Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా రామాయణానికి తిరగమోత..! అసలు ఎవరు ఈ ‘బోధిసత్వుడు’..?

November 14, 2026 by M S R

.

“డాక్టర్‌ బోధిసత్వ” గారి పరిశోధనా పర్యవేక్షణలో “నమిత్‌ మల్హోత్రా, నితీష్‌ తివారి” గారి “రావణాయణం” చాలా బాగుంది…. – జర్నలిస్ట్‌ సతీష్‌ కొత్తూరి

అసలు ఈ సినిమా గురించి ఏమీ రాయొద్దని అనుకున్నాను. ఎప్పుడో గానీ మన ఇతిహాసాలపై మంచి సినిమాలు రావు అన్న ఉద్దేశంతో. కానీ.. రాయక తప్పడం లేదు. ముందుగా ఒక డిస్క్లైమర్‌. రామాయణం అంటే “వాల్మీకీ రామాయణం” మాత్రమే. వాల్మీకీ రామాయణమే మూలం.. ఆ తర్వాతే మిగిలినవి… ఆ మిగిలిన రామాయణాల్లో ఊహాత్మక కథలెన్నో కలిపారు. వాటికి ఎలాంటి ప్రామాణికత లేదు.

Ads

రామాయణం అనేది ఇతిహాసం. ఇతిహాసం అంటే చరిత్రను చెప్పే గ్రంధం. చరిత్రను ఇష్టం వచ్చినట్టు మార్చే అధికారం ఎవరికీ లేదు. అలా సూడో హిస్టోరియన్లు ఇష్టం వచ్చినట్టు మార్చబట్టే.. మన టెక్స్ట్‌బుక్స్‌లో రాక్షసులైన బాబర్‌లు అక్బర్లు హీరోలయ్యారు. నిజమైన హీరోలు అయిన మన విక్రమాదిత్యలు, పృథ్విరాజ్‌ చౌహాన్లు, శివాజీలు కనపడకుండా పోయారు. దీన్ని క్రియేటివ్‌ లిబర్టీ అనరు. మానసిక రోగం అంటారు. ఇప్పుడు రామాయణం పేరుతో వచ్చిన మూవీ కూడా ఈ జానర్‌లోకే వస్తుంది.

ఒకటి మాత్రం నిజం. రామాయణం మూవీ చాలా గ్రాండ్‌గా తీశారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయి. హాన్స్‌ జిమ్మర్‌ BGM ఎక్సెలెంట్‌. రహమన్‌ పాటలు మాత్రమే కంపోజ్‌ చేశాడు. ఆ పాటలు మాత్రం ఏమీ బాగోలేవు. నాకైతే నచ్చలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు ఇకపై.. ఇదే అసలు రామాయణం అనుకుంటారు. వాల్మీకీ రాసిందే తప్పు అని అనిపించేంత.. బడ్జెట్‌తో సినిమా తీసి వదిలారు.

ఒకప్పుడు దానవీరశూర కర్ణ పేరుతో.. తప్పుడు చరిత్రతో తీసిన… ఒక బ్లాక్‌ బస్టర్‌ సినిమా.. వచ్చింది. ఏమంటివి ఏమంటివి అని.. NTR గారు దుర్యోధనుడే హీరో అనేంత ఎలివేషన్‌తో డైలాగులు చెప్పి విజిల్స్‌ వేయించారు. ఆ జెనరేషన్‌లో చాలా మందిని పక్కదారి పట్టించిన సినిమా ఇది. ఆ జెనరేషన్‌లో చాలా మంది కర్ణుడు, దుర్యోధనులే మంచివారు… పాండవులు.. ఆఖరికి శ్రీ కృష్ణుడు కూడా చెడ్డవాడే అని అనుకున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారు.. కూడా. ప్రఖ్యాత నటులతో భారీ సినిమాలు తీస్తే ఆ ప్రభావం చాలానే ఉంటుంది. చరిత్రలే మారిపోతాయి.

ఇప్పుడు.. ఈ రామాయణంలో.. కూడా అదే జరిగింది. ఇదే అసలు రామాయణం అని ఈ జెనరేషన్‌కి 4000 కోట్లతో కొట్టి మరి చెప్పారు. వేల ఏళ్లుగా భరత ఖండానికి సాంస్కృతిక ఆత్మ లాంటి రామాయణంలో… అసలు ఆత్మను వదిలేసిన ఈ ఫ్యాబ్రికేటెడ్‌ రామాయణమే ఇకపై జనంలోకి బాగా వెళ్తుంది. చరిత్ర మారకుండా సీన్‌ని డెవలప్‌ చేయడం వేరు. అది ఆ చరిత్రను ఇంకా అందంగా చెప్తుంది. కానీ చరిత్రనే మార్చేయడం వేరు.

ఉదాహరణకు.. సీతా స్వయవరం ఘట్టమే వాల్మీకి రామాయణంలో లేదు. అలాగే లక్ష్మణ రేఖ కూడా లేదు. కానీ.. తులసీదాస్‌ రామాయణంలో ఉన్న ఆ సీన్లు.. నిజమైన చరిత్రకు ఇంకాస్త అందాన్ని తెచ్చాయి. అక్కడ ఒక్క అక్షరం చరిత్ర కూడా మారలేదు. కాబట్టి.. వాటిని యాక్సెప్ట్‌ చేశారు. కానీ చరిత్ర ఘట్టాలనే మార్చేస్తే ఎలా? రామాయణం బాగా తెలిసినవారు కూడా… ఇలా తీస్తే తప్పేమిటీ అని చెప్పడం… ఆశ్చర్యం. ఇష్టం వచ్చినట్టు మార్చడానికి… ఇదేమీ విఠలాచార్య జానపదం కాదు.. కాశీమజిలీ కథా కాదు.

ఇక అసలు కథలోకి వెళ్దాం. “రామాయణాన్ని అంతర్జాతీయంగా అద్భుతంగా ప్రెజెంట్‌ చేశారు, రాముడి జెండా ఎగరేశారు” అని.. మూవీ టీమ్‌ని… మేధావులు పొగిడేస్తున్నారు. వాళ్లు ఎంత ట్రాప్‌లో పడిపోయారంటే.. వాల్మీకీ రామాయణం కథా గమనాన్నే.. మేకర్స్‌ మార్చేసినా.. ఆ విజువల్‌ వండర్‌ వల్ల ఆ మూవీ ట్రాప్‌లో పడిపోయారు. నోడౌట్‌.. రామాయణం సినిమా ఒక విజువల్‌ వండర్‌. కానీ రామాయణంలో ప్రతీ పేజీ తెలిసిన వారికి.. ఇది ఒక సినిమా మాత్రమే.. రామాయణం కాదు.

ఇక ఈ సినిమా చూపిస్తే తప్ప… రాముడి గొప్పదనం గురించి ప్రపంచానికి తెలీదా..? మన కన్నా బాగా… హిందూత్వాన్ని విదేశీయులే అర్థం చేసుకుంటున్న కాలం ఇది. అరుణాచలం, కాశీకి వెళ్లి.. ఒక 10 రోజులు గడిపితే.. ఈ విషయం అర్థమవుతుంది. మరి ఏమిటి ఈ సినిమాలో లోటు?.. అంటే “రామాయణమే” లోటు.

అందుకు కారణం… ఈ సినిమా తెర వెనుక రీసెర్చ్ చేసిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు “డాక్టర్ బోధిసత్వ ” . ఎవరీ బోధిసత్వ. అతని అసలు పేరు… అఖిలేష్‌ కుమార్‌ మిశ్రా. ఇతను హిందీలో PHD స్కాలర్ (చరిత్రలో కాదు). ఇతని పెన్‌ నేమ్‌ “బోధిసత్వ ”. బుద్ధుడికి పరమ భక్తుడని ఆ పేరు చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన నమ్మకం ఆయనది. అది ఆయన ఇష్టం. కానీ తప్పేంటంటే… హిందూయిజాన్ని, మన రామాయణ మహాభారతాలను కూడా… బుద్ధుడి కోణంలోనే చూస్తాడు. బౌద్ధంలోకి కన్వర్ట్‌ చేసి.. చరిత్రను మార్చేస్తాడు. అది తప్పు.

టీవీలో పాపులర్‌ అయిన సియాకే రామ్‌, మహా భారతాలకు కూడా ఈయనే రీసెర్చ్ చేసి కంటెంట్‌ ఇచ్చాడు. అందులో కూడా రాముడికి బుద్ధుడి డైలాగులు రాశాడు. రాముడిని అందులో కూడా మహా వీరుడిగా చూపించలేదు. అక్కడ కూడా రావణుడినే చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు. అదే రీసెర్చ్‌ వర్క్‌ని ఈ రామాయణం కథలోనూ వాడేశాడు.

హాట్‌స్టార్‌లో వచ్చే మహా భారతం సీరియల్‌ ఎంత పాపులరో తెలిసిందే. అందులో దుర్యోధనుడిని, కర్ణుడిని చాలా పాజిటివ్‌గా చూపించాడు. ముఖ్యంగా ఈ మహాభారతం అంతా “దానవీరశూర కర్ణ” సినిమా చూసినట్టే ఉంటుంది. కర్ణుడి మీద ఎంత సింపతి పొంగించాడంటే.. మహా భారతం సీరియల్లో మీకు బాగా గుర్తు ఉన్న క్యారెక్టర్లను ఒక్క రిక్యాప్‌ చేసుకోండి. ముగ్గురి క్యారెక్టర్లు వెంటనే గుర్తొస్తాయి. ఒకటి శ్రీ కృష్ణుడు. రెండూ కర్ణుడు. మూడు దుర్యోధనుడు. పాండవుల్లో ఎవరూ ఠక్కుమని గుర్తుకు రారు.

అలా వాళ్లను తక్కువ చేసి చూపించాడు. ముఖ్యంగా దుర్యోధన, కర్ణ పాత్రల మీద విపరీతమైన ఫోకస్‌ చేసిన సీరియల్‌.. మహా భారత్‌. దుర్యోధనుడు, కర్ణుడి వైపే న్యాయం ఉందని ఆడియన్స్‌తో ఒప్పించే సీన్లే… ఆ సీరియల్లో వందలు ఉంటాయి. మహా భారత అసలు కథనే మార్చేసిన ఘనుడు.. ఈ బోధిసత్వ. ఆ మహా భారతం కూడా విజువల్‌ గ్రాండియర్‌. ఆ గ్రాండియర్‌లో పడి.. నిజంగా మహా భారతం తెలిసివారు కూడా చివరికి అయ్యోపాపం కర్ణుడు.. అనుకునే విధంగా.. ఆ సీరియల్‌ కంటెంట్‌ ఇచ్చాడు.

ఇలాంటి వ్యక్తి.. 4000 కోట్ల రామాయణానికి తెరవెనుక కీలకమైన రీసెర్చ్ వర్క్‌ని అందించాడు. ఈ బోధిసత్వ నూటికి నూరు శాతం “రామ ద్వేషి” అన్న సంగతి చాలా మందికి తెలీదు. 2007లో ఇతను.. “రామాయణ కాలంలో ఇక్ష్వాకు వంశ స్త్రీలపై దారుణాలు జరిగేవని.. వారికి విలువే లేదని” శ్రీ రాముడి వంశాన్ని అవమానిస్తూ కూశాడు. 2008లో మరో కూత కూడా కూశాడు. అదేంటంటే “రాముడు సీతను దారుణంగా చూశాడని, భార్యను నానా హింసలు పెట్టాడని” మాట్లాడాడు. ఇవన్నీ న్యూస్‌లో వచ్చినవే. కాంట్రవర్సి అయినవే.

bodhisatwa

ఈ బోధిసత్వ గారి.. “రామ ద్వేషం” ఏ స్థాయికి చేరిందంటే.. 2024లో ఇతను తన రామ ద్వేషమే ప్రధాన అంశంగా ఒక పుస్తకం రాశాడు. అది.. “అయోధ్యా మే కాలపురుష్‌”. ఉత్తర కాండలో రామావతారం ముగిసే టైమ్‌లో.. కాలపురుషుడు వచ్చి.. రాముడితో సంభాషించే ఘట్టం ఉంటుంది. అది చాలా కీలకమైన ఘట్టం. ఆ ఘట్టాన్ని బోధిసత్వుడు… తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుని… అడుగడుగునా రాముడుని అవమానిస్తూ.. ఆ అవతార పురుషుడిని ఒక చేతకానివాడిగా, నిర్బలుడిగా, గతంలో తాను చేసినవన్నీ తప్పులే అని బాధపడే నిస్సహాయుడిగా వర్ణిస్తూ.. ఇంకేదో కథను రాశాడు. రాముడి అవతార సమాప్తిని.. ఒక అసమర్ధుడి మరణంలా చిత్రీకరిస్తూ… సాగిన ఒక పనికిమాలిన పుస్తకం.. “అయోధ్యా మే కాలపురుష్‌”.

ఇందులో ఉన్నదంతా రామద్వేషమే. విచిత్రంగా 2024లో బోధిసత్వ ఈ పుస్తకం రాస్తే… సరిగ్గా రెండేళ్లకు 2026లోనే.. ఈ బోధిసత్వకి.. రామాయణం ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ని అప్పచెప్పారు. అతని రామద్వేషమే క్వాలిఫికేషనా? దీనివెనుక ఉన్న “అసలు బోధిసత్వులు” ఎవరు? ఈ సినిమాలో కనిపించే ప్రతీ ఘట్టం, ప్రతీ డైలాగ్‌ వెనుక.. ఈ బోధిసత్వ ఉన్నారు. టైటిల్‌ కార్డ్స్‌లో ఈయన పేరు ఉంటుంది. కానీ కావాలనే హైలెట్‌ చేయలేదు. ఎందుకంటే..

ఈ పేరు హైలెట్‌ అయితే నెగెటివిటి వస్తుందని మేకర్స్ అనుకుని ఉండవచ్చు. గడిచిన పదేళ్లలో హిందూ దేవుళ్ల మీద, మన చరిత్ర మీద కొంతమంది “బోధిసత్వుల” విష ప్రచారం చాలా ఎక్కువైంది. వారికి ఎక్కడి నుంచో ఫండింగ్‌ అందుతోంది. రామాయణ, మహా భారతాలు కల్పితాలని.. అవన్నీ బౌద్ధంలో జాతక కథలు అనే ప్రచారం హద్దులు దాటుతోంది. దీని వెనుక పర్పస్‌ ఏంటనేది తెలీదు.

అప్పట్లో బౌద్ధాన్ని వైదిక ధర్మం ఆచరించే వారిపై రుద్దేందుకు.. మన ప్రాచీన సాహిత్యాన్ని బౌద్ధులు వాడుకున్నారు. మా ధర్మం కూడా మీ లాంటి ధర్మమే అని చెప్పి ఆకర్షించడానికి రామాయణం, భారతం ఆధారంగా రాసుకున్న కథలే జాతక కథలు. ఆ తర్వాత కాలంలో మా జాతక కథలను కాపీ కొట్టి రామాయణం, భారతం రాసుకున్నారని.. ఒక ప్రాపగాండ సృష్టించారు. ఇప్పటికీ ఇలాంటి బోధిసత్వులు ఆ పనిలోనే ఉన్నారు.

రామాయణం మూవీ విషయంలో కూడా ఈ “బోధిసత్వ స్టైల్‌” బ్రెయిన్‌ వాష్‌లు బాగానే జరిగినట్టున్నాయి. అందుకే సీత పాత్రను పోషించిన సాయి పల్లవి.. ప్రెస్‌ మీట్‌లో రావణుడి మీద పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు. సీతమ్మవారి పాత్ర మహోన్నతంగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే.. సాయిపల్లవికి ఆ ఛాన్స్‌ ఇచ్చారా అన్న అనుమానం కూడా ఉంది. రష్మిక, దీపిక, కీర్తి సురేష్‌, నయనతార లాంటి హీరోయిన్లు… సీత పాత్రను సాయి పల్లవి కన్నా ఎన్నో రెట్లు బెటర్‌గా పోషించగలరు. పైగా సీతమ్మ పాత్రకు వారు సూట్‌ అవుతారు.

ఇంత భారీ బడ్జెట్‌ సినిమాలో… వాల్మీకి రామాయణంలో వర్ణించిన సీతమ్మ లక్షణాల్లో ఒక్కటి కూడా లేని సాయిపల్లవిని తీసుకోవడం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. సాయి పల్లవి గ్రేట్‌ యాక్టర్‌. అందులో నోడౌట్‌. కానీ సీతమ్మ పాత్రకు ఒక్క శాతం కూడా సరిపోలేదు. స్క్రీన్‌ మీద చూస్తున్నంత సేపు.. సీతమ్మను చూస్తున్నాను అనే ఫీల్‌ గానీ, భక్తిభావం గానీ… ఏ ఫ్రేమ్‌లోనూ నాకు కనిపించలేదు.

ఈ సినిమాను నేను ఫ్రీగా ఏమీ చూడడంలేదు. 200 పైనే టికెట్‌ రేటు. ఫ్యామిలీతో వెళ్లాను.. 2 వేల పైనే వదిలాయి. ఆ డబ్బులకు ప్రేక్షకులకు ఎక్స్‌పక్టేషన్స్‌ ఉంటాయి కదా. 4 వేల కోట్లు పెట్టినా.. 40 వేల కోట్లు పెట్టినా నాకు అనవసరం. ఆ విషయంలో నేను సాయిపల్లవిని సీతగా యాక్సెప్ట్‌ చేయలేకపోయాను. అలాగే సినిమాలో చాలా విషయాలు యాక్సెప్ట్‌ చేయలేం.

వాల్మీకీ రామాయణాన్ని బౌద్ధులు నచ్చినట్టుగా మార్చేసుకుని.. బౌద్ధానికి లింక్‌ పెడుతూ చాలా కథలు రాసుకున్నారు. వాటిలో దశరథ జాతక కథ ఒకటి. ఇది రామాయణాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించే కథ. ఇందులో రాముడి పేరు రామ పండితుడు, తమ్ముడు లక్ష్మణుడే. ఘోరమైన విషయమేంటంటే.. ఈ రామపండితుడికి ఒక చెల్లి ఉంటుంది. ఆమె పేరు సీత. ఇలాంటి పుస్తకాలు చదివి రీసెర్చ్‌ చేసినవాడు.. డాక్టర్‌ బోధిసత్వ.

ఈ దశరథ జాతక కథలో చాలా సీన్లు… డైలాగ్స్‌తో సహా ప్రస్తుత రామాయణంలో కనిపించాయి. అంతే కాదు రావణుడిని బుద్ధుడి పరమ భక్తుడిగా బౌద్ధులు రాసుకున్నారు. బౌద్ధుల దృష్టిలో రావణుడు.. ఒక హీరో. మహా జ్ఞాని పండితుడు. బౌద్ధులను ఆదరించే మహోన్నతమైన వ్యక్తి. అహంకారం ఒక్కటే అతని లోపంగా జాతక కథల్లో చూపించారు. మరి బుద్ధుడి పరమ భక్తుడైన డాక్టర్‌ బోధిసత్వ.. రావణుడిని విలన్‌గా ఎలా చూపించగలడో చెప్పండి?

ఈ సినిమాలో కూడా డాక్టర్‌ బోధిసత్వ రీసెర్చ్‌ ప్రకారమే… రావణుడిని.. బౌద్ధ జాతక కథల్లో ఉన్న హీరోలాగే చూపించారు. కావాలంటే చూడండి.. సినిమా మొత్తం రాముడి కంటే… రావణుడే మహా వీరుడిలా కనపడతాడు. వెన్నుచూపకుండా రావణుడు… దేవతలతో వీరోచితంగా ఒంటి చేత్తో పోరాడతాడు. అసలు రామాయణంలో రావణుడు.. ఇంద్రుడితో, వాలితో, కార్తవీర్యార్జునుడితో చావు దెబ్బలు తిని.. లంకకు పారిపోయి వస్తాడు. ఇది రామాయణంలో క్లియర్‌గా ఉంటుంది.

ఇంద్రుడి చేతిలో రావణుడు చావు దెబ్బలు తిని వస్తే… రావణుడి కుమారుడు.. మేఘనాథుడు… ఇంద్రుడి మీద యుద్ధం చేసి గెలిచాడు. కాబట్టే అతనికి ఇంద్రజిత్‌ అని పేరు వచ్చింది. కానీ ఈ సినిమాలో… ఇంద్రుడిని ఐరావతంతో సహా కింద పడేసిన యోధుడిగా.. రావణుడికి రామాయణంలోనే లేని బిల్డప్‌ ఇచ్చారు. మరి రెండో పార్ట్‌లో ఇంద్రజిత్‌ క్యారెక్టర్‌ని ఎలా పరిచయం చేస్తారో చూడాలి?

రావణుడిని సమాజ సేవకుడిలా, అత్యంత మానవత్వం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా చూపించారు. అసలు రాక్షసుడిగా చూపించనే లేదు. పైగా స్త్రీలకు గౌరవం ఇచ్చేవాడిగా చూపించారు. ఇంతకన్నా బూతు మరోటి లేదు. రావణుడు తాను దాడి చేసిన ప్రతీ రాజ్యం నుంచి.. యువరాణులు, దేవకన్యలను వేల సంఖ్యలో తెచ్చి.. లంకలో పడేశాడు. వారిపై నిత్యం అత్యాచారాలు చేస్తూ ఆ స్త్రీలను నానా హింస పెట్టాడు. “మా ఉసురు తగిలి పోతావు” అని.. ఆ స్త్రీలందరూ జుట్లు విరబూసుకుని శపించారు.

తపస్సు చేసుకుంటున్న వేదవతి అనే గొప్ప ఋషికను అత్యాచారం చేయాలని చూశాడు. “నీ చావునై నేను మళ్లీ పుడతాను” అని వేదవతి రావణుడిని శపించి.. ఆత్మాహుతి చేసుకుని… సీతగా పుట్టింది. కుబేరుడు.. రావణుడికి అన్నయ్య అవుతాడు. విశ్రవసు మొదటి భార్య దేవవర్ణి కుమారుడు వైశ్రవణ. అతనే కుబేరుడు. రావణుడికి అన్న కుబేరుడు. అది కూడా సినిమాలో సరిగ్గా చూపించలేదు.

కుబేరుడి కుమారుడు నలకూబరుడు. అంటే రావణుడికి కొడుకుతో సమానం. నలకూబరుడితో రంభ సహజీవనం చేస్తున్న సమయంలో.. రావణుడు ఆమెను అత్యాచారం చేశాడు. “ప్రస్తుతం నేను నీ కోడలిని.. కూతురుతో సమానం” అని రంభ మొత్తుకున్న వినకుండా.. రంభను దారుణంగా రావణుడు అత్యాచారం చేశాడు. “మరో సారి ఇష్టం లేని స్త్రీని అత్యాచారం చేస్తే.. నీ పది తలలు లక్ష ముక్కలు అవుతాయి” నలకూబరుడు.. బాబాయి అయిన రావణుడిని ఘోరంగా శపించాడు.

ఆ శాపానికి వణికిపోయి… సీతపై అత్యాచార ప్రయత్నాన్ని రావణుడు ఆపుకున్నాడు. ఎంత పండితుడైనా.. రావణుడు కామోన్మాది. అలాంటి రావణుడిని… ఉదాత్త స్వభావం ఉన్నవాడిలా చూపించడం… నూటికి నూరు శాతం తప్పు. రావణుడి తప్పులను వైట్‌వాష్‌ చేసే ప్రయత్నమే ఇది. రామాయణం సినిమాలో చూపించి రావణుడి క్యారెక్టర్‌.. బౌద్ధ జాతక కథల్లో ఉన్న రావణుడి క్యారెక్టర్‌కి చాలా దగ్గరగా ఉంది.

ఇక శూర్ఫణఖ భర్త విద్యుత్‌ జిహ్వను చంపే సీన్‌ మరీ ఘోరం. కాలకేయుల రాజు విద్యుత్‌జిహ్వ. దేవతలకు భయపడి… రాక్షసులకు నిలువ నీడలేని సమయంలో… ఆ రాక్షస మందకి పాతాళంలో చోటిచ్చిన వాడు.. విద్యుత్‌ జిహ్వ తండ్రి. వారూ రాక్షసులే. కానీ రావణుడి తాత సుమాలి, రావణుడి తల్లి కైకసికి… ఆశ్రయం ఇచ్చారు. వారికి మద్దతు పలికారు. ఆ కృతజ్ఞతతోనే.. రావణుడు.. శూర్ఫణఖకు.. విద్యుత్‌ జిహ్వని ఇచ్చి పెళ్ళిచేశాడు.

అధికారం మదమెక్కి.. అహంకారంతో కళ్లు మూసుకుపోయిన రావణుడు… తమకు ఏమీ లేని రోజుల్లో మద్దతు ఇచ్చిన కాలకేయుల రాజ్యాన్ని కూడా ఆక్రమించాలని చూశాడు. తన రాజ్యాన్ని, తన మనుషులను కాపాడుకోవడానికి… విద్యుత్‌జిహ్వ.. రావణుడికి ఎదురు తిరిగాడు. అప్పుడు చెల్లి మొగుడు అని కూడా చూడకుండా.. విద్యుత్‌ జిహ్వను దారుణంగా చంపి ఆ రాజ్యాన్ని కబళించాడు రావణుడు. తన చెల్లిని విధవను చేసిన దౌర్భాగ్యుడు రావణుడు.

ఈ సీన్‌ని పూర్తిగా మార్చేసి… విద్యుత్‌ జిహ్వను ఒక తాగుబోతుగా, స్త్రీలోలుడిగా చూపించారు. చాలా పెద్ద తప్పు ఇది. పైగా.. రాక్షసుల మీటింగ్‌ టైమ్‌లో.. విద్యుత్‌ జిహ్వ అనుచితంగా ప్రవర్తించినట్టు.. అందుకే రావణుడు చంపేసినట్టు.. చూపించి… పరమ ఛండాలంగా.. చూపించారు. ఆ సీనే వరస్ట్‌గా ఉంది. ఈ ఘట్టం ఏ రామాయణంలోనూ లేదు. ఇది పూర్తిగా రావణుడిని ఓవర్‌ ఎలివేషన్‌ చేయడానికి పుట్టించిన పరమ రోత కథ.
ఈ ఒక్క సీన్‌ అసలు రామాయణాన్ని ఎంత డైవర్ట్‌ చేసిందంటే… ఈ సీన్‌వల్లే శూర్ఫణఖ బాధపడి.. అడవులకు వెళ్లినట్టు చూపించారు.

విచిత్రం ఏంటంటే భర్తను చంపిన రావణుడిపై శూర్ఫణఖకు అసలు కోపమే రాలేదట? శూర్ఫణఖకు… రామ లక్ష్మణుల వల్ల అవమానం జరిగిందన్న కోపంతోనే.. తన చెల్లి మీద ప్రేమ పొంగిపొర్లిపోయి… సీతమ్మను.. రావణుడు అపహరించినట్టు చూపించారు. నిజంగా.. శూర్ఫణఖ మీద రావణుడికి అంత ప్రేమ ఉంటే.. ఆమె భర్తను ఎందుకు చంపుతాడు? క్షమించి వదిలేసేవాడుగా? ఈ చిన్నలాజిక్‌ ఎవరి బుర్రలకు ఎక్కలేదా?

మరో కథ కూడా ఉంది మరి. శూర్ఫణఖే.. తన భర్తను చంపిన రావణుడిపై పరోక్షంగా పగ తీర్చుకుంది. సీతమ్మ సౌందర్యం గురించి చెప్పి రావణుడిని రెచ్చగొట్టింది. కామోన్మాది అయిన రావణుడు… సీతను ఎత్తుకొచ్చాడు. రాముడు కంటపడితే చంపేస్తాడు కాబట్టి.. రాముడితో యుద్ధం చేసే దమ్ము లేదు కనుక… దొంగతనంగా రావణుడు అపహరించాడు. ఎంతో ప్రాచుర్యం ఉన్న ఈ కథ సంగతి ఏం చేద్దాం మరి. ఈ కథ పెడితో రాముడు హీరో అవుతాడు, రావణుడు విలన్‌ అవుతాడు. అది ఈ “బోధిసత్వ” గారికి ఇష్టం లేదు. దుర్మార్గుడైన రావణ చరిత్రను.. కన్విన్సింగ్‌ హిస్టరీగా మార్చడం క్రియేటివ్‌ లిబర్టీ కాదు.. అదో మానసిక రోగం.

శూర్పణఖను ప్రపంచ సుందరి అంత అందగా చూపించారు. ఓకే.. కామరూపిణి.. నచ్చిన రూపంలోకి శూర్ఫణఖ మారగలదు. రాముడే ఆమె ముందు శిరస్సు వంచి నిల్చున్నట్టు చూపించారు. చాలా వరస్ట్‌ సీన్స్‌ ఇవి. నఖ అంటే గోళ్లు.. పుట్టడమే పెద్ద పెద్ద గోళ్లతో వికృతంగా పుట్టడం వల్లే ఆమెకు శూర్ఫణఖ అని పేరు పెట్టారు.

కొన్ని రామాయణాలు.. ఆమె అసలు పేరు మీనాక్షీ అని కూడా చెప్తాయి. వికృతంగా ఉండే శూర్ఫణఖ… కామరూప విద్య నేర్చుకుంది. ఏ రూపంలోకైనా మారగలదు. శూర్ఫణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించడం బ్యాడ్‌ టేస్ట్‌ కాదు. కానీ ఆమె అసలు రాక్షస రూపం నుంచి రకుల్‌గా మారితే.. గుడ్‌ డైరెక్షన్‌ అవుతుంది. ఈ సినిమాలో శూర్ఫణఖను చూసిన ప్రేక్షకుడు.. సీత కన్నా శూర్ఫణఖే బాగుంది అనేలా తీశాడు. కంప్లీట్‌లీ మిస్‌గైడెడ్‌. ఓవరాల్‌గా ఇందులో రాక్షసులే మంచివాళ్లు. ఉదాత్త స్వభావులు. అవతార పురుషుడే సవ్యంగా లేడు.

వాల్మీకీ రామాయణంలో రాముడు మహా వీరుడు. వెన్ను చూపిన ఘట్టం ఒక్కటి కూడా ఉండదు. కానీ ఈ సినిమాలో రాముడు వెన్ను తప్ప.. ముఖం చూపించిన ఫైట్లే లేవు. రాముడు.. మారీచ సుబాహులకు కూడా భయపడి… చెట్ల వెంట టెంపుల్‌ రన్‌లా పరిగెడుతూ దాక్కుంటూ, భయపడుతూ.. బాణాలు వేస్తుంటాడు. ఖరదూషణలతో యుద్ధం అయితే… పరమ చెత్తగా తీశారు. ఈ సీన్‌లో ఒక్క ఫ్రేము కూడా కూడా వాల్మీకీ రామయణాన్ని అనుసరించి తీసింది కాదు.

ఇంతకు వందరెట్ల హీరోయిజం.. వాల్మీకీ రామాయణంలో కనిపిస్తుంది. అంత అద్భుతమైన వర్ణన.. ఇతర రామాయణాల్లో కూడా లేదు. ఖరదూషణుల మధ్య రాముడు శివతాండవమే చేస్తాడు. ఈ రోజుల్లో పిల్లబచ్చా హీరోలే.. శవాలను పేర్చి ఆ శవాల మీద కూర్చుని బిల్డప్‌లు ఇస్తుంటే.. రాముడు సింగిల్‌ హ్యాండ్‌లో 14 వేల రాక్షసులను సంహరించే.. హై ఎలివేషన్‌ ఫైట్‌ని ఏ రేంజ్‌లో తీయాలి?

పైగా సీతమ్మ కత్తి పట్టుకోవడం, యుద్ధం చేయడం తప్పు కానే కాదు.. కానీ ఈ సీన్‌లో వాల్మీకీ రామాయణం ప్రకారం సీతమ్మ కత్తి పట్టినట్టు చూపించడం పూర్తిగా తప్పు. అరణ్యవాసంలో మరో సీన్‌లో చూపించాల్సింది. ఖర దూషణ యుద్ధంలోనే… రాముడిలో ఉన్న అసలు వీరుడిని సీతమ్మ చూస్తుంది. అందుకే లంకలో రావణుడి చెరలో ఉన్నప్పుడు కూడా.. రాముడు ఖచ్చితంగా వస్తాడని నమ్మకంతో ఉంటుంది. ఎంత మంది రాక్షసులనైనా సంహరించగలడు అనే నమ్మకంతో ఉంటుంది. ఖరదూషణలతో రాముడి యుద్ధం కేవలం ఒక వార్‌ సీన్‌ మాత్రమే కాదు.. రాముడిపై సీతమ్మకు కలిగిన అపార నమ్మకం. రామాయణాన్ని ముందు అర్థం చేసుకోవడం రావాలి.

అయినా ఈ సృష్టిలో రాముడు తప్ప మరొకరు కదిలించలేని శివధనుస్సునే సీతమ్మ కదిలించింది. రాముడితో సమానమైన శక్తి ఉన్న వారియర్‌ సీతమ్మ. ప్రత్యేకంగా ఆమె వీరత్వాన్ని నిరూపించుకోడానికి… కత్తి పట్టాలా? టెంపుల్‌ రన్‌లా పరిగెడుతూ యుద్ధాలు చేయాలా? సిల్లీ కాకపోతే.

అయితే ఇక్కడ ఉద్దేశం వేరు. రాముడిని.. ఒక చేతకాని వాడిగా చూపించాలన్నదే బోధిసత్వ గారి ఉద్దేశం. అదే చేశాడు. తన “అయోధ్య మే కాలపురుష్‌” పుస్తకంలో రాముడిని ఏ కోణంలో అయితే ఊహించాడో.. ఎలా అయితే రాశాడో… అదే కోణంలో ఈ సినిమాకి కంటెంట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాముడు నీరస రాముడు. ఎందుకో అంతా నీరసంగానే కనిపించాడు. రాముడు ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించాలి.

అలా చూపించేందుకు కూడా మేకర్స్‌కి మనసు రాలేదా? పైగా రాముడు పిల్లాడిగా ఉన్నప్పుడు కొన్ని డైలాగులు ఉంటాయి. బుద్ధుడు తన చిన్నతనం కథలో డైలాగులను రాముడికి పెట్టేశారు. రామావతారమే బుద్ధావతారం అని చెప్పే ప్రయత్నంలా ఉంది. ఇలా ఈ రామాయణంపై రాసుకుంటూ వెళ్తే.. మరో క్రియేటివ్‌ ఫ్రీడమ్‌… రామాయణం అవుతుంది.

ఈ సినిమాని త్రీడీలో, ప్రసాద్‌ PCXలో.. చూసొచ్చాక… మనసు వికలమై… బాపూ గారి సంపూర్ణ రామాయణం సినిమాను ఆద్యంతం చూశాం. ఒక్క సెకను కూడా కన్ను మరల్చకుండా.. ఇప్పటికీ సింగిల్‌ ఫ్రేమ్ కూడా బోర్ కొట్టలేదు. ఈ సినిమా చూశాకే.. “అవునూ… 4000 కోట్ల రామాయణం అసలు గుహుడే లేడే” అని మరోసారి బాధపడాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా నిర్మాత నమిత్‌ మల్హోత్రా దగ్గరకు వద్దాం. ఈయనకు బోధిసత్వ మంచి మిత్రుడని వినికిడి. ఏరికోరి బోధిసత్వను పిలిచి మరీ.. రామాయణ సినిమా రీసెర్చ్‌ని మల్హోత్రా అప్పగించారట. దాని వెనుక ఉన్న ఈక్వేషన్స్‌ ఏమిటో తెలీదు. ఇక నితీష్‌ తివారి ఈ సినిమాకి డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే వరకే చూసుకున్నారు. కానీ స్క్రిప్ట్‌ విషయంలో తెరవెనుక ఉన్నది డాక్టర్‌ బోధిసత్వ గారే.

సద్గురుతో నిర్మాత మల్హోత్రా… ఇంటర్వూ ఒకటి చూశాను. అందులో వాల్మీకీ రామాయణం, జైన రామాయణం, బౌద్ధ రామాయణం అన్ని కథలను ఒక దృష్టితోనే చూడాలని.. రామాయణం ప్రపంచ వ్యాప్తం అని ప్రవచించారు. నిజమే.. కరెక్టే..

కానీ అదేలా సార్‌. వాల్మీకీ రామాయణం రాముడి చరిత్ర. బౌద్ధంలోనూ, జైనంలోనూ ఉన్నవి.. ఆ పేర్లతో ఉన్న కథలు మాత్రమే. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌. రామాయణాన్ని రామాయణంలా చూస్తే బ్రహ్మాండం. కానీ జాతక కథలా చూసినప్పుడే సమస్య. ఇదీ వాల్మీకీ రామాయణాన్ని ప్రేరణ చేసుకుని రాసుకున్న తీసుకున్న ఎన్నో రామాయణాల్లో… మరో 4000 కోట్ల రామాయణం కథ.

#TrendingNow #trending #viral #indianhistory #trendingfacts #historyfacts #history #trending #telugufacts #amazingfacts #ramayana #RamayanMovie

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమా రామాయణానికి తిరగమోత..! అసలు ఎవరు ఈ ‘బోధిసత్వుడు’..?
  • సముద్రంపై ఇల్లు..! ఇరాన్ యుద్దం సెగకు ‘క్రూయిజ్ ప్రాజెక్ట్’ కొలాప్స్ !!
  • కర్ణన్ కన్నుమూత… ఆయన కేసు అప్పట్లో ఓ సంచలనం, ఓ కుదుపు…
  • హానీట్రాపులే కాదు- అక్రమ మార్గాల్లో చైనాకు ఎన్వీడియా చిప్స్ !
  • ఓహో… ఈ కొత్త అర్జునుడు ఆ ఎఎంఆర్ వారసరత్నమేనా..?
  • మొదట్లో ఎన్టీయార్‌నే తిరస్కరించారు ఆ దేవుళ్ల పాత్రల్లో..!
  • రామాయణం హంగామా వెనుక కనిపించని ఓ కీలక వ్యక్తి… అశ్విని అయ్యర్!
  • …. అన్నట్టు విజయ సాయిరెడ్డి కొత్త పార్టీ అనగానే గుర్తుకొచ్చింది… .
  • పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్… విశ్వనగరంలో అత్యాధునిక రవాణా!
  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions