సరే, ఇండస్ట్రీ అంటేనే అది… కాళ్లావేళ్లాపడటం, కాళ్లు పట్టుకోవడం, కాళ్లు పట్టడం, కాళ్లతో తన్నించుకోవడం… కొందరు పెద్ద దర్శకులు, నిర్మాతలు, మరీ ప్రత్యేకించి హీరోలు… సెట్‌లో అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు, లేదా సెట్‌లోకి అడుగుపెడతాడు… ఇంకేముంది..? ఒక్కొక్కడూ వచ్చి కాళ్లు మొక్కి తమ భక్తిప్రపత్తులను, విధేయతల్ని, వినయాన్ని, అణకువను ప్రదర్శించాలి…
కాళ్లు మొక్కించుకునేవాడికి అది ఆభిజాత్య, ఆధిపత్య, ఆత్మాహం ప్రదర్శన… వాడికది కిక్కు… దొరికిందిరా సందు అనుకుని కొందరు అవకాశాల కోసం అక్కడే కూలబడి కాళ్లు ఒత్తుతూ, సదరు హీరోల మోకాళ్లలోని బుర్రల్ని మర్దన చేస్తూ, కొందరికైతే పాదాల్లో కదా ఉండేది, అక్కడా ఒత్తుతూ… కథలు వినిపిస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, కరిగిపోయి ఆ దేవుళ్లు కరుణించి ఏదైనా పెద్ద అవకాశం ఇవ్వకపోతాడా అని ఆశ… పూజ… కనీసం ఈ దేవుళ్లకు కోపం రాకుండా ఉంటే చాలు అని కూడా ఆశ…
మొన్నామధ్య డైరెక్టర్స్ డే అని జరుపుకున్నారు కదా… దాసరిని స్మరించుకున్నారు కదా… డైరెక్టర్ అంటే షిప్ కెప్టెన్, ప్రాజెక్టుకు బాస్, అందరూ గౌరవించాలని ఫాఫం, అందరూ గొప్పగా చెప్పుకున్నారు కదా… కానీ ఆర్య అనే ఓ విచిత్రరాజం పుట్టి 20 ఏళ్లయిందని ఓ స్మారక కార్యక్రమాన్ని (నెగెటివ్ స్మారకం కాదు) నిర్వహించారు కదా… అందులో దిగ్దర్శకుడిగా ఇప్పుడు తెలుగు సినీ పాత్రికేయ జనం పరిపరివిధాలుగా కీర్తిస్తున్న సుకుమార్ ఓ మాటన్నాడు…
Ads
‘‘సినిమా లో ఒక మాంటేజ్ కోసం రాజు గారిని అడిగితే అప్పటికే సినిమాకు చాలా రోజులు తీసుకున్నావ్.. బడ్జెట్ కూడా ఎక్కువైందని అరిచారు… ఇద్దరం గొడవపడ్డాం… కానీ ఆ మాంటేజ్ షాట్ ఎలాగైనా కావాలని అనుకున్నా… అందుకే అరుచుకున్న తర్వాత రాజు గారి కాళ్లు పట్టుకున్నా… డైరెక్టర్ అంటే పొగరుగా ఉంటారు… షూట్ క్యాన్సిల్ చేస్తారని అంటారు… కానీ ప్రొడక్ట్ సరిగా రావడం కోసం నేను కాంప్రమైజ్ అవుతాను… ఆర్య టైంలో రాజు గారి కాళ్లను మూడు సార్లు పట్టుకున్నాను…’’
పట్టుకుంటే పట్టుకున్నావు, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్… దర్శకులు నిర్మాతల కాళ్లను, నిర్మాతలు హీరోల కాళ్లను, హీరోలు హీరోయిన్ల కాళ్లను (ఇక్కడ అవసరం వేరు) పట్టుకోవడం పెద్ద విశేషమేమీ కాదు, కానీ దిల్ రాజు కాళ్లను మూడుసార్లు పట్టుకున్న తన ఘన వ్యక్తిత్వాన్ని, ఘన ఆత్మాభిమానాన్ని, ఘన అహాన్ని బహిరంగంగా గొప్పగా ఆవిష్కరించుకోవడం ఏమిటో సుకుమార్‌కే తెలియాలి…
ఫాఫం, దాసరి మరణించి బతికిపోయాడు, లేకపోతే నిర్మాతల కాళ్ల మీద పడి బావురుమనే కేరక్టర్లను చూసి ఇంకెన్నిసార్లు మరణించేవాడో… అందరూ ఆహా ఆర్య, ఓహో ఆర్య అని చేతులు నొప్పెట్టేదాకా చప్పట్లు కొట్టారు సరే, కానీ దాని సీక్వెల్‌గా చెప్పబడే ఆర్య2 తుస్సు… అదెందుకో ఎవడూ మాట్లాడడు… అందులోనూ ఇదే బన్నీ హీరో, ఇదే సకుమార్ దర్శకుడు, ఇదే డీఎస్పీ మ్యూజిక్… కాకపోతే ఇందులో శివబాలాజీ లేడు, నవదీప్ ఉన్నాడు… అనూ మెహతా లేదు, కాజల్ అగర్వాల్ ఉంది… దిల్ రాజు అస్సలు లేడు ఈ టీంలో… మరి ఆర్య సెకండ్ పార్టుకే అలా వైరాగ్యం దేనికొచ్చింది ఆయనకు…
అందరికీ లైఫ్ ఇచ్చింది ఆర్య, ఆ ప్రాజెక్టు వేళావిశేషంతో అందరూ బాగా ఎదిగిపోయారు అందరూ జబ్బలు చరుచుకున్నారు… కానీ అందులో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకున్న సదరు హీరోయిన్ అనూ మెహతా తరువాత నాలుగైదు సినిమాలు చేసి మొత్తం ఇండస్ట్రీ నుంచే ఔటైపోయింది… శివబాలాజీకి కూడా పెద్ద ఎదుగుదల లేదు… సో, మరీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఈ సినిమా ఓ మలుపు వంటి డొల్ల కీర్తనలు వేస్ట్ అని ఈ కథలోని నీతి…!! (సందర్భోచితం కాకపోయినా సరే, ఆమధ్య హనుమాన్ టీం దిల్ రాజు కాళ్లు పట్టకుండా, సొంత కాళ్లపై నిటారుగా నిలబడి, తలెగరేసి, విజయహాసం పలికించారు మొహాలపై…)
Share this Article