…… కేసీయార్ భయపడుతున్నాడా..? తనపై బీజేపీ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వేధించబోతున్నదనే సందేహంలో పడ్డాడా..? అదేసమయంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను చల్లార్చే పనిలో పడ్డాడా..? లేక కేంద్రంతో మళ్లీ సత్సంబంధాలు కోరుకుంటున్నాడా… ? అది సాధ్యమేనా…? అ దశ దాటిందా..? బీజేపీ టైం చూసి వేటు వేసే ఆలోచనలో ఉందా..? ఇవన్నీ ప్రశ్నలు… ఎందుకు అంటే… ? పరిస్థితులు… వాటి ఆధారంగా వేసే అంచనాల క్రోడీకరణ… విశ్లేషణ…
బీజేపీ అంతు చూస్తా, ఢిల్లీకి చేరి గాయిగత్తర లేపుతా, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతా… ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తా… అనే ఢాంఢూం హెచ్చరికల దశల నుంచి… నీ పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సూపర్ అని పొగడటం… ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరి, ప్రధానితో భేటీకి టైం కోరుకోవడం గట్రా పరిణామాల వెనుక జరుగుతున్నది ఏమిటి..? రకరకాల అంచనాలు, విశ్లేషణలు….
నిజానికి ప్రధానిగా మోడీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీయార్…. హోదాలు వేరు, వ్యక్తులుగా వేరు… ఓ దేశ కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని ఆహ్వానించడం రాజనీతిజ్ఞత… దేనికదే… ఇష్యూ బేస్డ్ స్పందన… అఫ్కోర్స్, తను చేస్తున్నదీ అదే కదా, కొత్త సచివాలయ నిర్మాణం…! కానీ రాజకీయ విశ్లేషకులు కొత్త అర్థాల్ని వెతుకుతారు కదా… అదే…
Ads
నిన్నటి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ కె.శ్రీనివాస్ రాసుకొచ్చింది ఏమిటంటే… ఇదుగో, ఇలా….
జాతీయ దర్యాప్తు సంస్థలు కేంద్ర ఆధీనంలో ఉంటాయి కాబట్టి…. తన నెలవును, కొలువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమొచ్చేలా ఓ ఎడిట్ ఫీచర్ సాగింది… శ్రీనివాస్ నర్మగర్భంగా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ… తన ఓనర్ రాధాకృష్ణ అయితే ఇలా డొంకతిరుగుడుగా ఏమీ రాయడు… ‘‘తనను సఫర్ చేస్తున్నాడని కేసీయార్ సందేహిస్తున్నాడు, అందుకే ప్యాచ్ వర్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు’ అని రాసేవాడేమో… ఏమో, ఈ ఆదివారం రాస్తాడేమో కూడా…
నిజమా..? కేసీయార్ భయపడుతున్నాడా..? మరి అలాంటప్పుడు బీజేపీ కుర్చీని కూకటివేళ్లతో పెకిలిస్తాను అని ఎందుకు బీరాలు పలుకుతున్నట్టు..? కేవలం ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో బీజేపీని నిలువరించడం కోసమేనా..? అదేసమయంలో మోడీతో కట్టర్ వైరాన్ని కోరుకోవడం లేదా..?
మమత చూడండి… ఢీఅంటేఢీ… మోడీ ఏం చేస్తావోయ్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది… నడ్డా, చడ్డా, ఫడ్డా అని వెటకరిస్తుంది… ఐనా బీజేపీ ఆమె ప్రభుత్వం జోలికి ఏమీ పోలేదు… ప్రస్తుత బీజేపీ అధిష్ఠానం ప్రతిపక్ష రాష్ట్రాల ప్రభుత్వాలను రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆధారంగా కూలదోసే మూడ్‌లో లేదు… మరి కేసీయార్ ఎందుకు సందేహిస్తున్నాడు..? తనపై సీబీఐ తదితర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తారని భయమా..?
జాగ్రత్తగా గమనిస్తే… గ్రేటర్ గానీ, దెబ్బాక గానీ… కేసీయార్ గానీ, తన ప్రతినిధులు గానీ… బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరుల చుట్టూ తమ విమర్శల్ని కేంద్రీకరించారు గానీ కేంద్ర నాయకుల జోలికి పోలేదు… ఎల్బీ స్టేడియం సభలోనూ కేసీయార్ జాతీయ నాయకుల ప్రస్తావనకు పోలేదు… స్ట్రాటజీ… తన సోషల్ మీడియా టీం కూడా ఎంతసేపూ అర్వింద్, సంజయ్ మీదే కేంద్రీకరించింది గానీ మోడీ, అమిత్ షా జోలికి పోలేదు…
కేటీయార్ కోసం, హరీష్ రావును ఎంత కత్తిరిస్తున్నా సరే, హరీష్ నిలబడ్డాడు… సైలెంటుగా వ్యవహరిస్తున్నాడు… బీజేపీ తనకు ఎరవేసి, లాగేసి, కొత్త తంటాలు క్రియేట్ చేసే ప్రమాదముందని సందేహమా..? అందుకేనా సిద్ధిపేటలో ఇప్పటికిప్పుడు అవసరం లేకపోయినా ప్రోగ్రాములు పెట్టి, హరీష్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, నా మేనల్లుడు పెద్ద తోపు అని సర్టిఫికెట్లు ఇచ్చి అలుముకున్నది…? నిజానికి హరీష్ క్లారిటీతోనే ఉన్నాడు… మామ హయాం ఉన్నన్నిరోజులూ విధేయతే… తరువాత సంగతి ఇప్పుడే చెప్పలేం అని….
అదుగో, దాన్ని బ్రేక్ చేయడం కోసమేనా..? కేసీయార్ ప్రయత్నం..? నిజంగా బీజేపీకి గనుక చేతనై ఉంటే ఎప్పుడో హరీష్ తన వలలో పడేవాడు… కానీ పడలేదు… అంటేనే, తను మామకు వ్యతిరేకంగా పోయే ఉద్దేశంలో లేనట్టేగా…. కాదూ, బీజేపీ ఎదుగుదల మీద డౌట్లతో ఆగాడూ అనుకుందాం, ఇప్పుడు కాస్త నమ్మకం కుదురుతున్నదీ అనుకుందాం… ఐనాసరే, తను మామకు వ్యతిరేకంగా వెళ్తాడా..? బీజేపీ ఆపరేషన్లే సరిగ్గా లేవు… రేవంతుడిని లాగలేకపోయింది… హరీష్‌ను లాగలేకపోయింది… విజయశాంతి వంటి ఔట్ డేటెడ్ కేరక్టర్లు మాత్రమే పడుతున్నారు పార్టీ వలలో…
ఇంతకీ కేసీయార్ ఆలోచన ఏమిటి..? ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ గనుక ఫిక్సయితే ఏం చేస్తాడు..? ఆల్రెడీ తన క్యాంపుకే చెందిన మైహోం గట్రా బీజేపీతో మంచి రిలేషన్స్‌లోకి వెళ్లిపోయారు… తను మోడీతో ఏం మాట్లాడుకోబోతున్నాడు..? ఇదీ చర్చ… ఆంధ్రజ్యోతి ఎడిటర్ చెబుతున్నట్టు…. తన పంట కాపాడుకునే ప్రయత్నమేనా…?!
Share this Article