.
దీపిక పడుకోణ్… కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది… ఈసారి ఆమె అభిమానులు తలెగరేసుకునే వార్త… ఆమె అంతర్జాతీయ వినోద పరిశ్రమకు సంబంధించిన ఓ అరుదైన, విశిష్టమైన గౌరవాన్ని పొందింది… హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ జాబితాలోకి చేరిన ఏకైక భారతీయ నటి …
ప్రపంచ వినోద పరిశ్రమ ఈ గౌరవాన్ని ఘనమైన జీవిత పురస్కారంగా భావిస్తారు… మనస్పూర్తిగా అభినందనలు చెప్పాల్సిందే… ఐతే, కొన్నాళ్లుగా ఆమెను ఓ వివాదంలోకి పదే పదే లాగుతున్నారు కదా… ఈ పురస్కాారం మీద కూడా అప్పుడే మొదలయ్యాయి విమర్శలు, ఆరోపణలు, వెక్కిరింపులు…
Ads
‘‘ఆమె ఆ పురస్కారాన్ని బాగా ఖర్చు చేసి కొనుక్కుంది’’ అనేది ఆ విమర్శల సారాంశం… ఆమెపై పలుసార్లు నెగెటివ్ వార్తలు వచ్చాయి, అవన్నీ వేరు… తెలుగు డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి తన సినిమా నుంచి ఆమెను తొలగించి, మరొకరిని పెట్టుకున్నాడు… (ఆ సినిమా పట్టాలు ఎక్కుతుందానే డౌట్ కూడా ఉంది చాలామందిలో)…
ఇక మొదలయ్యాయి విమర్శలు… ఆమె రెమ్యునరేషన్ మరీ అడ్డగోలుగా అడిగింది… లాభాల్లో వాటా అడిగింది… ఆరేడు గంటలు మాత్రమే పనిచేస్తానని షరతు పెట్టింది… ఇలా… ఆ దర్శకుడు భలే చేశాడు, లేకపోతే ఏమిటీ షరతులు, బాగా అహం తలకెక్కింది అని ట్రోలింగ్…
నిజానికి ఆమె వైపు నుంచి తప్పేముంది..? ఆమె పాపులారిటీ ఉపయోగపడుతుందనే కదా తొలుత ఆమెను తీసుకుంది, అడిగినంత ఇస్తానని చెప్పింది… మళ్లీ ఇప్పుడు రెమ్యునరేషన్ మీద విమర్శలేమిటి..? పైగా ఆమె ఇప్పుడు తల్లి, బిడ్డతో గడపటానికి, తన కంఫర్ట్ వర్కింగ్ అవర్స్‌ను ఆమె అడిగినా తప్పేముంది..? కుదరదు అంటే చెప్పేయడమే, కానీ ఆమెను తీసేసామని కోపంతో తన స్టోరీ లీక్ చేస్తోందని నిందలు వేశాడు ఆ దర్శకుడు…
ఆమె ఇవన్నీ లైట్ తీసుకుంది, నిజానికి ఆ సినిమా నుంచి తనే తప్పుకుంది, ఎవరూ తీసేయలేదు… క్రియేటివ్ డిఫరెన్సెస్ వంటి కుంటిసాకులు కూడా చెప్పలేదామె… జస్ట్, క్విట్ అండ్ ఫర్‌గెట్ ఇట్… ఇప్పుడిక ఆమె ఆ అంతర్జాతీయ హాలీవుడ్ బోలెడు డబ్బు ఖర్చుచేసి, ఆ గౌరవాన్ని కొనుక్కుందీ అని మళ్లీ విమర్శలు…
చిన్నాచితకా స్కోచ్ అవార్డుల దగ్గర నుంచి ఆస్కార్ దాకా ‘లాబీయింగు’తో కొనుక్కోలేని అవార్డులు లేవు కదా, అందుకని ఈ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ పురస్కారాన్ని కూడా కొనుక్కుందనే వార్తలు కూడా నిజమేనేమో అని ప్రేక్షకులు సందేహిస్తున్నారు… నిజానికి ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పుడే కొత్తేమీ కాదు…
2018లో టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మంది మోస్ట్ ఇన్‌ఫ్లున్షియల్ పీపుల్ జాబితాలో ఉంది ఆమె పేరు… 2022లో వరల్డ్ ఫుట్‌బాల్ ప్రపంచకప్పును ఆవిష్కరించింది… 2023 ఆస్కార్ వేడుకల్లో నాటునాటు పాటను పరిచయం చేసింది… కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ జ్యూరీలో ఉంది ఓ సంవత్సరం… 2017లోనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించింది…
సరే, మరి ఈ కొత్త గౌరవం కొనుగోలు విషయానికి వస్తే… ఇప్పటికి 2800 మందికి ఆ గౌరవం దక్కింది… మోషన్ పిక్చర్, టీవీ, రేడియో, థియేటర్ (లైవ్) వంటి విభాగాల్లో అర్హులను ఎంపిక చేస్తారు… అర్హత సాధించాలంటే, ఆ వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాల పాటు పరిశ్రమలో మంచి పర్ఫామెన్స్ కనబరిచి ఉండాలి… వారు తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిద్ధి చెందాలి…
దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారని రుజువు వంటివి కూడా… వ్యక్తి తరఫున స్నేహితులు, అభిమానులు, నిర్వాహకులు లేదా స్పాన్సర్లు ఎవరైనా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం $275 దరఖాస్తు రుసుము చెల్లించాలి. సమ్మతి తప్పనిసరి…
ప్రతి జూన్‌లో, వాక్ ఆఫ్ ఫేమ్ కమిటీ దాదాపు 200 ప్రతిపాదనల్ని పరిశీలిస్తుంది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నామినేషన్లను ఫిల్టర్ చేసి ఆమోదిస్తుంది.., కెరీర్ మెరిట్, పాపులారిటీ, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇండస్ట్రీకి తమ కంట్రిబ్యూషన్ వంటి చాలా పారామీటర్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం 20 నుండి 30 పేర్లను ఎంచుకుంటుంది…
అది పూర్తయిన తర్వాత, స్పాన్సర్, సాధారణంగా స్టూడియో, బ్రాండ్ లేదా అభిమానుల సమూహం కూడా ఆ స్టార్ కోసం బిల్లు చెల్లించాలి.., ప్రస్తుతం దీని ధర $75,000 – $85,000 మధ్య ఉంటుంది… ఇక్కడే ఎక్కువ గందరగోళం మొదలవుతుంది… సెలబ్రిటీలు వీటిని కొనుగోలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు…
ఐతే తుది పరిశీలన దశకు వచ్చాక కదా ఆ డబ్బు చెల్లించేది (ఎవరు చెల్లిస్తారనేది వేరే సంగతి)… అంతకుముందు చాలా దశల స్క్రీనింగ్, వడబోత ఉంటుంది కదా… సో, దీపికకు దక్కిన ఈ గౌరవాన్ని ‘కొనుగోలు చేసిన అవార్డు’గా కించపరచాల్సిన అవసరం లేదు… అదంత సులభంగా దొరికే సరుకు కూడా కాదు..!!
Share this Article