మన ఆ నలుగురు శంకరాచార్యుల్లాగే… ఇంకొందరు ఉంటారు… దేశంలో నిజంగా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ఇష్యూ వచ్చినప్పుడు గానీ, మతసంబంధమైన సమస్య వచ్చినప్పుడు గానీ అస్సలు కనిపించరు…
వీళ్లేమైనా ఆధ్యాత్మిక భావనలు, మత వ్యాప్తికి, ధర్మ ప్రచారానికి ఉపయోగపడతారా అంటే అదీ ఉండదు… ఎవరి దందాల్లో వాళ్లు ఉంటారు… కొందరి పేర్లు అసలు ఎవరికీ తెలియవు… కానీ హఠాత్తుగా తెర మీదకు వస్తారు, యావత్ హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెరపైకి వస్తారు…
అసలు మనోభావాలు అనే పదమే ఓ బ్రహ్మపదార్థం… పురాణాలకు, ఇతిహాసాలకు చాలామంది ప్రవచనకారులు బాష్యాలు చెబుతారు… ఎవరి అవగాహన స్థాయి వాళ్లది, అంతేతప్ప వాళ్లు ఆ దేవుళ్లనో, వాళ్లను కీర్తించేవాళ్లనో కించపరచడం కాదు… కల్కి సినిమా కథ కూడా అంతే… ఓ క్రియేటివ్ లిబర్టీ… పురాణాల్లో ఇలా ఉందని కాదు, ఇలా ఉంటే ఎలా ఉంటుందనే ఊహ… ఇందులో ఏ పురాణ పురుషుడినీ కించపరిచింది లేదు…
Ads
కానీ ఓ మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ… అకస్మాత్తుగా తెర మీదకు వచ్చి కల్కి టీం మీద కేసులు పెడతానని లీగల్ నోటీసులు పంపించాడు… మీరు పురాణాలను కించపరుస్తున్నారు, మనోభావాలు దెబ్బతీస్తున్నారు, ప్రత్యేకించి కల్కి కృత్రిమ గర్భధారణ ద్వారా పుడతాడనే తప్పుడు భావనల్ని ప్రచారం చేస్తున్నారు అనేది ఆ నోటీసుల సారాంశం…
మరి కేసుకు అడిషనల్ వాల్యూ రావాలి కదా… ఏకంగా అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లను కూడా అందులో చేర్చాడు… అవసరం లేని అంశాల్లోనే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, రివ్యూయర్లకే 25 కోట్లకు నోటీసులు పంపించిన కల్కి టీం ఈయన ఝలక్ ఇవ్వగానే బెదిరిపోతుందా..? లీగల్‌గానే ఫేస్ చేస్తుంది… అదంతా ఇక వేరే కథ… థియేటర్ రన్ పూర్తయిపోయినట్టే, ఇక ఓటీటీ, టీవీలు మిగిలి ఉన్నాయి, సీక్వెల్ మీద ప్రభావం పడకుండా చూసుకోవాలి… అంతే…
అసలు ఎవరీయన..? కల్కి ఫౌండేషన్ నిర్మాత అట… కల్కి ధామ్ అనబడే పీఠానికి అధిపతి అట… 2014లో సంభాల్ నుంచి, 2019లో లక్నో నుంచి పోటీచేసి ఓడిపోయాడు… మొన్నటి ఎన్నికల్లో లక్నో నుంచి రాజనాథ్ సింగ్ మీద పోటీచేస్తాడనే ప్రచారాలు జరిగాయి కూడా… కల్కి ధామ్‌కు 300 ఎకరాల భూమి ఉందని వార్తలు…
కాంగ్రెస్ నాయకుడే కానీ అయోధ్య ప్రాణప్రతిష్ఠకు హాజరు కారాదనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి పలు వ్యాఖ్యలు చేశాడు… దానితో ఆగ్రహించిన సదరు హైకమాండ్ ఈయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది… అవును కదా మరి, అయోధ్యకు వెళ్తే సెక్యులర్ పాతివ్రత్యానికి దెబ్బ కదా… ఏదో, ఎన్నికలప్పుడు జంధ్యాలు, గోత్రాలు, గంగస్నానాలు వోకే గానీ… మిగతా సమయాల్లో అవన్నీ నిషిద్ధాలు కదా…!!
‘‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదాని మెజారిటీ హిందూ మతస్తుల మనోభావాల్ని దెబ్బతీయడం నేరమే అవుతుంది… పవిత్ర పురాణాల గాథల్ని మార్చి జనంలోకి తీసుకువెళ్లడం నేరమే… అందుకే ఈ లీగల్ నోెటీసు’’ అని సుప్రీంకోర్టు లాయర్ ఉజ్వల్ ఆనంద శర్మ తన నోటీసుల్లో పేర్కొన్నాడు…
మరి సినిమా రిలీజైన ఇన్నాళ్లకు మేల్కొన్నారేమిటయ్యా అని అడగొద్దు… తీరిక దొరికింది ఇప్పుడే కదా స్వామివారికి..!! మరీ కల్కి ఫౌండేషన్, కల్కి ధామ్ అని పెట్టుకున్నాక, కల్కి పేరుతో దుకాణం నడిపిస్తూ ఇక స్పందించకపోతే బాగుండదని అనుకున్నాడేమో.,.!! (కల్కి పేరిట మన తెలుగు స్వాములు కూడా కొందరు మస్తు దందాలు నడిపించి, ఇప్పుడు అదృశ్యమయ్యారు… కల్కి పదానికి ఉన్న మార్కెట్ వాల్యూ అది…)
Share this Article