Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణదేవరాయలు తన జీవనసంధ్యలో అక్కడికి ఎందుకు వెళ్లాడు..?!

September 16, 2024 by M S R

రాజుగారి సమాధి ఏది? అవును, రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి? పులకేశికా ? రాజరాజ- 2 కా? అమోఘ వర్షుడికా? వీర భల్లాల దేవుడికా? బిజ్జాల దేవుడికా? గణపతి దేవుడికా? రుద్రమ దేవికా? అనుగు రాజుకా లేక బ్రహ్మ నాయుడికా? రాచ వేమారెడ్డికా? శ్రీకృష్ణ దేవరాయలకా?

చాలా చారిత్రక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ? ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?. కొంత చరిత్ర చదివినా, పైన ఉదహరించిన రాజుల సమాధుల గురించి చాలాసార్లు వెదికాను, కాని అసలు సాంప్రదాయం ప్రకారం హిందూ రాజులకు సమాధులు కడతారా? కట్టారా? ఈ చర్చ మొన్న ఆగస్టు 27న హంపీ వెళ్ళినప్పుడు జరిగింది.

హంపిలో ఉన్నాను సార్ , శ్రీకృష్ణ దేవరాయల సమాధిగా చెప్పే ప్రదేశం ఎక్కడ ఉంది అని ఓ మిత్రుడిని అడిగాను.. దానికి సమాధానంగా అసలు హిందూ రాజులకు సమాధులు కట్టారా అని ఎదురు ప్రశ్నను జవాబుగా అడిగారు?

Ads

ఆలోచిస్తే… ఏ చక్రవర్తి లేదా ఏ రాజు సమాధి కట్టిన ఆధారం లేదు .. కృష్ణ దేవరాయలకు తప్ప మరో రాజు సమాధి అని ఏ ప్రదేశాన్ని గుర్తించలేదు. 8వ శతాబ్దం ముందు వరకు హిందూ రాజులకు సమాధి కట్టే ఆచారం ఉన్నట్లు ఎలాంటి ఆధారం లేదు. ఆ తరువాత అంటే శైవ వైష్ణవ ప్రచారాలు మొదలైన తరువాత కొంత సాంప్రదాయ వైవిధ్యాలు ఏర్పడ్డాయి. కొందరు శైవ రాజులకు సమాధులు కట్టినట్లు అక్కడక్కడ ప్రస్తావన ఉంది కానీ చనిపోయేనాటికి శైవులుగా ఉన్న గణపతి దేవుడు , రుద్రమ సమాధుల ప్రస్తావన లేదు.

సూర్యాపేట సమీపంలోని చందుపట్ల వద్ద రుద్రమదేవి మరణాన్ని , వినుకొండ సమీపంలోని ఈపూరు వద్ద ఆమె సైన్యాధిపతి మరణాన్ని నిర్ధారించే శాసనాలు ఉన్నాయి కానీ ఎక్కడ చనిపోయింది, సమాధి కట్టారా అనే విషయం మాత్రం ఏ శాసనంలో లేదు.

కొందరు చరిత్రకారులు రుద్రమ దేవి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద చనిపోయి ఉండొచ్చని, ఇప్పుడు అమ్మ వారి గుడి వెనుక వైపున్న రెండు నంది స్థూపాలు రుద్రమ దేవి సమాధి అయ్యుండొచ్చని భావిస్తారు.

శైవ ఆచారంలో సమాధి కన్నా ముందే నంది వేయటం వచ్చినట్లుంది. ఆ తరువాత కాలంలో శైవ సాంప్రదాయంలో చనిపోయినవారిని సమాధిలో పద్మాసనంలో కూర్చోబెట్టి, సమాధి పైన ఒక లింగం లేదా నందిని పెట్టటం లేదా సమాధి మీద లింగం పెట్టి, సమాధి ఎదుట నంది శిలను వేయటం సాంప్రదాయంగా స్థిరపడింది. వైష్ణవ సాంప్రదాయంలో మాత్రం మొదటి నుంచి ఉన్నట్లే ఖననం చేయటం కొనసాగుతుంది.

ఈ పోస్ట్ రాయటానికి కారణం అయిన శ్రీకృష్ణదేవరాయల సమాధి నిజంగా ఉందా? దేవరాయలు వైష్ణవుడు .. సమాధి కట్టే ఆచారమే లేదు. అయితే విజయనగర సామ్రాజ్య తొలి రాజధాని అనెగొందిలో తుంగభద్ర నది ఒడ్డున శ్రీకృష్ణ దేవరాయలను ఖననం చేసిన స్థలంగా భావించే చోట 64 స్థంభాల మండపం ఉంది. ఇదే శ్రీకృష్ణ దేవరాయల సమాధి అని ప్రచారంలో ఉంది.

శ్రీకృష్ణ దేవరాయల మరణించిన 1529 నాటికి హంపి పూర్తి స్థాయి రాజధానిగా ఉంది. రాయల నివాసం, పాలన మొత్తం హంపి నుంచే. మరి హంపికి 20 కిమీ దూరంలో ఉన్న ఆనెగొందిలో ఎందుకు శ్రీకృష్ణ దేవరాయలను ఖననం చేశారు? ఒక వేళ తుంగభద్ర ఒడ్డున ఖననం చెయ్యాలి అనుకుంటే హంపికి సమీపంలోనే తుంగభద్ర ఉంది. అనెగొంది వరకు తీసుకురావలసిన అవసరం లేదు కదా…

1520లో రాయచూర్ యుద్ధంలో శ్రీష్ణదేవరాయల విజయం సాధించాడు కానీ గాయపడ్డాడు, అప్పటి నుంచి ఆయన్ను అనారోగ్యం వెంటాడింది. తన కుమారుడి అనుమానాస్పద మరణం తరువాత శ్రీకృష్ణ దేవరాయల మానసిక పరిస్థితి మీద నాకు అనుమానమే. వారసుడి మరణం, తన అనారోగ్యం .. అంతఃపుర కుట్రలు.. వెరసి తన గత చరిత్రకు, మనస్తత్వానికి భిన్నంగా కొన్ని తప్పులు చేశాడు, అందులో ప్రధానమైనది తిమ్మరుసు , ఆయన కుమారుడు మరియు తిమ్మరుసు తమ్ముడు ముగ్గురి కళ్ళు పెకిలించి చెరసాలలో వెయ్యటం..

అనెగొందిలోనే శ్రీకృష్ణ దేవరాయలను నిజంగా ఖననం చేసి ఉంటే రాయలు చివరి సంవత్సరాలు హంపిలో కాకుండా అనెగొందిలోనే గడిచి ఉండాలి. శ్రీ కృష్ణ దేవరాయల మరణంలో ఎలాంటి మిస్టరీ లేదు , ఆయన రాచపుండుతో చనిపోయారని చరిత్రకారులు రాశారు.. నా ఉద్దేశ్యంలో రాచపుండు అంటే క్యాన్సర్.. పని ఒత్తిడి తగ్గించటం, స్థల మార్పు తదితర కారణాలతో శ్రీకృష్ణ దేవరాయల చివరి సంవత్సరాలు ఆనెగొందిలోనే గడిచి ఉండొచ్చు.

మరొక కారణం అనెగొందిలో ఉన్న మధ్వాచారానికి చెందిన “నవబృందావనం” కూడా కావొచ్చు. శ్రీపద్మనాభ తీర్ధతో పాటు మరో ఎనిమిది మంది బృందావనాలు (సమాధులు) అనెగొందిలోనే ఉన్నాయి, రాఘవేంద్రస్వామి ఈ పరంపరలోని వారే. హిందూ రాజులకు సమాధులు లేవు అనేది చరిత్ర, దీనికి అతి కొద్దిమంది మినహాయింపు.

ఉప కథ…. వాలి సుగ్రీవుల యుద్ధం ఇక్కడే ఆనెగొందిలోనే జరిగిందని నమ్ముతారు , ఒక ఉత్తరాది ఆశ్రమం కూడా ఉంది, దాన్ని చూడటానికి నార్త్ నుంచి పర్యాటకులు బాగానే వస్తున్నారు……. (శివ రాచర్ల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions