ఇదొకరకం మానసిక వైకల్యం అనాలా..? వైరాగ్యం అనాలా..? ఇరా బాసు ప్రస్తుత గతి చూస్తే అందరికీ ఆమెనెలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి… ఆమె బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ భట్టాచార్య సొంత మరదలు… కానీ ఫుట్‌పాత్‌పై జీవిస్తోంది… మంత్రి, ఎమ్మెల్యే అంటేనే బంధుగణమంతా విపరీతంగా అక్రమ ఆస్తులు పోగేసి, అట్టహాసంగా, ఆడంబరంగా బతుకుతూ ఉంటారనేది కదా మనకు తెలిసిన సత్యం… మరి పదేళ్లు పాలించిన ఓ మాజీ సీఎం మరదలికి ఈ బతుకేమిటి..? (సొంత మరదల్నే ఈ గతికి తెచ్చినవాడు ఇక ప్రజల్ని ఎలా పాలించాడో అర్థం చేసుకోవచ్చు, అందుకే పార్టీ మట్టిగొట్టుకుపోయింది అని భట్టాచార్యను నిందించడం మాత్రం అబ్సర్డ్…) ఈమె కథలోకి వెళ్తే… బుద్దదేవుడి భార్య మీరాకు ఈమె సొంత చెల్లె… చదువూ సంధ్యా లేని మెంటల్ కేసు కాదు… వైరాలజీలో పీహెచ్‌డీ చేసింది…
ఇంగ్లిష్, బెంగాల్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు, పాఠాలు చెప్పగలదు, స్టేట్ లెవల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్… 1976 నుంచి ప్రియానాథ్ బాలికల పాఠశాలలో టీచర్‌గా పనిచేసి 2009లో రిటైరయింది… తరువాత పెన్షన్ కోసం అవసరమైన కాగితాల్ని కూడా ఇవ్వలేదు, ఎటుపోయిందో ఎవరికీ తెలియదు… బరానగర్‌లో ఉండేది, అక్కడి నుంచి ఖర్జూలోని లిచూ బగాన్ వెళ్లిపోయింది… ఇన్నేళ్ల నుంచి ఎవరికీ పట్టలేదు… ఆమె బతుకేమిటో, ఎక్కడ ఎలా బతుకుతుందో తెలియదు… ఎందుకంటే..? ఆమె తత్వం అది… నేను ఫలానా వీవీఐపీని తెలుసా అని ఎవరికీ చెప్పుకోదు… ఎందుకలా మారిపోయిందో తెలియదు… వీథివ్యాపారులు ఏమైనా ఇస్తే తినడం, డన్లాప్‌లోని ఓ ఫుట్‌పాత్‌పై పడుకోవడం… మరి ఎవరికీ తెలియదా ఆమె ఫలానా అని..? తెలుసు…
Ads
అక్కడ కొందరికి తెలుసు… కానీ ఎవరు ఏం చెప్పినా ఆమె వినదు… ఓ వీథి బిచ్చగత్తెలాగే బతుకుతూ ఉంటుంది… మరి ఇన్నాళ్లూ లేనిది అకస్మాత్తుగా మళ్లీ వార్తల్లోకి ఎందుకొచ్చింది..? ఇండియాటుడే రిపోర్టర్ ఒకరు తాజాగా మళ్లీ ఆమె స్టోరీ రాశాడు కాబట్టి… మిగతా అందరూ దాన్ని వివిధ భాషల్లోకి యథాతథంగా అనువదించుకున్నారు కాబట్టి… పోనీ, అదయినా ఆమె జీవితం గురించి మొత్తం తెలుసుకుని రాసిన స్టోరీయా అంటే అదీ లేదు… ఆమె భర్త, పిల్లలు గట్రా ఏ వివరాలూ లేవు… ఇదీ ఆ వార్త లింకు… https://www.indiatoday.in/india/story/former-bengal-cm-buddhadeb-bhattacharya-sister-in-law-living-dunlop-footpath-1851402-2021-09-10 మొన్న టీచర్స్ డే సందర్భంగా కూడా కొందరు స్థానిక సంఘాల నాయకులు ఆమెను పిలిచారు, దండలేశారు, స్వీట్లు పెట్టారు…
ఆమె అక్కడ మాట్లాడింది… ‘‘నన్ను ఈరోజుకూ చాలామంది టీచర్లు, పిల్లలు గుర్తుచేసుకుంటారు, నన్ను అభిమానిస్తారు, అప్పుడప్పుడూ నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’’ అని ఆనందపడింది… అంటే… తన మీద తనకు పూర్తి సోయి ఉంది, అన్నీ మరిచిపోయి వీథుల వెంబడి తిరిగే పిచ్చిది కాదు, బిచ్చగత్తె కాదు… అన్నీ తెలిసి అలా బతుకుతున్నదీ అన్నమాటే కదా… మరెందుకు ఈ బతుకు..? అని ఎవరడిగినా ఆమె ఏమీ చెప్పదు… ఎస్, అదే మానసిక వైకల్యం అంటారా..? ఐతే సరే… ఇక్కడ టిపికల్ ఇండియన్ ఆఫీసర్ల సంగతి మరోసారి చెప్పుకోవాలి… ఈ వార్త కనిపించగానే ఆమెను అంబులెన్సులో పట్టుకుపోయి, కలకత్తాలో ఓ హాస్పిటల్‌లో చేర్చారు… చికిత్సలు జరిపిస్తాం అంటున్నారట… సర్కారే ఇక ఆమె బాగోగులు చూసుకుంటుందట… ఆమె అంగీకరిస్తుందా అనేది కదా అసలు ప్రశ్న, అంగీకరించే మనిషే అయితే ఆ ఫుట్‌పాత్ బతుకును ఎందుకు ఎంచుకునేది…!?
Share this Article