…… జగన్ ఫేక్ సీఎం..? ఎలా..? పాపం, ఆయనకు వోట్లు వేసిన ప్రజలు కూడా ఫేకేనా..? పోలింగులో పాల్గొన్న అధికారయంత్రాంగం కూడా ఫేకేనా..? అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ కూడా ఫేకేనా..? తనను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నరుడూ ఫేకేనా..? చోద్యం చూస్తూ కూర్చున్న మన కోర్టులు, స్వతంత్ర వ్యవస్థలు కూడా ఫేకేనా..? ఆ ప్రమాణ స్వీకారం వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేకేనా..? టీవీ5, టీవీ9 కూడా ఫేకేనా..? ఎవరు ఫేక్..?
తెల్లారిలేస్తే సవాలక్ష ఫేక్ మెసేజులు సోషల్ మీడియాలో చదువుతూ చదువుతూ… ఫాఫం, చంద్రబాబు గారి బుర్ర కూడా ఈ ఫేక్ మాయలో చిక్కుకుని గిర్రున తిరుగుతోంది.., లేకపోతే కళ్లెదుట ఓ సీఎంను పట్టుకుని ఫేక్ అని ఆక్షేపించడం ఏమిటి..? ఏదో పెద్ద తేడాయే కొడుతోంది…
Ads
ఒక్కమాట… మొన్నటి ఎన్నికల్లో జగన్పై తలబడిన పార్టీ, నాయకులు, అధినాయకుడు కూడా ఫేకేనా బాబు గారూ..? ఫేక్ అంటే ఒక నకిలీ… ఒక అబద్ధం… అంతే తప్ప ఫేక్ అంటే తప్పుడు కాదు… జగన్ తప్పుడు పనులు చేసే తప్పుడు ముఖ్యమంత్రి అని ఆరోపించదలుచుకుంటే వోకే… మీ ప్రత్యర్థి కాబట్టి… కానీ ఏకంగా ఫేక్ సీఎం ఎలా అవుతాడు..?
అయినా మాదే తప్పు… చంద్రబాబు మాటలకు అర్థాలు వెతకడం ఏమిటి..? ఇడ్డూరం కాకపోతే…! మొన్నటి ఎన్నికల దాకా మోడీ ఫేక్… ఇప్పుడు జగన్ ఫేక్… ఎవడు కొరడా తీసుకుని వెంటపడతాడో వాడు ఫేక్… కేసీయార్ ఫేక్… వోటుకునోటు ఫేక్… వోటర్ల ఈసడింపు ఫేక్… మరీ డజను మంది ఎమ్మెల్యేలకే పరిమితమైపోయిన దుస్థితీ, దుర్గతీ ఫేక్… కూలిపోతున్న మన ఆర్థికస్థంభాలు ఫేక్… బట్టబయలవుతున్న పాత బాగోతాలు ఫేక్… అసలు ఫేక్ కానిదేముంది..? వేల కోట్ల హెరిటేజ్ ఫేక్, వందల కోట్ల చంద్రభవంతి ఫేక్… ఫేక్… ఫేక్…
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఫేక్… మొదటిసారి అదుపు తప్పి, అడుగులు తప్పి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం ఫేక్… ఇంతటి అనుభవాన్ని, రాజకీయ హూందాతనాన్ని కూడా కోల్పోతున్న తీరు ఫేక్… ఆ అరుపులు, కేకలు ఫేక్… అంతా ఫేకే మహారాజా..? ఈ ఫేక్ సీఎంకు ఇంగితజ్ఞానం ఉందని అనుకోవడం కూడా ఫేకే అనేసుకొండి… అప్పుడిక ఏ బాధా ఉండదు… ఈ ఫేక్ పెయిన్ నుంచి బయటపడొచ్చు…
కానీ ఒక్క కోణంలో మాత్రం కొంత కరెక్టేనేమో అనిపిస్తోంది… జగన్ ఫేక్ కాబట్టేనేమో… ఏమీ చేతకాని నకిలీ సీఎం కాబట్టే… బహుశా ఈరోజుకూ ఏ బండారంలోనూ చంద్రబాబు పాత్ర బయటపడలేదేమో… ఎవరూ నిరూపించలేదేమో… రాజమండ్రి జైలు రారమ్మని పిలవలేదేమో… ఉత్త ఫేక్ ప్రభుత్వం, ఫేక్ కేసులు, ఫేక్ దర్యాప్తులు, ఫేక్ ఝలిపింపులు, ఫేక్ రాయింపులు, ఫేక్ వాయింపులు… రియల్ సీఎం అయితే ఊరుకునేవాడా..? ఫేక్ కాబట్టే ఏమీ చేతకావడం లేదు… మరి ఫేక్ సీఎం కాబట్టే ఈ ఫాయిదా అనుకుని ఖుషీగా ఉండొచ్చుగా నాలుగు రోజులు..? అంతా ఫేక్ కోపం, ఫేక్ నిరసన కాకపోతే… ఏమిటిది డియర్ ఫేక్ బాబు గారూ..? సారీ, చంద్రబాబు గారూ…!
Share this Article