.
యాదగిరిగుట్ట ఆలయానికి స్వయంప్రతిపత్తి… ఈ వార్త శీర్షక, కంటెంటు చదవగానే నవ్వొచ్చింది సుమీ..! వార్త రాసిన తీరుకు కాదు, సర్కారు నిర్ణయం, ఆలోచన తీరుకు…
వార్త సారాంశం ఏమిటంటే..? తెలంగాణ ప్రభుత్వం తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా స్వయంప్రతిపత్తి కల్పించాలని నిర్ణయించింది… కేబినెట్ ఆమోదముద్ర పడింది…
Ads
ట్రస్టు బోర్డు, వయోపరిమితి, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు వంటివి ఇక గుడి పాలకవర్గం నిర్ణయాధికారాలే… ఈవోగా ఐఏఎస్ లేదా అదనపు కమిషనర్… చైర్మన్, 10 మంది ట్రస్టు బోర్డు సభ్యులను వేస్తారు…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, గుడి ఈవో, వైటీడీఏ వీసీ, ఆలయ స్థానాచార్యులు కూడా జాబితాలో ఉంటారు… అదనంగా ప్రత్యేక ఆహ్వానితులు… 100 కోట్ల ఆదాయం ఉన్న ప్రతి గుడినీ ఇలాగే మారుస్తారు… ఇదీ వార్త…
స్వయంప్రతిపత్తి అనే పదం చదవగానే… ఆహా, ఎన్నాళ్లకు ఓ గుడి, ఓ దేవుడు క్షుద్ర రాజకీయ పెత్తనాల నుంచి విముక్తి పొందాడు అని భ్రమపడకండి… అదొక డొల్లపదం… ఇప్పటిదాకా ఎలా ఉందో అలాగే ఉంటుంది, అవే పెత్తనాలు… దేవుడికి విముక్తి ఏమీ ఉండదు…
ట్రస్టు బోర్డు మొత్తం రాజకీయ నియామకాలే… పైగా ప్రభుత్వ కీలక అధికారులు సభ్యులు… ఇక స్వయంప్రతిపత్తి ఏముంది..? (hollow temple atonomy)… ఇన్నాళ్లూ కాస్త స్వచ్ఛంగా ఉంది గుడి… కేసీయార్ హయాంలో పేద, సగటు భక్తుడికి దూరమైన గుడికి రెండు మూడేళ్లుగా మళ్లీ భక్తులు వస్తున్నారు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేనంత ఎత్తుతో స్వర్ణ గోపురమూ వచ్చేసింది.,.
ఈవోగా ఐఏఎస్ అంటే అదనపు సామర్థ్యం ఏదో సమకూరుతుందనే భావనే శుద్ధ తప్పు… ప్రస్తుతం బాగా పనిచేస్తున్న అధికారుల పనితీరు మదింపు వేసి కొనసాగించడం, ప్రోత్సహించడం మేలు కాదా… పోనీ, స్వయంప్రతిపత్తి అంటున్నారు కదా, గుడి ఆదాయం నుంచి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ వంటి డబ్బు తీసుకోదా..?
ఖర్చుకు సరిపడా ఆదాయం ఉంది, తామేమీ ఇవ్వనక్కర్లేదు కాబట్టి ఈ స్వయంప్రతిపత్తి మాటలు… కానీ నిజానికి అక్కడ ఇంకా చాలా ఖర్చు బాకీ ఉంది… ప్రభుత్వమే నయాపైసా ఇవ్వక ఎక్కడి పనులు అక్కడే పఢావు పడిపోయాయి…
100 కోట్ల ఆదాయం ఉన్న ప్రతి గుడినీ ఇలాగే మారుస్తారట… ఓ సగటు భక్తుడికి దీనివల్ల ఫాయిదా ఏముంది..? టీటీడీ తరహాలో పాలనను భ్రష్టుపట్టించి, భక్తుల్ని మరింత సమస్యల పాలుచేయడమే… రాజకీయ పెత్తనాల కారణంగానే కదా తిరుమల పాలనలో అన్ని అక్రమాలు, అవినీతి వ్యవహారాలు… బోర్డు ఏర్పాటు, కొనసాగింపు, సభ్యుల నియామకాల్నీ అధికారంలో ఉన్న పార్టీయే కదా నిర్ణయించేది, మరిక స్వయంప్రతిపత్తి ఏముంది..?
పోనీ, ట్రస్టు బోర్డులోకి ఎవరైనా ఆ ప్రాంత ధార్మికులో, కాస్త నిజాయితీ, దైవభక్తి, ధర్మభయం ఉన్న పారిశ్రామికవేత్తలనో వేస్తారా..? లేదు… పక్కా రాజకీయ నియామకాలు… రాజకీయ నాయకుల ధోరణులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు… సజావుగా సాగే గుడిపాలనను చెడగొట్టడం మినహా ఈ స్వయంప్రతిపత్తి అనే డొల్ల మాటలతో ఒరిగేదేమీ లేదు…
పైగా కొత్త ఉద్యోగాల నియామకం పేరుతో ఫాఫం నర్సింహస్వామి ఖజానా మీద ఎంత అదనపు భారం మోపబోతున్నారో చూడాలిక… తిరుమలలో రాజకీయ నాయకులు ఉద్యోగ యంత్రాంగాన్ని ఎంత చెడగొట్టారో చూస్తూనే ఉన్నాం కదా… ప్చ్, ఉగ్రనరసింహస్వామి ఇక తనను తానే కాపాడుకోవాలి… తనే కాదు, వేములవాడ రాజరాజేశ్వరస్వామి కూడా… ఏమో, త్వరలో ఆ భద్రాచల రాముడు కూడా..!!
Share this Article