1994-95… ఈనాడు కరీంనగర్ యూనిట్ ఆఫీస్… రామోజీరావు ప్రతి 3 నెలలకోసారి ఒక్కో యూనిట్ వెళ్లి, జిల్లాల వారీగా మీటింగులు పెట్టేవాడు… సర్క్యులేషన్, యాడ్స్, ఇతర పాలనసంబంధ ఇష్యూలే గాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్స్ జరిగేవి… పత్రిక గురించే గాకుండా జిల్లాల్లో స్థితిగతుల మీద ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడు… ఓ మీటింగులో మేడారం జాతర ప్రస్తావన వచ్చింది… లక్షల మంది రెండేళ్లకోసారి తరలివస్తారు, ప్రధానంగా గిరిజనం ఆరాధించే దేవతలు అని డెస్క్ సభ్యులు చెప్పారాయనకు…
కేవలం రెండు గద్దెలు, నడుమ నిటారుగా కర్ర స్థంభాలు… ఓ కుంకుమ భరిణెలో అడవి నుంచి అమ్మల రాక… సకుటుంబ, సపరివార సమేతంగా ఎడ్ల బళ్ల మీద ప్రయాణాలు… మాంసం, మద్యంతో సహా వెళ్లి… పుట్టు వెంట్రుకలు, మొక్కులు, శివాలు… సగటు గిరిజనుడు దీన్ని ఓ పవిత్ర విధిగా భావిస్తాడు… వేల ఎడ్ల బండ్లు, ఒక్కొక్క బండి ఒక గుడారం అవుతుంది… అన్నీ విన్న రామోజీరావు రెండు క్షణాలు కూడా ఆలోచించలేదు… ఈసారి హెలికాప్టర్ పెట్టి ఏరియల్ ఫోటోలు తీయిద్దామా అనడిగాడు… డెస్క్ షాక్…
సరే, ఈసారి ఓ పనిచేద్దాం, మేడారం జాతరకు విస్తృత కవరేజీ ఇద్దాం అన్నాడు… జాతర దేశమంతా తెలియాలని ఆర్డరేసాడు… అప్పట్లో తనలో ఓ సాహస జర్నలిస్టు ఉండేవాడు… ఫోన్ లేదు, అక్కడ ఉండటానికి ఏమీ ఉండదు, రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు… తిండీతిప్పలు సరేసరి… ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నయ్… ఐనా ఈనాడు టీం వెళ్లింది, ఫోటో రీళ్లు పంపడానికి, వార్తల కవర్లు పంపడానికి నానా తిప్పలు… పోలీసుల వైర్‌లెస్ సెట్‌లో సమ్మక్క రాక వార్త కన్‌ఫమ్ చేసుకుని, రాత్రి ఒంటీగంట, రెండుగంటలకు బ్యానర్ అచ్చేసిన రోజులున్నయ్…
Ads
కానీ ఇప్పుడు… ఈనాడు వాళ్లకు మేడారం జాతర అంటే ఉత్త జుజుబీ ముచ్చట… పైగా ఇదేదో తెలంగాణ జాతరలే అనే తూష్ణీభావం… ఈరోజు ఏపీ ఎడిషన్‌లో మూడో పేజీలో రెండు చిన్న ఫోటోలు, ఓ చిన్న వార్త… అంతే… అంటే ఈ జాతర మీద కూడా తెలంగాణ ముద్ర వేసేసి, లైట్ తీసుకోవడమేనా..? కనీసం కోటి మంది రెండురోజుల వ్యవధిలో ఆ గద్దెల్ని భక్తిగా స్పృశించే విశేషం మేడారం అంటే…! ధనికుల దేవతలు కాదు వాళ్లు… అక్కడ సర్వదర్శనాలు లేవు, రేటు దర్శనాలు, ఆర్జిత సేవలు గట్రా ఏమీ ఉండవ్… పేద గిరిజనం దేవతలు… (ఇప్పుడు అందరి దేవతలు అయ్యారు…)
(సమ్మక్క ఆగమనానికి స్వాగతం చెబుతూ ములుగు ఎస్పీ కాల్పుల దృశ్యం… అప్పటి కాకతీయ నిరంకుశ పాలకులపై యుద్ధం చేస్తూ అమరులైనవారే సారలమ్మ, సమ్మక్క…)
ఇది రాష్ట్ర ఉత్సవం… పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి మరీ సమ్మక్కను ఆహ్వానిస్తారు… ఇప్పుడంటే సడీచప్పుడు లేదు గానీ అప్పట్లో ఆ ప్రాంతాలన్నీ నక్సలైట్లకు ఆయువుపట్లు… ఐనా జాతర జరిగినన్ని రోజులూ సైలెన్స్… సో, ఎవరో సెలబ్రిటీ తిరుమల సందర్శించిన ఫోటో, వార్తకన్నా ఇది తక్కువా..? అవి రాసుకుని పులకరించి, పరవశించి పోతారు కదా… మరి ఇది గిరిజనేతరుల ఉత్సవాలకన్నా తక్కువా..? ఏమైంది అసలు ఈనాడుకు..? ఒక మాట అనడానికి సాహసిస్తున్నా… బేశరం…!! జంపన్నవాగులో నిమజ్జనమే బెటర్…
ఓ పార్టీ కరపత్రికగా విఖ్యాతి పొందిన నమస్తే తెలంగాణది మరో విషాదం… నిన్న, ఈరోజు కేసీయార్ స్వామివారి పుట్టినరోజు కదా… యాడ్స్, ప్రత్యేక కథనాలు, శుభాకాంక్షలతో పేజీలకుపేజీలు కుమ్మేసింది… ఈరోజు కవరేజీయే చూసుకుంటే కేసీయార్ ఫోటోలు, వార్తలు, భజనల వార్తల కవరేజీలో మేడారం కవరేజీ రెండుమూడు శాతం కూడా కనిపించలేదు… నిజంగా మేడారానికి వార్తా ప్రాధాన్యమే లేదా..? సొంత పత్రిక కాబట్టి సమ్మక్క-సారలమ్మలకన్నా కేసీయార్ దేవుడే ఎక్కువ కావచ్చుగాక… కానీ ఈ భక్తకోటి వనజాతరపై ఇంత నిర్లక్ష్యమా..? కేసీయార్ అక్కడికి వెళ్తే తప్ప ఆ దేవతలు ఈ పత్రికకు కనిపించరేమో…
వీటితో పోలిస్తే సాక్షి, ఆంధ్రజ్యోతి నయం… సరైన ప్రయారిటీ ఇచ్చాయి… ఇంగ్లిష్, ఇతర భాషల పత్రికలు వేరు… పల్లెల్లోకి, సగటు ప్రజల్లోకి అధికంగా రీచ్ ఉండేది తెలుగు పత్రికలకే కాబట్టి వాటి కవరేజీ తీరును ప్రస్తావించుకుంటున్నాం… విగ్రహాల్లేవు, భారీ కట్టడాల్లేవు, రేట్లవారీ సేవల్లేవు… అచ్చమైన గిరిజన సంప్రదాయంలో మొక్కులు… రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ వనం నుంచి వచ్చి ఆశీర్వదిస్తారనే భక్తకోటి నమ్మకమే అసలైన దేవుళ్లు… ఏమోలే… మన మీడియాకు కమర్షియల్ ముచ్చింతల్ తప్ప ఇలాంటి జాతరలు ఎందుకు కనిపిస్తాయి..?!
Share this Article