నిజంగా మరణానంతరం కొణిజేటి రోశయ్యకు జరిగే అవమానాలు చూస్తుంటే జాలేస్తుంది… ఏ ఆర్యవైశ్యులకు ఓ గర్వ ప్రతినిధిగా గుర్తించి, గౌరవించారో ఆ వైశ్యసంఘాలు సైతం కిక్కుమనకపోవడం ఆశ్చర్యంగా కూడా ఉంది… ఓ బలమైన సామాజికవర్గం తన ఉనికిని చాటుకునే సోయిలో లేకపోవడం వింతగానే ఉంది…
ఆయనకు ఏ చరిత్ర లేదా..? ఏ గౌరవమూ అక్కర్లేదా..? తను సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు… రాష్ట్రాన్ని ఏమీ అమ్ముకోలేదు… గ్రూపులు పెట్టలేదు… చిల్లర భాషకు దిగలేదు… రాజకీయాల్లో పాతతరానికి చెందిన హుందాతనానికి ప్రతీకగానే మెదిలాడు… తను మరణిస్తే సొంత పార్టీయే పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు…
తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు… జస్ట్, రోశయ్య ఓ ఆంధ్రా లీడర్ అనుకుందేమో… కానీ చాలా ఏళ్లు ఓ సామాజికవర్గానికి ఐకన్‌గా ఉన్నాడని మరిచిపోయింది… అధికార లాంఛనాలతో అంత్యక్రియలు సరే, కానీ ప్రభుత్వ ముఖ్యులు రోశయ్యను ఓ దివంగత కాంగ్రెస్ నేతగానే పరిగణించారే తప్ప మాజీ ముఖ్యమంత్రిగా చూడలేకపోయారు… సరే, వైశ్యసంఘాలకే సోయి లేదు, మిగతావాళ్లను ఆక్షేపించడానికి ఏముంది..? ఆయన అంత్యక్రియలకు సోకాల్డ్ పెద్ద పెద్ద కుల లీడర్లే వెళ్లలేదు… తమ గొప్ప నాయకత్వాన్ని చూసి వైశ్య విద్యావంతులు, ఆలోచనాపరులే సిగ్గుపడ్డారు… అదయిపోయింది…
Ads
ఏపీలో జగన్ ధోరణి… మరింత అవమానకరం… మంత్రి గౌతమ్‌రెడ్డి మరణం పట్ల వైసీపీ గానీ, జగన్ గానీ, సభ గానీ నివాళి అర్పించడంలో ఏ తప్పూ లేదు… తన మరణం దురదృష్టకరం… కానీ అదే సంతాపం రోశయ్యకు ఎందుకు దక్కలేదు..? ఇదే జగన్ తండ్రి వైఎస్ దగ్గర రోశయ్య విధేయంగానే పనిచేశాడు కదా… నంబర్ టూ అనిపించుకున్నాడు కదా… వైఎస్ కూడా అమిత గౌరవాన్ని ఇచ్చాడు కదా… ఏపీలో కూడా ఆ సామాజికవర్గం బలమైందే కదా…
మరి రోశయ్యను ఎందుకు విస్మరించారు..? అదేమంటే జవాబు చెప్పేవాడు కూడా కనిపించడు… పోనీ, రోశయ్య జగన్‌కు ఏమైనా ద్రోహం చేశాడా..? ఏమీలేదు… వైఎస్ మరణానంతరం ఓ తాత్కాలిక సర్దుబాటుగా రోశయ్యను సీఎం చేశారు… అంతేతప్ప జగన్‌కు దక్కాల్సిన సీఎం పదవిని రోశయ్య ఏమీ దుర్బుద్ధితో కాజేయలేదు… ఇదే కాంగ్రెస్ ఇక చాలు అనగానే సింపుల్‌గా తన పదవిని తృణప్రాయంగానే వదిలేశాడు కదా… మరి జగన్‌కు రోశయ్య అంటే ఎందుకు కోపమో, ద్వేషమో ఉండాలి…
ఏపీలోనూ వైశ్యసంఘాలు కిక్కుమనడం లేదు… ఎవరూ మాట్లాడటం లేదు… ఇదేమని అడిగేవాడే లేడు… వైశ్యులంటే చిన్నచూపు దేనికంటూ ఒక అయ్యన్నపాత్రుడో, ఒక రఘురామ కృష్ణంరాజో మాట్లాడుతున్నారు తప్ప వైశ్యకులానికి చెందిన నాయకుల నోళ్లు మాత్రం పెగలడం లేదు… ఈ తరానికి ఏమాత్రం పట్టింపు లేని అదేదో చింతామణి నాటకాన్ని నిషేధించిన ప్రభుత్వానికి అసలు రోశయ్యకు సంతాపం చెప్పాలనే కనీసమర్యాద, స్పృహ ఎందుకు లేదు..? ఎందుకంటే..? సంఘటితంగా తమ ఉనికిని చాటుకునే సీన్ ఆ కులంలో లేదనే తేలికభావమేనా..? రాజకీయంగా వీళ్లేమీ ప్రమాదకారులు కాదనే చులకనభావనా..?!
Share this Article