ఆస్కార్ వచ్చింది కదా… ఇక చంద్రబోస్ కొందరికి విశ్వవిఖ్యాత కవన సార్వభౌముడు అయిపోయాడు… అనుకోకుండా ఓ వార్తల వాట్సప్ గ్రూపులో ఓ ఆహ్వానం కనిపించింది… ఆశ్చర్యమేసింది… చాలామంది తెలంగాణ పెద్దలు కలిసి చంద్రబోస్‌కు సన్మానం గట్రా ఏర్పాటు చేశారట… చాలా చాలా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు కలిసి నిర్వహిస్తున్నాయట… ఆశ్చర్యం దేనికీ అంటే..? తెలంగాణ వ్యక్తికి ఆస్కార్ లభించడం సంతోషం… గుడ్… ఆ విజయం సాధించినందుకు అభినందించండి, మీరూ చేతనైన కీర్తనలు ఆలపించి, ఆ ఘనుడిని ఆహ్లాదపరచండి… పర్లేదు…
కానీ తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తీసుకొచ్చిన అని చంద్రబోస్‌కు విశేషణం తగిలించడమే ఈ విస్మయానికి కారణం… చంద్రబోస్ రాసిన పాట తెలంగాణ సినీగేయం ఎట్లయిందో సదరు పెద్ద తలకాయలన్నీ తెలంగాణ సమాజానికి ఓ వివరణ ఇస్తే సంతోషం… తెలుగు సినిమా పాటలకు సంబంధించి తెలంగాణ సినీగేయాలు అనే ప్రత్యేక విభాగం ఉందని మాకెవరికీ తెలియదు… ఈ తెలంగాణ సినీ గేయ సాహిత్యం అనగా ఏమిటో కాస్త ఈ పెద్దలందరూ స్పష్టీకరణ ఇస్తే యావత్ తెలంగాణ సమాజం ఈ సంఘాలు, ఈ ప్రభుత్వ శాఖలు, ఈ ప్రభుత్వ సంస్థలకు రుణపడి ఉంటుంది…
అది కీరవాణి కోసం సాగించిన లాబీయింగు… ఖర్చు… లక్కీగా చంద్రబోస్ పంట పండింది… నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ కోసం ఏకంగా పది కేటగిరిల్లో లాబీయింగు, ఖర్చు సాగాయి… ఒక రాయి ఈ నాటు నాటు పాటకు తగిలింది… ఆస్కార్ పడింది… అందులోనూ సదరు గాయకుడికి ఏ గుర్తింపు లేదు, సదరు డాన్స్ మాస్టర్‌కు ఏ గుర్తింపు లేదు… ట్యూన్ మాస్టర్ కీరవాణి, మిక్స్‌డ్ భాషలో పాటను వండిన చంద్రబోస్‌కు మాత్రం ఫుల్ గుర్తింపు… ఐనా సంతోషం, ఓ పాత వరంగల్ జిల్లా బిడ్డ చంద్రబోస్‌కు ఈ కారణం చేతనైనా అభినందనల్ని ఇన్ని సంఘాలు కలిపి సమర్పిస్తున్నాయంటే ఆనందిద్దాం… కానీ..?
Ads
ముందుగా తెలంగాణ సాహిత్య అకాడమీకి భారత జాగృతికి సంబంధం ఏమిటి..? తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌కూ కవి సంగమానికీ ఈ సినీ గేయాలకు సంబంధం ఏమిటి..? ఏం..? నిజంగా చంద్రబోస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించాలని అనుకుంటే సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖలు సరిపోవా..? అసలు ఆ పాటలో తెలంగాణ తనం ఏముందని ఈ మోటు పాటకు కిరీటం పెడుతున్నారో కాస్త క్లారిటీ ఇవ్వండి ప్లీజ్… ఒక్కసారి ఆ పాటను పరికించండి…
పొలం గట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రి సెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరప తొక్కు కలిపినట్టు
నా పాట సూడు నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగా
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా
దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు
నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు
భూమి దద్దరయ్యేలా
వొంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఎసెయ్ రో ఎకాఎకి
నాటు నాటు నాటు
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి
నాటు నాటు నాటు
ఈ పోట్ల గిత్త ఏ తెలంగాణ పొలాల గట్టు దుమ్ములోని దూకిందట..? ఇది తెలంగాణ పోట్ల గిత్తా..? ఈ సంఘాలన్నీ తెలంగాణకు ఐకన్‌గా భావించే సీఎం కేసీయార్ ఏ ప్రాంతం వాడో ఆ ప్రాంతపు తెలంగాణ భాషలోనే చెబుతున్నా… ఈ పోట్ల గిత్త అనే పదానికి తెలంగాణ పల్లెల్లో ఎవరికీ అర్థం తెలియదు… తెలంగాణతనం అంటే బలగం మూవీ… ఈ నాటునాటు కమర్షియల్ కంపు వాసన కాదు…
అసలు నాటు అనే పదాన్ని వాడతామా…? మోటు అనే పదాన్ని వాడతాం… ఆ పాటే నాటు నాటు అని మొదలవుతుంది… ఇదేనా తెలంగాణ సినీ గేయ సాహిత్యం అంటే..? ఒక వ్యక్తిని సన్మానిస్తే సరే, కానీ ఆ పేరుతో నాన్ తెలంగాణ పదాలకు కూడా తెలంగాణ ముద్రలు వేయడం దేనికి..? దీన్ని భావదరిద్రం, భాషదరిద్రం అంటారు… తెలంగాణ పల్లెల్లో పోలేరమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది సార్లూ..?
ఏందో, పచ్చి మిరపను పిచ్చ నాటు అంటాడు… అసలు ఈ పిచ్చ అనే పదం ఎవరు ఉపయోగిస్తారు..? విచ్చుకత్తి ఎక్కడి నుంచి వచ్చింది..? కాలు సిందు తొక్కడం అట, కీసుపిట్ట కూసినట్టు అట… చెడ్డ నాటు అట, తిక్క నాటు అట… ఎకాఎకి, రంకెలేసి ఎగరడం అట… ఇవన్నీ ఎక్కడి పదాలో ఈ పెద్దలు ఒకసారి పాట మొత్తం చదివి చెప్పాలని మనవి… అన్నట్టు వీరంగం సేయడం అంటే ఏమిటో కూడా చెప్పాలి…
అప్పట్లో చిరంజీవి సినిమా ఒకటి చూసినట్టు గుర్తు… అందులో ఒక పాటలో నాటుకొట్టుడు, దంచికొట్టుడు, వీరకొట్టుడు అంటూ సంగీతదర్శకుడు తెగకొట్టేశాడు… ఈ నాటునాటునాటు పాట వింటుంటే అదెందుకో యాదికొస్తోంది… ప్రత్యేకించి చంద్రబోస్ వాడిన పదాలు కొన్ని నవ్వు పుట్టించాయి… ఊర నాటేమిటో, చెడ్డ నాటేమిటో, వెర్రి నాటేమిటో, పిచ్చ నాటేమిటో… ఓహ్, ఏదిపడితే అది రాసేస్తే దాన్ని నాటు అనుకోవాలా..? అదే తెలంగాణ సినీ గేయ సాహిత్యం అని మురిసిపోవాలా..? తెలంగాణలో సంఘాలన్నీ తలా ఒక శాలువా తీసుకొచ్చి కప్పేయాలా..?!
నిజంగా ఒక అచ్చమైన తెలంగాణ పాటను సన్మానించాలనుకుంటే ఈ ఆస్కార్ సాకులు అవసరం లేదు… బలగం పాటల రచయిత, సంగీత దర్శకుడిని సన్మానించండి… అదీ తెలంగాణ సినీగేయానికి ఒక నిజమైన అభినందన అవుతుంది… అంతేతప్ప ఆస్కార్ అనే పేరిట నాన్- తెలంగాణతనానికి చెడ్డనాటు కొమ్ములు తొడగకండి…. అంతేతప్ప లాజిక్ లేకుండా, హేతువు లేకుండా, రీజనింగ్ లేకుండా అడ్డగోలు ‘‘సర్కారీతనం’’ చూపించడం దేనికి..?!
Share this Article