“ఇన్ద్రో విశ్వస్య రాజతి; శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే” అని వేదంలో శాంతి మంత్రం. రెండు కాళ్లున్న మనుషులకు, నాలుగు కాళ్లున్న పశువులకు సుఖశాంతులు కలుగుగాక అని ఈ మంత్రం అర్థం. మనుషులకు రెండు కాళ్లేనని ఈ మంత్రంలో ఎక్కడా లేదు. ద్విపదే అంటే రెండు కాళ్లున్న మనుషులమయిన మన గురించే అని మనం గ్రహించాలి. చతుష్పదే అంటే నాలుగు కాళ్లతో నడిచే పశువులు అని ఆ విషయం తెలుసుకోలేని పశువులకు మనం తెలియజెప్పాలి.
పశువుకంటే మనిషి గొప్పవాడని తనకు తాను అనుకుంటాడు. అలాంటప్పుడు-
మానవ మృగం
పాశవిక ప్రవర్తన
పాశవిక దాడి
లాంటి సందర్భాల్లో మానవ స్వభావాలకు తమను వాడుకోవడం మీద అంతర్జాతీయ పశు సమాజం తీవ్రమయిన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిరసన తెలుపుతోంది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థకు అంతర్జాతీయ పశువుల వేదిక ఒక వినతి పత్రం ఇచ్చింది. అందులో ప్రధానాంశాలివి.
1 . మనుషులు మనుషులతో కొట్లాడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. సంక్రాతి రాగానే మా కొమ్ములు పట్టుకుని, తోక మెలి పట్టి మాతో కొట్లాడ్డంలో ఆంతర్యమేమిటో సహేతుకంగా మాకు వివరించాలి.
Ads
2 . మనుషుల్లో మృగాలు ఉన్నప్పుడు- పశువుల్లో మనుషులు ఉండవచ్చు అన్న సిద్ధాంతాన్ని అంగీకరించాలి.
3 . పశువుల మీద మనుషులు చేసే దాడిని పాశవిక దాడి అనడానికి వీల్లేదు.
4 .మనిషివా? పశువువా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని మా తిండిని చాలా నీచంగా చిత్రీకరించడం తగదు.
5 . నానా అవినీతి గడ్డి కరిచే మనుషులు- అన్నం తింటున్నామని తమకు తామే ఏకపక్షంగా ఎలా ప్రకటించుకుంటారు?
6 . దుక్కి దున్ని, ఫలసాయం మోసి, పాలిచ్చి, పెరుగు, వెన్న, మీగడ, జున్ను, నెయ్యి ఇస్తే బాగా తిని నోరు పారేసుకుని మా మీద జాలి దయ లేకుండా భౌతిక దాడులు చేసే అధికారం మీకెవరిచ్చారు?
7 . పదిమంది మీదికి దూకి పరుగెత్తే పశువును పట్టుకుంటే వినోదమవుతుందా? మృగయా వినోదమవుతుందా? పండుగవుతుందా? హింస అవుతుందా? ఎవరు చెప్పాలి తీర్పు?
8 . మాకు నోరు లేకపోవచ్చు. ప్రాణముంది. మాట లేకపోవచ్చు. కన్నీళ్లున్నాయి.
కొసరాజు రాయగా ఘంటసాల పాడిన గోవుల గోపన్న పాట ఒకసారి వినండి- విన్న తరువాత కూడా మీ మనసు కరగకపోతే మమ్మల్ను గొడ్డును బాదినట్లు బాదుతూనే ఉండండి.
“వినరా వినరా నరుడా…తెలుసుకోర పామరుడా …
గోమాతను నేనేరా …నాతో సరిపోలవురా
కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను..
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా…
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను
నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయ్…
నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్..
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్…
నా ఒళ్ళె ఢంకాలకు నాదము పుట్టించునోయ్”………. By…… పమిడికాల్వ మధుసూదన్
Share this Article