ఒక రోజంతా ఆలోచించినా సరే… ఇది వార్తేనా అనే సంశయం నుంచి విముక్తం కాలేకపోయాను… వోకే, షర్మిలకు, భారతికి నడుమ గ్యాప్ పెంచడానికి ఉద్దేశించిన సంకల్పకథనమే అనుకున్నా సరే… ఇది మరీ ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలా అయ్యిందనేది ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నే… పైకి ఎన్ని పాత్రికేయ నీతులు చెప్పుకున్నా సరే, ఆంధ్రజ్యోతి ఉద్దేశాలు- లక్ష్యాల్లో జగన్‌ను తిట్టడం, జగన్ ఫ్యామిలీలోనే చిచ్చుపెట్టడం వంటి స్పష్టమైన దిశ ఒకటి బహిరంగంగానే కనిపిస్తుంది…
ఆ దిశలో, ఈ దిశలో ఈ వార్త ఆంధ్రజ్యోతికి పబ్లిషబులే అనుకున్నా సరే… ఇది ఫస్ట్ పేజీలో మాస్ట్ హెడ్ దిగువన వేయాల్సిన ముఖ్యమైన వార్త ఎలా అయ్యిందో అస్సలు అంతుపట్టడం లేదు… జగన్ మీద విషాన్ని చిమ్మడం అనేది రాధాకృష్ణ తెలుగుదేశం అధినేతలకన్నా ఎక్కువ ప్రయారిటీ పని అయితే ఉండవచ్చుగాక… కానీ దానికి పాత్రికేయ స్పూర్తిని మరీ ఇంతగా పాతాళానికి తీసుకెళ్లాల్సిన అగత్యం ఏమిటి…
(నిజానికి షర్మిలకు, జగన్‌కు నడుమ గ్యాప్ లేదు… ఆమె ఇప్పటికీ జగన్ విడిచిన బాణమే… వాళ్లకూ కొన్ని రాజకీయ వ్యూహాలుంటయ్, ఆ ప్రకారమే అడుగులు పడుతుంటాయి… అదంతా చర్చిస్తే అదే పెద్ద స్టోరీ…) ఈ వార్తకు పరిమితమై ఆలోచిద్దాం… కొర్రు భాస్కర్‌రెడ్డికి వైఎస్ అంటే బాగా అభిమానం… గతంలో కంట్రీక్లబ్ ఎదగూరి రాజీవ్‌రెడ్డి దగ్గర ఏవో వర్క్ చేసుకునేవాడు… తరువాత వైఎస్‌కు దగ్గరై, తన సపోర్టుతో మంచిగా ఎదిగాడు… తను పెట్టుకున్న ఎక్సెల్ సెక్యూరిటీస్ బాగా వృద్ధిలోకి వచ్చింది… సీన్ కట్ చేస్తే…
Ads
తరువాత వైఎస్ మరణానంతరం తనకూ వైఎస్ ఫ్యామిలీకి నడుమ పెద్దగా చిక్కటి సంబంధాలేమీ లేవని చెబుతారు… జూలైలో వైఎస్ జయంతి రోజున ఎవరో యాడ్ ఎగ్జిక్యూటివ్ సిటీలోని ఏదో ఏరియా పేజీలో ఒక యాడ్ అడిగాడు… 10, 15 వేల బిల్లు… అందులో షర్మిల, విజయమ్మ ఫోటో వేయమని కస్టమర్ (భాస్కర్ రెడ్డి) అడిగాడు… తెలిసీతెలియని ఎగ్జిక్యూటివ్ వైఎస్ జయంతి యాడ్ కదా, వాళ్ల ఫోటోలు అందులో బాగుండవు సార్ అని చెప్పాడు…
ఇదంతా జూలైలో జరిగింది… తరువాత ఆరు నెలలు గడిచిపోయాయి… ఇప్పుడు హఠాత్తుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడమేమిటనేది అంతుపట్టదు… వెంటనే దాన్ని ఆంధ్రజ్యోతి అందుకుని ఆ వార్తను ఇంతగా బొంబాట్ చేయడం ఏమిటో అస్సలే అంతుపట్టదు… తమ పొలిటికల్ లక్ష్యాల్లో, క్యాంపెయిన్‌కు పనికొచ్చే వార్త కాబట్టి రాధాకృష్ణ దీనికి అంతగా ప్రయారిటీ ఇచ్చి పబ్లిష్ చేసినట్టున్నాడు…
ఇందులో పొలిటికల్ రీజన్స్, కావాలని ఉద్దేశపూర్వకంగా షర్మిల ఫోటో వేయమన్నారు కాబట్టి భారతి వద్దని చెప్పింది అన్నంత సీన్ ఉంటుందా..? షర్మిల స్వయంగా యాడ్స్ ఇచ్చినా సరే, సాక్షి ఇప్పటికీ కవర్ చేస్తుంది నాకు తెలిసి… షర్మిల, విజయమ్మ ఫోటోలను సాక్షి ఏమీ నిషేధించలేదు… ఇప్పుడైనా సరే షర్మిల, విజయమ్మ ఫోటోలతో ఒక యాడ్‌ను రాధాకృష్ణే సాక్షికి పంపించి, పబ్లిష్ చేస్తారో లేదో ఓసారి చెక్ చేస్తే బాగుండు…!! (అవునూ, పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలబ్బా…? ఇది ఏ తరహా నేరం అవుతుంది..?)
Share this Article