Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది కాదు బ్రో… నన్ను ఘోరంగా బ్రో అని తిడితే ఊర్కోవాలా బ్రో…

March 24, 2025 by M S R

.

తను అంగీకరించిన అవినీతి సొమ్ము కోట్లకు కోట్ల నోట్లను ఎన్ని సార్లు లెక్కపెట్టినా… ఒకటి తక్కువయ్యిందంటూనే ఉంటాడు పుష్ప సినిమాలో కొత్తగా వచ్చిన ఎస్ పి. ఎర్రచందనం దుంగల దొంగలు మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టి కరెక్ట్ గానే ఉంది కదా! అంటూ ఉంటారు. అప్పుడు ఒకటి ఏది తగ్గిందో! పుష్పాకు అర్థమవుతుంది.

“జిల్లా ఎస్పీని సార్! అని సంబోధించడం” ఒక్కటే తగ్గిందని ఆఫీసులో అందరిముందు అయిదు కోట్ల లంచం తీసుకుంటూ ఆ అధికారి పుష్పాలకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అంతర్జాతీయ స్మగ్లర్ల నుండి లంచం తీసుకున్నంత మాత్రాన… వారు “సార్!” అని సంబోధించకపోతే తనకు ఎంత అమర్యాద? ఎంత అవమానం? ఎంత ఇది? ఎంత అది?

Ads

పూర్వాశ్రమంలో లెక్కల సార్ అయిన దర్శకుడు సుకుమార్ “సార్!” సంబోధన సన్నివేశాన్ని పుష్ప కథలో అద్భుతంగా సృష్టించాడు… బయట నిజ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది? అని అనుకోవడానికి వీల్లేకుండా సముద్రతీర విశాఖపట్నంలో ఇలాగే జరిగింది. ఇంతకంటే ఘోరంగానే జరిగింది.

విశాఖ సీతమ్మధారలో ఒకానొక హైరైజ్ అపార్ట్ మెంట్ల గేటెడ్ కమ్యూనిటీ. ఇరవై తొమ్మిదో అంతస్థులో ఉన్న ఒక ఇంటాయన మధ్యాహ్నం పూట స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ బాయ్ వెళ్ళి బెల్ కొట్టాడు. ఒక పెద్దామె తలుపు తెరిచింది. ఆమె ఏమి మాట్లాడుతోందో డెలివరీ బాయ్ కి అర్థం కాలేదు.

డెలివరీ బాయ్ చెబుతున్నది ఆమెకు అర్థం కాలేదు. ఈలోపు లోపలినుండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినతను వచ్చాడు. ఏమిటి విషయం? అని అడిగాడు. “మీ ఫుడ్ ఆర్డర్ బ్రో” అన్నాడు యథాలాపంగా. అంతే. నన్ను బ్రో అంటావురా అని ఇంటాయన రెచ్చిపోయాడు. తిట్టాడు. కొట్టాడు.

కోపం చల్లారక… కిందికి తీసుకెళ్లి సెక్యూరిటీతో కూడా కొట్టించాడు. ఇంకా కసి తీరక… డెలివరీ బాయ్ బట్టలన్నీ విప్పించి… ఒట్టి అండర్ వేర్ మీద గేటు బయట ఎండలో నిలుచోబెట్టి… బ్రో అన్నందుకు క్షమించాలని లేఖ రాయించుకుని… బెదిరించి… పంపాడు.

చావుదప్పి కన్నులొట్టబోయిన డెలివరీ బాయ్… అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరో పుకార్లు పుట్టించారు. ఊళ్ళో ఉన్న డెలివరీ బాయ్ లందరూ ఈ అపార్ట్ మెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. డెలివరీ బాయ్ బతికే ఉన్నాడని… అతను కేసు పెడితే… విచారించి… బాధ్యులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో డెలివరీ బాయ్ ల సంఘం శాంతించింది.

రాయలసీమ, తెలంగాణాలో ఎంత పెద్దవారినైనా నువ్వు అనే అంటారు. ఎంత పెద్దవారినైనా అన్నా, అక్కా అంటే చాలా మర్యాద ఇచ్చినట్లు. మీరు అంటే పరాయివారిలా చాలా దూరం పెట్టినట్లు. ఈమధ్య ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీరు పెరిగిందనుకోండి. అది వేరే విషయం.

అత్తా కోడళ్ళ గొడవలో-
“అత్తా! ఒళ్ళెలా ఉంది? పోట్లగిత్తలా మీది మీదికొస్తున్నావ్!
ఒక్క తన్ను తన్నానంటే కాళ్ళు విరిగి… మూలన పడి ఉంటావ్! జాగ్రత్త!” అన్న హెచ్చరికకు గోదావరి జిల్లాలో అయితే-
“అత్తగారండీ! మీరు నా మీదిమీదికి వస్తున్నారండీ. మీ కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతానండీ! ఆట్టే నావైపు రాకండి…”
అని ఎంతటి సిగపట్లలో అయినా సంబోధనలో మర్యాద తగ్గకూడదని వెనకటికి ఒక భాషాశాస్త్రవేత్త అనేక ఉదాహరణలతో నిరూపించారు.

“అన్న” అన్నమాటకు సమానంగా ఆధునిక తరం “బ్రో” మాటను వాడుతోంది. బ్రదర్ మాటకు సంక్షిప్త రూపమది. ఇందులో తిట్టు, బూతు, అమర్యాద, అగౌరవం ఏమీ లేదు. ఆ ఇరవై తొమ్మిదో ఫ్లోర్లో ఆకాశంలో బతుకుతున్న జీవుడికి ఇందులో ఏమి బూతు ధ్వనించిందో మరి!

నిజంగా ఆ పిలుపులో అంత అభ్యంతరముంటే నన్నలా పిలవకు! అని నోటితో చెప్తే సరిపోయేది. భగవంతుడు నోరిచ్చిన విషయాన్ని చాలామంది చాలా సందర్భాల్లో మరచిపోతూ ఉంటారు. అక్కడే వస్తుంది చిక్కు.

పొట్టకూటికోసం మిట్టమధ్యాహ్నం ఇరవై తొమ్మిదో ఫ్లోర్ కు వచ్చిన డెలివరీ బాయ్ పిలుపులో అమర్యాద ఉందని… బట్టలు విప్పించి… నగ్నంగా నిలబెట్టించి… తన నగ్నస్వరూపాన్ని, స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు ఈ బ్రో కాని సార్!

ఎవరు సార్?
ఎవరు అన్న?
ఎవరు బ్రో?

“ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరుక?
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక!

వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో…

కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో?”
అన్న వేటూరి పాటను విశాఖతీర బంగాళాఖాతం గుండె పగిలేలా పాడుకోవాలి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

.

bro

జాతికి కరదీపిక ఈనాడే ఫస్ట్ పేజీలో పాఠకుల్ని బ్రో అని సంబోధించి పులకరించి, పరవశించిపోయింది… ఆ బ్రో అనే పదంలోనే ఓ పవిత్రత, ఓ ఆత్మీయత, ఓ అప్యాయత గట్రా కనిపించాయి దానికి… ఐనా సరే ఆ ఇంటాయనకు అంత కోపం రావడం విచిత్రం కదా బ్రో… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions