నిజానికి రెండూ వేర్వేరు… ఒకటి కల్పన… అంటే ఒక కథ… రెండోది రియాలిటీ… మన కళ్లెదుట కనిపించే నిజం… రెంటినీ పోల్చడం ఒక కోణంలో కరెక్టు కాదు… కానీ నిన్నాఈరోజు మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు ఓ పోలిక స్ఫురించడం సహజం… తేడాలపై ఆలోచన సాధారణం… ఈ ఫోటోలో మొదటిది పింకీ… నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాడు తెలుగులో తీయించిన ఓ కొత్తతరం అంథాలజీ ఫిలిమ్ పిట్టకథల్లోని ఒక కథలో ఒక పాత్ర… రెండోది మార్స్‌పైకి నాసా పంపించిన ఒక రోవర్‌ను ఆ ఉపరితలంపై పదిలంగా దింపిన ఒక టీంకు లీడర్… స్వాతి మోహన్… పింకీ కథ చూసిన ప్రేక్షకుడు థూ అన్నాడు… ఈ కథను తీసింది సంకల్ప్రెడ్డేనా అని ఆశ్చర్యంగా చూశాడు… చీదరించుకున్నాడు… కానీ రోవర్ అరుణగ్రహంపై దిగగానే ఆ ఎర్రటి గ్రహపు వెలుగు స్వాతి మోహన్ బొట్టులో తళుక్కుమని మెరిసింది… ప్రతి భారతీయ యువతి తనను ఆమెలో చూసుకుని గర్వించింది… అయితే..?
మన ది గ్రేట్, స్టార్ దర్శకులకు నవతరం మహిళలు అనగానే పింకీ వంటి లస్ట్ కథలే గుర్తొచ్చాయి… కానీ స్వాతి మోహన్ వంటి సక్సెస్ స్టోరీలు, స్ఫూర్తినిచ్చే విజయగాథలు గుర్తుకురాలేదు… ఇంట్లో, వంటింట్లో, బజారులో, ఆఫీసుల్లో వేధింపులు, వెంటాడటాలు, అత్యాచారాలు… తీర్పుల్లో, విచారణల్లో, దర్యాప్తుల్లోనూ మగవివక్షలు, చాకిరీలు, అభద్రతలు ఏమీ గుర్తుకురాలేదు… దర్శకుడు సంకల్పరెడ్డికి గుర్తొచ్చింది పింకీ… మొగుడిని వదిలేస్తుంది… తల్లి చెబితే ఇంకో పెళ్లి చేసుకుంటుంది… వాడితోనూ ఘోరమైన ప్రవర్తనే… మళ్లీ పాత భర్త యాదికొస్తాడు… వాడితోనే ఎఫయిర్… దాన్నేమనాలో… తరువాత కడుపు… వాడి కాపురంలోనూ చిచ్చు… ఇదీ కథ… ఈమేనా నవతరం మహిళ… దీనికే ఎక్స్‌ప్లోరింగ్ ఉమన్ అని ట్యాగ్… నెట్‌ఫ్లిక్స్ వాడిదేముంది..? వాడికి తెలుగు తెలుసా పాడా..? ఏ కథను తీస్తున్నామో, దేన్ని రేపటి మహిళగా చిత్రిస్తున్నామో, జనానికి ఏం చెబుతున్నామో ఈ కథకులకు, ఈ దర్శకులకు సోయి ఉండాలి కదా… ఈషారెబ్బా కావచ్చు, సత్యదేవ్ కావచ్చు, నాలుగు డబ్బులు తీసుకుని, నటించి వెళ్తారు… కానీ తను చెబుతున్నదానికి జవాబుదారీ దర్శకుడే కదా… ఆధునిక స్త్రీ అంటే ఇదా వీళ్లు సమాజానికి చూపించే బాట..?
Ads
ఒక్క స్వాతి మోహన్ విజయాన్ని వదిలేయండి… బోలెడు మంది మహిళలు మన కళ్ల ముందే ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని సంకల్పంతో, ఆధునిక జ్ఞానంతో మగాళ్లకు దీటుగా… కాదు, అనేకసార్లు దాటేసిన ప్రతిభ చూపిస్తున్నారు… ఆ బాటలో వాళ్లు ఎదుర్కున్న వివక్షలు, అవమానాలు, తడబాట్లు, పెయిన్ బోలెడు… అవి కదా రేపటి మహిళకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసి అందించేవి… అవి కదా ఆశావాదపు బాటలను చూపించేవి… అక్రమ సంబంధాలు, అసహజమైన సంబంధాలు, బరితెగింపు పోకడలు, కామమే అంతిమమనుకునే ధోరణులనేనా మన స్టార్ దర్శకులు ప్రొజెక్ట్ చేసేది..? ఎలాగూ వెండితెరను మహిళల్ని ప్లాస్టిక్ బొమ్మల్లా చూపించడానికి, ఆడించడానికి పరిమితం చేశారు… బుల్లితెరను అత్తల విలనీలకు, కోడళ్ల కన్నీటికి వేదికను చేశారు… ఇప్పుడిక ఓటీటీ స్మార్ట్ తెరను విశృంఖలత్వానికి వేదికను చేస్తారా..? ఈ తెరనైనా సరే, భ్రష్టుపట్టించడమేనా..?!
Share this Article