.
అగ్నిపర్వతం బద్ధలైతే లావా విస్ఫోటనం చెందినట్టు… ప్రవాహంగా మారినట్టు… ఆ ఎడారి నేలలో నీటి కోసం ఎవరో బోర్ తవ్వుతుంటే, భూగర్భంలో ఏదో బద్ధలైనట్టు… జలం ఉవ్వెత్తున పైకి ఎగిసిపడింది…
విభ్రమ… అబ్బురం… వింత… ఒక నదీ ప్రవాహం భూమి నుంచి పైకి ఎగదన్నినట్టుగా…! ఆ నీటితో పరిసరాలన్నీ నీటిలో మునిగిపోయి… పారే నీటితో ఓ వాగు, ఓ ప్రవాహం ఏర్పడిపోయింది… ఇది కల్పన కాదు, ఫాంటసీ గ్రాఫిక్ మాయ కూడా కాదు… నిజం…
Ads
అది రాజస్థాన్ లో జైసల్మేర్, మోహన్‌గఢ్ ప్రాంతం… బోర్ తవ్వుతున్న పొలం యజమాని విక్రమ్ సింగ్… ‘‘నెల క్రితం జిలకర వేశాను… ఇప్పటికే రెండు బోర్‌వెల్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో ఉప్పునీరు… అందుకని మరో బోర్‌వెల్ తవ్వడం వారం క్రితం ప్రారంభించాం..’’ అంటున్నాడు తను…
దాదాపు 850 అడుగులు తవ్విన తరువాత ఈ హఠాత్పరిణామం… దీంతో అర కిలోమీటర్ పరిధిలో ఇళ్లన్నీ ఖాళీ చేయించారు అధికారులు… వింత కనిపిస్తే దేవుడి మాయ అని తక్షణం పూజలు ప్రారంభిస్తుంటారు కదా… మరో గంగ పుట్టింది అంటూ కొందరు పుణ్యస్నానాలు కూడా ప్రారంభించారు… అది సరే గానీ, ఆ నీరు ఎక్కడిది..? వందల అడుగులు తవ్వినా నీటిజాడ కనిపించని ఆ ప్రాంతంలో ఈ నీరేమిటి..? ఇదీ ప్రశ్న…
ఉంటుంది… ప్రతి పరిణామానికి ఏదో ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది… అది తేలేవరకు వింత… ఈలోపు చాలామంది ఇది సరస్వతి నది కావచ్చననే ఊహాగానాలు స్టార్ట్ చేశారు… గతంలో ఆ నది ఉనికి ఉండేది… కానీ తరువాత ఏమైందో, ఎలా మాయమైందో ఎవరికీ తెలియదు…
భూగర్భంలో ఇంకా ఆ ప్రవాహం ఉండవచ్చుననే పరిశోధనలూ సాగాయి, సాగుతున్నాయి… ఇంకా ఏమీ తేలలేదు… ఏమో, ఆ నది ఎండిపోయింది… కానీ దాని తాలూకు నిల్వలు భూగర్భంలో సరస్సులుగా అక్కడక్కడా ఉండిపోయాయేమో… అలాంటిదే ఈ బోర్ తవ్వకంలో బయటపడిందేమో… ఇది ఒక వాదన… శాస్త్రీయ ఆధారం లేదు…
అంత పైకి ఉబకడానికి కారణం భూగర్భంలోని రాతి పొరల నడుమ ఉన్న నీరు సహజవాయువుతో కలిసి పైకి విస్ఫోటనం చెందడం కావచ్చునని మొదట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు… ఓఎన్జీసీ అధికారులు అక్కడికి చేరి పరిశోధిస్తున్నారు… ఇంకోవైపు రాష్ట్ర భూగర్భజలశాఖ కూడా మరో అధ్యయనం చేస్తోంది…
వాళ్ల ప్రాథమిక అంచనా మరింత విస్మయం గొలిపేదిగా ఉంది… ఆ శాఖ చీఫ్, సైంటిస్టు నారాయణదాస్ ఇంఖియా ఏమంటాడంటే..? ‘‘ఇప్పుడే ఏమీ చెప్పలేం, నీటితోపాటు పైకి చిమ్ముతున్న ఇసుక శాంపిల్స్ సమగ్ర పరీక్షలకు పంపించాం… కానీ ఇది సరస్వతి నది కాదు, అది క్లియర్… ఎందుకంటే, ఈ నీటి టీడీఎస్ (నీటిలోని లవణ సాంద్రత) 5000 ఉంది…
సముద్రజలంలోని లవణసాంద్రత కూడా ఇదే స్థాయిలో ఉంటుంది… గతంలో బాబా ఆటమిక్ రీసెర్స్ సెంటర్ వాళ్లు ఈ ప్రాంతంలోని భూగర్భంలో శిలాయుగపు నీటిమార్గాలు ఉన్నట్టు కనుగొన్నారు… అంటే కఠినమైన పొరల దిగువన నీటిప్రవాహాలు… కాకపోతే అవి దుర్బేధ్యం… ఇక్కడ అది చేధించబడి, ఆ నీరు పైకి సముద్రపు బంకమట్టి, ఇసుకతో కలిసి పైకి తన్నుకువస్తోందని భావిస్తున్నాం…
ఈ ఇసుక, ఈ మట్టి 6ం లక్షల సంవత్సరాల క్రితంది… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా ఎడారి కాదు… అప్పుడు టెథ్లిస్ అనే సముద్రానికి కోస్తాతీరం ఇది… కాలగతిలో అన్నీ మారిపోయాయి… డైనోసార్లు కూడా ఎక్కువ నీటిలోతుల్లో ఉండేవి… అనేక శిలాజాలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయి…
ఈ ప్రాంతమే కాదు, జపాన్, థాయ్‌లాండ్ ప్రాంతాలు కూడా… ఇప్పుడు బయటపడుతున్న ఈ నీరు నాటి సముద్రపు ఉనికిని నిరూపించేది… ఇదీ మా ప్రాథమిక అంచనా… మరిన్ని అధ్యయనాలు, పరిశోధనల తరువాత శాస్త్రీయ కారణం ఏమిటో తుది అంచనాకు రాగలమేమో…’’ అని వివరించాడు…
ఒక బోర్‌వెల్ నుంచి ఓ నీటిప్రవాహం ఎగదన్నడం ఏమిటి..? కోట్ల ఏళ్ల నాటి సముద్రపు ఉనికిని బయటపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదా..? అవును, ప్రాథమికంగా అది వింత మాత్రమే… అసలు నిజం తేలేవరకు..!!
Share this Article