.
ఏ మీడియంలో చదవాలన్నది ఇప్పుడు పెద్ద చర్చ. మన దేశంలో లెక్కలేనన్ని భాషలు, యాసలు. చివరికి లిపే లేని భాషలు కూడా మనుగడలో ఉన్నాయి. ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రవాహంలో పడి ముందుకు వెళుతుంటే మనం కూడా అందులోనే మునిగి తేలాలి కదా! అన్నది మెజారిటీ వాదం.
ఇంగ్లిష్ వ్యామోహంలో పడి… బతికి ఉండగానే మన మాతృభాషలకు మనమే తలకొరివి పెట్టాలా? అన్నది మరో వాదం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం సాధ్యాసాధ్యాలమీద యుద్ధాలు మరో గొడవ.
Ads
రాజకీయనాయకుల అస్తిత్వ పోరాటానికి భాష ఆయుధం కావడం సంగతిని కాసేపు పక్కనపెట్టి… యునెస్కో ఆధ్వర్యంలోని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్- జిఈఎం బృందం తాజాగా ఏమి కనుక్కుందో చూద్దాం.
ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి భాషాసమస్య వల్ల తామేమి చదువుతున్నామో అర్థం కావడం లేదని జిఈఎం అధ్యయనంలో తేలింది. భూమ్మీద 25 కోట్ల మంది విద్యార్థులు వారిదికాని భాషలో చదువుతూ అర్థంకాక అయోమయంలో ఉన్నారు.
పేద, అల్పాదాయ దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అందువల్ల ఒక భాషను బలవంతంగా రుద్దకుండా స్థానిక అవసరాలను బట్టి బహుభాషల్లో విద్యాబోధన ఉండాలని జిఈఎం సిఫారసు చేసింది.
దీనికి ఉదాహరణ కావాలంటే మన దగ్గర ఏదో ఒక గ్రామీణ ప్రభుత్వ లేదా ప్రయివేట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు వెళ్ళండి. విద్యార్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మొదట పరిశీలించండి. తరువాత మాతృభాష అయిన తెలుగు భాషా సామర్థ్యాన్ని పరిశీలించండి. ఆపై సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్టుల్లోకి వెళ్ళండి. హంస నడకా రాక, కాకి నడకా రాక రెంటికీ చెడ్డ రేవళ్ళైన భావిభారత విద్యార్థులు లెక్కకుమించి కనపడతారు.
జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, చైనాలాంటి దేశాలు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా పిజి, పిహెచ్‌డి స్థాయి దాకా వారి మాతృభాషలోనే బోధించగలుగుతున్నాయి. మన దగ్గర మాతృభాషలో బోధన ఒక ఆదర్శంగా, భావోద్వేగ నినాదంగా పనికి వస్తోంది కానీ… ఆచరణలో ఆదిలోనే హంసపాదులు పడ్డాయి.
ఉదాహరణకు తెలుగు అకాడెమీ పుస్తకాల్లో సైన్స్ పాఠాలు తెలుగువారికి అర్థమైతే ఒక్కో ఊరికి ఒక్కో శాస్త్రవేత్త పుట్టేవాడు. అందులో అంతా తెలుగే. కానీ నన్నయ్య, శ్రీనాథుడే దిగివచ్చినా అర్థం కాని సంస్కృత దీర్ఘసమాస పదబంధుర బహు భార తెలుగు.
# విరళీకరణం
# వాయు విశిష్టోష్ణ నిష్పత్తి
# ద్రవ నిజ వ్యాకోచం
# ప్రతిదీప్తి
# బలాత్కృత కంపనం
# ఊహనం
# అయస్కాంత అభివాహ సాంద్రత
# ప్రాతస్థ తీగ
# ధన శూన్యాంశ దోషం
# ఏకమితీయత
# ఊర్ధ్వస్థిర నిశ్చల స్థితి
లాంటి ఒక్కో పారిభాషిక పదం అర్థం కావడానికి ఒక్కో భాష్యకారుడు పుట్టాలి. అందులో మాటలకంటే ఇనుప గుగ్గిళ్ళు చాలా మెత్తన! మాతృభాషలో విద్యాబోధన కావాలనుకునేవారు ముందు మాతృభాషలో సరళంగా, సూటిగా పాఠ్యపుస్తకాలు తయారుచేయించడం మీద దృష్టిపెట్టాలి.
ఈ కథనం రాయడానికి సైన్సును తెలుగు మీడియంలో ఎలా చెబుతున్నారోనని నాలుగు భౌతికశాస్త్ర పాఠాలను చదివితే పైపైన దొరికినవి ఆ పారిభాషిక పరమోత్కృష్ట వైశేషికాంశాలు! భౌతికమైన బతుకుమీద తీపితో ఇక తెలుగు భౌతికశాస్త్రం లోతుల్లోకి వెళ్ళలేకపోయాను.
వాటిని చూశాక నాకు తెలుగు అక్షరం ముక్క కూడా చదవడం రాదని, వచ్చినా అర్థం కాదని స్పష్టంగా అర్థమయ్యింది! నేను కూడా త్రిభాషా సూత్రం మెడకు కట్టుకుని మళ్ళీ తెలుగు ఓనమాలు నేర్చుకోవాలన్న ఎరుక కలిగింది!
“అనంత వాయు విశిష్టోష్ణ నిష్పత్తితో;
సరళం కాని పాఠాలతో అవిరళ విరళీకరణల్లో;
ద్రవం నిజంగా వ్యాకోచించినప్పుడు…
ఎందరు తెలుగు మీడియం సైన్స్ విద్యార్థులు బలాత్కృత కంపనాలకు గురయ్యారో!
వారి ఊహల్లో ఊహనం ప్రాతస్థ తీగగా ప్రతిదీప్తమయ్యిందో!
చివరికి మార్కుల కార్డులు వచ్చినప్పుడు అన్నీ సున్నాలుగా ధన శూన్యాంశ దోషమయ్యిందో!
బతుకు అర్థం కాని చదువుల అయస్కాంతానికి అతుక్కుని అభివాహ సాంద్రప్రవాహంలో కొట్టుకుపోతోందో!
బతికి ఉండగానే తెలుగు మీడియం ప్రేమవల్ల ఊర్ధ్వ స్థిర నిశ్చల స్థితికి ఎలా చేరుకుని త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారో!
అర్థం కాని చదువుల చట్రాల్లో అర్థం లేని పరుగుల్లో ఎలా పోటీలు పడుతున్నామో!”
తెలిస్తే మన పిల్లలకు మనమే ఎంతటి రంపపు కోత పెడుతున్నామో అనుభవంలోకి వస్తుంది.
యునెస్కో కోరుకున్నట్లు అర్థం కాని భాషలో కాకుండా అర్థమయ్యే భాషలో చదువులు చెప్పే రోజలు నిజంగా వస్తాయా! కనీసం కలలో అయినా వస్తాయా?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article