ఒకాయన ఎ అనే సినిమాను తీశాడు… దాని రీమేక్‌గా మరొకాయన బి అనే సినిమాను తీశాడు… ఇంకొకాయన ఈ సినిమాల ఆధారంగానే సి అనే సినిమాను తీయాలనుకున్నాడు… రైట్స్ ఎవరు అమ్మాలి..? ఎవరి దగ్గర కొనుక్కోవాలి..? ఒరిజినల్‌గా ఎ అనే సినిమాను తీసిన ఫస్ట్ నిర్మాత వద్దే కదా… కామన్‌గా అంతే కదా… కానీ మరేమిటి ఇంతటి సినీ వ్యాపారవేత్త, ఇండస్ట్రీ మీద ఫుల్ కమాండ్ ఉన్న దగ్గుబాటి సురేషుడు బి సినిమా తీసిన నిర్మాత దగ్గర రైట్స్ కొన్నాడేమిటి..? ఇదీ ఆ వార్త చదివిన వెంటనే తలెత్తిన ఓ ప్రశ్న… ఎహె, ఊరుకొండి సార్, అంత పెద్ద రాజమౌళిలు, త్రివిక్రములే ఏది కనిపిస్తే అది లేపేసి, తమ సినిమాల్లో పెట్టేసుకుంటున్నారు… ఫాఫం, సురేషుడు నయం కదా, రైట్స్ కొని మరీ తీస్తున్నాడు అంటారా..? అది మాత్రం నిజమే… కానీ రైట్స్ డబ్బులు దక్కాల్సిన వాళ్లకే ఇస్తున్నాడా అనేది పాయింట్… చెప్పకుండా ఇతర నిర్మాతలు, దర్శకుల్లాగే లేపేస్తే అసలు ఏ లీగల్ పాయింటూ ఉండదు, ప్చ్, లీగల్‌గా వెళ్లాలని అనుకుంటేనే ఇలాంటి లా పాయింట్లు…
అప్పట్లో ఇదే సురేష్ ‘మిస్ గ్రానీ’ అనే ఓ కొరియా చిత్రం రైట్స్ కొన్నాడు… తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాయించుకున్నాడు… ఓహ్ బేబీ అని అక్కినేని నాగసమంతతో సినిమా తీశాడు… డబ్బులు వచ్చాయో, పోయాయో తెలియదు గానీ, సినిమా మాత్రం హిట్ అనిపించుకుంది… హీరోయిన్గా సామ్ ఇరగ్గొట్టేసింది… సురేష్‌కు సేమ్ కొరియాకే చెందిన మరో హిట్ సినిమాను ఎవరో ప్రపోజ్ చేసినట్టున్నారు… దాని పేరు లక్-కీ… లక్కీ కాదు, లక్-కీ… అంటే అదృష్టపు తాళపు చెవి… ఈయన రైట్స్ కొనేశాడు… పాత కొరియా వంటకాన్ని టేస్ట్ చేసి ఉన్నాడు కదా ఆల్రెడీ…
Ads
ఓ పెద్ద కిరాయి హంతకుడు… 100 శాతం సక్సెస్ రేట్… ఫుల్ ప్రొఫెషనల్ కిల్లర్… తను సుపారీ తీసుకున్నాడు అంటే ఇక ఖతం ఖాతాలో పడాల్సిందే ఆ శాల్తీ… అలాంటి హంతకుడు ఓసారి ఓ ఆపరేషన్ పూర్తయ్యాక ఓ పబ్లిక్ వాష్‌రూంలోకి వెళ్తాడు… శుభ్రం చేసుకోవడానికి అన్నమాట… అక్కడ సబ్బు మీద కాలేసి, జారిపడి, తలకు దెబ్బ తగిలి, స్పృహ కోల్పోతాడు… స్పృహ మాత్రమే కాదు, తన గతాన్ని కూడా మరిచిపోతాడు… గతం మరిచిపోయే హీరోలు అనబడే కథాదరిద్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే… ఊరకే గాలికి తిరిగే మరో వ్యక్తి ఆ సమయంలో అక్కడికి వచ్చి, ఈ హీరో తాలుకు తాళాలు గట్రా తీసుకుంటాడు… అసలు హీరోకు గతం గాయబ్, ఈ కొత్తాయన సదరు హీరో ఆస్తులన్నీ ఎంజాయింగ్ అన్నమాట… అదీ కథ… బాగుంటుంది… పర్ఫెక్ట్ కామెడీ టైమింగు తెలిసిన నటుల్ని పెట్టుకుంటే రక్తికడుతుంది… ఆ కథకు ఎవరు ఆప్ట్, ఎవరు వేస్ట్ అనే చర్చ జోలికి వెళ్లకుండా, మనం మరోవైపు వెళ్దాం… ఈ లక్-కీ సినిమా కొరియాలో తీశారు నిజమే గానీ… దీని ఒరిజినల్ 2012లో జపాన్‌లో తీసిన కీఆఫ్లైఫ్ అనే సినిమా… దానికి రీమేకే లక్-కీ… ఈ సురేషుడేమో కొరియన్ నిర్మాత దగ్గర రైట్స్ కొన్నట్టు వార్తలొచ్చినయ్… అందుకని డౌటొచ్చింది మనకు కూడా… పర్లేదులే సార్, దాన్ని మన నేటివిటీకి తగ్గట్టు, ప్రముఖ హీరోలకు తగినట్టు రాయించేస్తే… ఒరిజినల్ రచయిత కూడా కనుక్కోలేడు… ఏం, మన దేశీయ నిర్మాతలు బోలెడు మంది చేయడం లేదా ఏం..? పైగా ఎవడో ఒకడికి డబ్బులిస్తున్నాడు కదా… ఇక మీమాంస దేనికి..? మీరు కానివ్వండి సార్… జపానోడికీ తెలియదు, కొరియన్ వాడికీ తెలియదు… పక్కా…!! కాకపోతే ఓహ్ బేబీ తరహాలో వావ్-కీ అని పెట్టకండి పేరు…!
Share this Article