక బిట్టో మరెక్కడైనా వాడితే తప్పకుండా ఆయన అనుమతి తీసుకోవాలి. ఆయన ఇస్తాడా, ఇవ్వడా, మళ్లీ డబ్బులు అడుగుతాడా అనేది తర్వాతి కథ. ముందుగా ఆయన అనుమతి అయితే కావాలి. అది చట్టం. అయినా ఇళయరాజా 1980లో చేసిన పాటలు కూడా ఇంకా స్టేజీల మీద పాడుతున్నారు, జనం విని ఆనందపడుతున్నారు అంటే అది ఆయన పాటల గొప్పతనం కదా!
ఇన్నేళ్ల తర్వాత కూడా నిలిచేలా ఆ పాటలు చేసినందుకు ఆయనకు వాటిపైన తప్పకుండా హక్కు ఉంటుంది. అవి లేకుండా ప్రోగ్రాం చేయలేనంత గొప్పగా ఆయన పాటలు ట్యూన్ చేశాడని ఒప్పుకున్నట్టే కదా! మరి వాటిపై ఆయనకు కాకుండా ఎవరికి హక్కుంటుంది?
వేరే వాళ్లెవరూ నోటీసులు ఇవ్వలేదు. ఇళయరాజా మాత్రమే ఇచ్చాడని అనుకుంటే, ఆయనే దీన్ని మొదలుపెట్టారు అనుకోవచ్చు. ఏమో! ఈ తర్వాత ఈ ఒరవడి కొనసాగవచ్చేమో?” అని ముగించారు.
PS: ఇళయరాజా వ్యవహార శైలి విషయంలో నాతో సహా అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇదొక ముఖ్యమైన సమాచారం కాబట్టి రాస్తున్నాను.
Share this Article