‘‘రాజకీయాల్లో ఎప్పుడూ రెండురెళ్లుఆరు అవుతుంది తప్ప నాలుగు కాదు… తెర మీద ఓ పులితోక కనిపిస్తున్నదీ అంటే..? దాని వెనుక పులి ఉండొచ్చు, లేకపోవచ్చు… లేదా ఏ గొర్రెతోకనో పులితోకగా చూపిస్తూ ఉండవచ్చు… అసలు తోక తప్ప వెనుక ఏదీ ఉండకపోవచ్చు… అసలు తోక కనిపించడమే ఓ భ్రమ కావచ్చు… రాజకీయమంటేనే అది… తెర వెనుక లక్ష్యాలు, వ్యూహాలు లోతుగా, మార్మికంగా ఉంటయ్… జగన్-షర్మిల యుద్ధం కూడా అలాంటిదేనోయ్….’’ అని పొద్దున్నే ఓ పెద్దమనిషి గీతాసారం బోధించాడు… అదెలా అనడక్కుండానే తనే వివరిస్తూ వెళ్లాడు… ‘‘నిజానికి ఆంధ్రజ్యోతి అండ్ తెలుగుదేశం క్యాంపులు చంకలు గుద్దుకుంటున్నయ్… కానీ ఇదంతా జగన్, కేసీయార్ జాయింట్ ఆపరేషన్ అన్నాడు… ఆంధ్రజ్యోతి కథనం చదివిన షాక్కన్నా ఇది మరీ విభ్రమ స్థాయి… రాజకీయాల్లో సరిగ్గా ఇదీ ప్లాన్, ఇలాగే జరుగుతుందీ అన్నట్టుగా కంప్యూటరైజ్డ్ ప్రోగ్రాములు ఏమీ ఉండవు… రకరకాల పాచికలు ఎవరి కోణంలో వాళ్లు వేస్తుంటారు… షర్మిల కూడా ఓ పాచిక… అంతే అన్నాడు…
ఆయన చెబుతున్న కారణాలు ఏమిటంటే..? చాలాదూరం వెళ్లిపోయాడు… నమ్మాలని లేదు, నమ్మకూడదని ఏమీ లేదు… నమ్మూనమ్మకపో అనే స్టయిల్లోనే ఉంటాయి కదా రాజకీయ కథనాలు…
Ads
- మొన్న గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ వోట్లు, యాంటీ కమ్మ వోట్లు, రెడ్డి వోట్లు కేసీయార్‌ను గట్టెక్కించాయి తెలుసు కదా… అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం… తెలంగాణ ఎమోషన్ పూర్తిగా తగ్గిపోయి, ఇక కేసీయార్ ఆ కోణంలో ఏం చెప్పినా జనం నమ్మరు, నమ్మడం లేదు… జనంలో తన మీద వ్యతిరేకత పెరుగుతోంది… ఈ వ్యతిరేక వోటు చీల్చాల్సి ఉంది… హరీష్-కేసీయార్ మధ్య పొసగడం లేదు, హరీష్ బయటికి వెళ్తాడు అని ప్రచారం చేసీ చేసీ, హరీష్‌తో వేరే పార్టీ పెట్టించి, కేసీయార్ వ్యతిరేక వోటు చీల్చాలీ అనే ప్లాన్ ఒకటి ఉంది… అయితే దానికన్నా బెటర్ ప్లాన్ షర్మిల…
- షర్మిల పేరుతో ఓ కొత్త పార్టీ పెట్టిస్తే… అదీ అన్నతో పడటం లేదు కాబట్టి, కోపంతో కొత్త పార్టీ పెడుతుందీ అని నమ్మించగలిగితే… 1) రేవంత్‌రెడ్డి వైపు రెడ్లు ర్యాలీ గాకుండా అడ్డుకట్ట వేయవచ్చు… 2) కాంగ్రెస్ నుంచి రెడ్లను ఇంకా కత్తెర వేయవచ్చు… 3) రెడ్లు బీజేపీ వైపు వెళ్లకుండా, అదింకా బలపడకుండా నిలువరించవచ్చు… 4) వైఎస్ అంటే అభిమానించే వాళ్లు, రెడ్లు, యాంటీ కమ్మ వోట్లు, తెలంగాణ క్రిస్టియన్లు, యాంటీ కేసీయార్ వోట్లు గట్రా కలిస్తే… షర్మిల ఓ బలమైన గ్రూపుగా మారుతుంది… 5) రేవంత్‌రెడ్డికి కత్తెర వేయడం అంటే చంద్రబాబుకు కత్తెర వేయడమే… 6) ఇదే అసలు ప్లాన్ కాబట్టి… రాజన్నరాజ్యం అనే ఓ భ్రమాత్మక పదాన్ని ముందుపెట్టి, ఆమెను ముందుపెట్టి నడిపించబోయే ఓ కొత్త రాజకీయ ప్రహసనం… పాపం ఆమె ఎప్పుడూ అన్న చేతిలో బాణమే కదా…
- కానీ జనం నమ్మాలి కదా… అందుకని ఆమె కొత్త పార్టీ అవసరాల కోసం, ఫిబ్రవరి 9న వెంటనే స్టార్ట్ చేయడం కోసం, డబ్బు కోసం… హైదరాబాద్ పరిసరాల్లో తన పేరిట ఉన్న 50 ఎకరాల్ని అమ్మేసింది… బెంగుళూరులో అత్యంత విలువైన రెసిడెన్షియల్ ల్యాండ్ డెవలప్మెంటుకు ఇచ్చేసింది… అందరికీ ఫోన్లు చేస్తోంది… పాత వైఎస్ ఫ్యాన్స్ అందరినీ కలిసి రమ్మంటోంది… వెనక్కి పోయేది లేదు అని నమ్మేలా చెబుతోంది…
- ఇదంతా ప్రిప్లాన్డే కాబట్టి టీఆర్ఎస్ కిక్కుమనదు… జగన్ కుటుంబం మాట్లాడదు… వైసీపీ కూడా అధికారికంగా స్పందించదు… ఆఫ్టరాల్ ఒక రాజ్యసభ సీటు కోసం ఈ అన్నాచెల్లెళ్ల పంచాయితీ అంటే నమ్ముతారా ఎవరైనా..? అందుకని రాజన్నరాజ్యం గట్రా పడికట్టు పదాల్ని కొన్ని ప్రయోగిస్తున్నారు…
- …………… ఇదీ సదరు పెద్దమనిషి సుదీర్ఘంగా, లంబాచోడా చెప్పుకొచ్చిన కథ… అవును మరి, ఆంధ్రజ్యోతి ప్రచారాన్ని నమ్మినప్పుడు ఇదీ నమ్మాలి… అవునూ… జగన్ విసిరిన క్యాంపెయిన్ ట్రాపులో రాధాకృష్ణ పడ్డాడా..? నేనే జగన్‌ను ఫేక్ ప్రచారం ట్రాపులోకి లాగుతున్నానని నమ్ముతున్నాడా..? జగన్ తనలోతాను నవ్వుకుంటున్నాడా..?
Share this Article