డీజే టిల్లు… ఓటీటీలో పడేశారుగా… కాస్త నెమరేస్తుంటే కొన్ని విశేషంగా కన్పించినయ్… అబ్బే, థమన్ బీజీఎం గురించి కాదు, టిల్లూ టిల్లూ అని సూపర్ హిట్ అయిన ఎంట్రీ సాంగ్ ట్యూన్, టోన్, మ్యూజికే సినిమా చివరిదాకా కొట్టి ఇడిశిపెట్టిండు… అఖండకు ఏం కష్టపడ్డడో తెలియదు గానీ టిల్లుకు మాత్రం అలవోకగా, అనాయాసంగా సరదాగా కొట్టిపడేశాడు…
ఆ దర్శకుడెవరో గానీ ఎక్కడా ‘అతి వేషాలు’ ప్రదర్శించలేదు… సాఫీగా నడిపించాడు కథను… అసలు కథ, మాటలు, హీరో, ఎట్సెట్రా అన్నీ హీరో సిద్ధూయే కదా… ఏమాటకామాట, ఆ పాత్రకు సరిగ్గా సూటైండు… టిపికల్ హైదరాబాదీ స్లాంగ్‌ను ఇరగ్గొట్టేశాడు… మరీ సీరియళ్లు, సినిమాల్లో కృత్రిమంగా ఇరికించే తెలంగాణ భాష, పాట, యాసల్లాగా కృతకంగా, వెగటుగా లేదు… పర్ఫెక్ట్ డిక్షన్… ఏదో ఫన్ బేస్డ్ స్క్రిప్ట్ కాబట్టి తన యాక్షన్ గురించి చెప్పుకోలేం… కానీ ఇవి కావు, విశేషంగా అనిపించింది తన జుట్టు…
Ads
అచ్చం ఓ పిచ్చుక గూడు… అడ్డదిడ్డంగా పెరిగిపోయి, అటూఇటూ వాలిపోతూ, తైలసంస్కారం కూడా ఏమీ లేనట్టుగా… హెయిర్ స్టయిల్ భలే ఉంది… అదేమిటో నిన్నో మొన్నో హీరో సుధీర్ బాబు ఏదో కొత్త సినిమా అని మీడియాలో కనిపించింది కదా… తనదీ సేమ్ టిల్లూ హెయిర్ స్టయిలే… ఏ సంస్కారమూ లేకుండా పెరిగిపోయిన జుట్టే ఇప్పుడు స్టయిల్…
టీవీ ఆన్ చేయగానే సుమ క్యాష్ ప్రోగ్రాం ప్రోమో ఒకటి కనిపించింది… లా లా బీమ్లా పాట పాడిన అరుణ్ కౌండిన్య కనిపించాడు… సేమ్, తనూ అంతే… తన జుట్టు అయితే మరీ భీకరంగా ఉంది… అంతకుముందు క్యాష్ ప్రోగ్రాంలో ఇదే డీజే టిల్లు ప్రమోషన్ నడిచింది కదా… అందులో మ్యూజిక్ కంపోజర్ పాకాల శ్రీచరణ్ కూడా సేమ్ హెయిర్ స్టయిల్…
హమ్మయ్య సంతోషం… నిజానికి టీవీ, సినిమా ఫీల్డుల్లో ఎప్పటికప్పుడు ఫ్యాషన్స్ మారుతుంటయ్… కానీ మరీ రెండుమూడేళ్లుగా అందరూ హఠాత్తుగా గడ్డాలు విపరీతంగా పెంచేయడం మొదలుపెట్టారు… హిమాలయాల్లో ఏళ్ల తరబడీ గుహల్లో తపస్సు చేసుకునేవాళ్లకూ పెరగనట్టుగా… బారెడు పొడవైన గడ్డాలు… టీవీల్లో ఏ షో చూసినా ఈ గడ్డాలే… ఏ సినిమాలు చూసినా గడ్డాలే… బయట పోరగాళ్లు కూడా అలాగే తయారయ్యారు… అట్లుంటది మరి… ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, ఆయన గారి నాన్నగారు కూడా తెల్లటి బవిరి గడ్డాలు ప్రేమగా నిమురుకుంటూ ఇంటర్వ్యూలు… హేమిటో మరి…
అరణ్యలో రానా దగ్గర నుంచి టీవీ షోలలో ఓంకార్ వరకు… చూసేవాళ్లకు ఒకటే చిరాకు… అక్కడికి గడ్డమే మగతనానికి ఓ సింబల్ అన్నట్టుగా పెంచారు… ఇప్పుడు ఆ గడ్డాలు వదులుతున్నయ్… ఇప్పుడు ఆ జుట్టు పెంపకం స్కీమ్ పైకెక్కింది… నెత్తిమీదకు… బాలయ్య వంటి వెటరన్లకు నయం, ఏ స్టయిల్ అంటే ఆ స్టయిల్ క్షణాల్లో అమిరిపోతుంది… కానీ ఒరిజినల్స్‌కు మాత్రం కొత్త స్టయిల్‌కు తగినంత జుట్టు చకచకా పెరగడం కష్టమే… సో, ఇప్పుడు ట్రెండీ హెయిర్ స్టయిల్ ఏమిటంటే… కాసింత ట్రిమ్మింగ్ చేయబడిన గడ్డం ప్లస్ మీసం… పిచ్చుకగూడులాగా జుత్తు… అట్లుంటది టిల్లూతోటి రాధికా ..!!
Share this Article