దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యకు భాషాపరమైన పెద్ద చిక్కొచ్చి పడింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అవసరమని కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం ఆదర్శంగా పెట్టుకుంది. అలాగే సాంకేతిక ఉన్నత విద్యను కూడా మాతృభాషల్లో చదువుకునే అవకాశం కల్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
భాషగా దానికదిగా ఒకటి గొప్ప కాదు. ఒకటి తక్కువ కాదు. పదుగురాడుమాట పాడియై ధర చెల్లు…అని ఎక్కువమంది మాట్లాడే భాష నెమ్మదిగా గొప్పదవుతుంది. లేదా గొప్పదిగా అనుకుంటాం. ప్రపంచమంతా ఎన్నో భాషలున్నా ఇంగ్లీషు విశ్వభాష అయి కూర్చుంది. అలా ఎందుకయ్యింది? అది మంచిదా లేక చెడ్డదా? అన్న చర్చ ఇక్కడ అనవసరం.
ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్ల తోలు ప్రభువులు మన నేల మీద అడుగు పెట్టడం ఆలస్యం. మన భారతీయ భాషలన్నీ తమను తాము వెనక్కు తోసుకుని ఇంగ్లీషును నెత్తిన పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆసేతు హిమాచలం ఇంగ్లీషు తిని, తాగి, పీలుస్తూ ఉంటుంది. నలుగురు మర్యాదస్థులు కలిస్తే ఇంగ్లీషులో మాట్లాడితేనే నాగరికంగా ఉంటుంది. లేకపోతే అప్పుడే పాతరాతియుగం గుహల్లోనుండి గోచీ గుడ్డలతో బయటి ప్రపంచంలోకి వచ్చిన అనాగరికుల్లా చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచమంతా చెల్లుబాటు అయ్యే భాష ఇంగ్లీషు.
Ads
భారతీయులు కూడా ఇళ్లల్లో వారివారి మాతృభాష మాట్లాడుకుంటూ చదువు సంధ్యలు, ఉద్యోగ వ్యవహారాలు మాత్రం ఇంగ్లీషులోనే చేస్తుంటారు. బ్రిటన్లో, అమెరికాలో పుట్టినవారు ఇంగ్లీషు ఒక్క భాష నేర్చుకుంటే చాలు. మన దేశంలో అలా కాదు. ప్రత్యేకించి చదువుకునేవారికి మాతృభాషతోపాటు, తప్పనిసరిగా ఇంగ్లీషు బాగా తెలియాలి. మాతృభాష పరిరక్షణ ఉద్యమాలెన్ని జరిగినా ఇంగ్లీషు వ్యామోహం, వ్యాప్తి, వాడకం ఆగదు.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే అంతర్జాతీయ విమానప్రయాణాలు, అనేక సమాచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు పెరగడంతో ప్రపంచం గుప్పిట్లోకి చిక్కింది. ఇంగ్లీషు వాడకం పెరిగింది. ఇంకా ఇంకా పెరుగుతుంది.
ఇలాంటి వేళ సాంకేతిక విద్యను మాతృభాషలో బోధించడమంటే అయ్యేపని కాదు అని దేశంలో ప్రముఖ ఐ ఐ టీ లు చేతులెత్తేస్తున్నాయి. దేశంలో వందేళ్లుగా ఇంగ్లీషులో సాంకేతిక విద్యను బోధిస్తూ ఇప్పుడు మాతృభాషల్లో కూడా బోధించాలి అంటే అసలు ప్రాంతీయ భాషల్లో పాఠాలు తయారు చేయడమే కత్తిమీద సాము అని భయపడుతున్నారు. మాతృ భాషల్లో సాంకేతిక డిగ్రీలు పూర్తి చేస్తే అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం కష్టమన్నది వీరి వాదన. బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దొరకడం కూడా కష్టమంటున్నారు.
శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో- ‘‘… అయితే పెళ్లి జరుగుతుందా? నేను మళ్లీ పట్టు చీర కట్టుకోవాలా?’’ అని ఒక డైలాగ్. మాతృభాషలో చదివి చదివి మన ఊరు పొలిమేర దాటలేకపోతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదవండి! అని మనమే బలవంతపెట్టాం. లేదా ఆ మీడియం మాయలో పడి మనమే మాతృభాషను చిన్నచూపు చూశాం. ఇందులో పిల్లల తప్పు లేదు. ఇప్పుడు మళ్లీ మాతృభాషలో చదవండి అంటున్నాం. …అయితే మళ్లీ మాతృభాషలో చదవాలా? అని పిల్లలు అడగలేరు.
ఫర్ సపోజ్- హైదరాబాద్-కంది- ఐఐటీలో ఒక క్లాసు జరుగుతోంది అనుకుందాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు అటుగా వెళ్లారు. క్లాసు కిటికీలో నుండి తెలుగు తల్లి/ తెలంగాణ తల్లి మురిసిపోయేలా సాంకేతిక పాఠం ఇలా వినిపిస్తోంది-
“స్థితి స్థాపక శక్తి గతి తప్పి మతిలోకి వచ్చి ద్రవ్యరాశి పూర్వస్థితిని చేరడానికి పట్టిన సమయంలో అణువులు ఉత్పరివర్తన చెందకుండా ఉపరితలం వదిలి ఇలాతలం మీద పడితే ఛిద్రమయిన ద్రవ్యరాశి ఎంత? చెవులు చిట్లిన ప్రతిధ్వని ఎంత? స్థితి స్థాపక దుస్థితికి అపసవ్యంగా పనిచేసిన శక్తులేవి? ఆ సమయంలో ద్రవ్యరాశి ఏ శక్తితో ఎటువైపుగా సంఘర్షించి ఎవరితో లేచిపోయింది? ఈ అస్తవ్యస్త స్థితి స్థాపక వ్యవస్థను సూత్రీకరించే పద్ధతులు ఏమిటి? ఇది అణువుల పరస్పర అంగీకార సామూహిక తిరుగుబాటుగా చూడాలా? లేక విశ్వ శక్తి పరమాణువుల మీద పెత్తనం చేసి అణు విచ్చేదనం చేయబోతే-పరమాణువుల అసంకల్పిత తీవ్ర ప్రతీకార భౌతిక రసాయన ప్రతిచర్యగా పరిగణించాలా?”
పాపం విద్యార్థులు. మనకోసం మనమెన్నుకున్నప్రభుత్వాల చేతిలో పావులు.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article