Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్ సభలో తొక్కిసలాటపై పొలిటికల్ కుట్రల సందేహాలు..!!

September 29, 2025 by M S R

.

ద్రవిడ పార్టీల రాజకీయ సిద్ధాంతాలు, నాస్తికత్వ ప్రచారం కారణంగా… తమిళనాడులో హిందూ దేవుళ్ల పూజలు తక్కువే… కానీ చిల్లర దేవుళ్లు, అనగా సినిమా నటులు, నాయకుల పూజలు ఎక్కువ… మూఢత్వం… వ్యక్తి పూజల్లో తమిళులే పీక్స్…

కమలహాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ డిజాస్టర్ కావడంతో… పర్లేదు, తమిళుల్లోనూ ఇంగితం పెరుగుతోందని అనుకునే సమయంలో విజయ్ ఊడిపడ్డాడు… తన సభలకు జనం పోటెత్తుతున్నారు… ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత… సినిమా వాళ్లే పాలించే రాష్ట్రం అది… కాకపోతే పిరికి రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం, కమలహాసన్‌ వైఫల్యం కారణంగా… ఇక ఈ సినిమారాజకీయాలకు తెరపడ్డట్టే అనుకుంటున్న దశలో విజయ్ వచ్చిపడ్డాడు…

Ads

ఒరే, నాన్నా, మన సభలకు జనం భారీగా సునామీల్లా వచ్చిపడతారు, కానీ వోట్లు వేయరు అని కమలహాసనే విజయ్‌కు స్పష్టంగా చెప్పాడు తన స్వీయానుభవాన్ని… వింటే విజయ్ ఎందుకవుతాడు..?

చిరంజీవి సభలకూ జనం పోటెత్తేవాళ్లు… వేదిక వద్దకు కూడా చేరుకోలేని సంఘటనలు బోలెడు… 18 సీట్లతో సరి… చివరకు కాంగ్రెస్‌లో నిమజ్జనం… పవన్ కల్యాణ్ కథేమిటి..? చిరంజీవిని మించిన క్రేజు జనంలో… కానీ తనతోపాటు ఒక్క సీటూ గెలవని వైనం చూశాం… టీడీపీ, బీజేపీ వోటు కలిసి… జగన్ వ్యతిరేక వోటు కారణంగా మొన్నటి ఎన్నికల్లో విజయాలు… అవి పూర్తిగా పవన్ కల్యాణ్ సొంతవిజయాలు కావు…

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని జనం అర్థం చేసుకుంటున్నారు… కానీ ఈ నిజాన్ని సోకాల్డ్ హీరోలు ఒప్పుకోరు… కార్యకర్తలు వేరు, అభిమానులు వేరు అనే సత్యం అర్థం చేసుకోరు, పార్టీ నిర్మాణాలు ఉండవు, ఎప్పుడూ జనంతో ఉండాలని చూడరు, ఉండలేరు, ఫ్యానిజం ఉండనివ్వదు…

ఇక విజయ్ ఏం ఫలితాలు సాధించబోతున్నాడో రాబోయే ఎన్నికల్లోనే చూడాలి… ఇప్పుడే అంచనాలు వేయలేం… ప్రస్తుత పక్షపాత సర్వేలు నిజాల్ని చెప్పవు… ఐతే విజయ్ పార్టీని అధికార డీఎంకే ఓ థ్రెట్ అని భావిస్తోందా..? తమ సొంత సర్వేల్లో విజయ్ పట్ల ప్రజాదరణ కనిపించి ఉలిక్కిపడుతోందా..? విజయ్ సభలపై అదే కుట్ర పన్నుతోందా..?

నిన్నటి కరూర్ తొక్కిసలాటపై తమిళ మీడియాలో ఇవే విశ్లేషణలు కనిపిస్తున్నాయి… డీఎంకేకు బాసటగా ఉన్న హిందూయేతర అంటే, ముస్లిం, క్రిస్టియన్ మత వోట్లను విజయ్ కొల్లగొట్టబోతున్నాడట… దానికితోడు ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండనే ఉంది… మొన్నటి ఎన్నికల్లో జయలలిత లేని ఎఐడీఎంకే నాయకత్వ వైఫల్యం డీఎంకేను గెలిపించింది తప్ప అది పూర్తిగా డీఎంకే పాజిటివ్ వోటు మాత్రం కాదు…

డీఎంకే సెక్యులర్ కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్, చిన్నాచితకా ద్రవిడ పార్టీలతోపాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఉంది… ఇప్పుడు తన సెక్యులర్, హిందూయేతర వోట్లను విజయ్ టీవీకే పార్టీ చీలుస్తుందని స్టాలిన్ భయమని చెబుతున్నారు…

కరూర్ సభలో రాళ్లు విసరడం, కరెంటు తీసేయడం, లాఠీచార్జి వల్లే తొక్కిసలాట జరిగిందని, ఇది అనుకోకుండా జరిగింది కాదనీ, ఉద్దేశపూర్వక కుట్ర అనీ, సీబీఐ దర్యాప్తు కావాలనీ టీవీకే లీగల్ సెల్ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది… తొక్కిసలాట అనంతరం డీఎంకే యూత్ వింగ్ విజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు… విజయ్ కూడా డీఎంకే తను బలపడకుండా కుట్రలు చేస్తోందనీ ఆరోపించాడు గతంలో…

ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా కలిసి నడుద్దామని ఎఐడీఎంకే, బీజేపీ విజయ్‌కు చెబుతున్నాయి… తానొక్కడినే గెలుపు సాధించగలననే ధీమాతో విజయ్ ఒప్పుకోవడం లేదు… ఎవరితోనూ కూటమి కట్టేది లేదని అంటున్నాడు… కానీ విజయ్ ఎప్పటికైనా డీఎంకే వ్యతిరేక కూటమిలోకి వస్తాడనే నమ్మకంతో ఎఐడీఎంకే గానీ, బీజేపీ గానీ విజయ్ మీద పొలిటికల్ దాడులు చేయడం లేదు… అందుకే నిన్నటి తొక్కిసలాటపైనా ప్రభుత్వాన్ని తిట్టాయి తప్ప విజయ్ మీద విమర్శల్లేవు…

విజయ్ సొంతంగా బరిలో ఉంటే… యాంటీ డీఎంకే వోటు, ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలి… గతంలో చిరంజీవి పార్టీ వైఎస్‌కు పరోక్షంగా ఉపయోగపడినట్టు… విజయ్ ఉనికి స్టాలిన్‌కు మేలు చేస్తుందనే సందేహం కూడా ఎఐడీఎంకే- బీజేపీ కూటమిలో ఉంది… ఒకటీరెండు సర్వేలు విజయ్‌కు 7 నుంచి 9 శాతం వోట్లు రావచ్చునని చెబుతున్నాయి… సో, విజయ్ ఎటువైపు..? రాబోయే తమిళ ఎన్నికలను ఈ అంశమే శాసించబోతోంది..!! సో, నిన్నటి తొక్కిసలాట తమిళ రాజకీయాల్లో ఓ మార్పును తీసుకురాబోతోందా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions