.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్…
మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి.. దాని పునరుద్దరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. నార్సింగి ప్రాంతంలో హైదరాబాద్‌లోకి ప్రవేశించిన మూసీ.. గౌరెల్లి బ్రిడ్జీ దగ్గర సిటీని దాటేస్తుంది. ఈ మధ్యలో ఉన్న దాదాపు 55 కిలోమీటర్లు మేర మూసీని ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా మూసీని శుద్ధి చేస్తామని.. నది మీద పలు చోట్ల అందమైన బ్రిడ్జీలు కడతామని, నది వెంట పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని చెప్పింది. కానీ ఆ దిశగా పూర్తిగా అడుగులు పడలేదు. ఇక ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల కుటుంబాలను తరలించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ads
ప్రక్షాళన సాధ్యమేనా?
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద నగరమైన సోల్ (Seoul)లో దాదాపు మాయమైపోయిన చాంగ్యెచున్ (Chenggyechen) అనే 10 కిలోమీటర్ల నీటి కాలువను ఎలా పునరుద్దరించారో తెలుసుకుందాం. సోల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో Chenggyechen అనే కాలువపై ఒక ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. Chenggyechen అనేది నగరం మధ్య నుంచి ప్రవహిస్తుంది. ఇది Jungnangcheon అనే చిన్న నదిలో కలిసి.. ఆ తర్వాత హాన్ నదిలో సంగమం అవుతుంది.
సోల్ నగరం మధ్య భాగంలో Chenggyechen అనే కాలువ ప్రవాహాన్ని అడ్డుకోకుండా పైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ వే చుట్టుపక్కల భారీగా భవనాలు వెలిశాయి. కాల క్రమంలో Chenggyechen అనేది దాదాపు మాయం అయిపోయింది. ఎలా అంటే.. ఒక తరానికి అక్కడ ఒక కాలువ ఉండేదని కూడా తెలియదంటా.
దీంతో ఆ Chenggyechenను తిరిగి పునరుద్దరించాలని 2003 జూలైలో సోల్ నగర మేయర్ లీ మ్యూంగ్ బాక్ నిర్ణయించారు. కాలువ చుట్టుపక్కల కమర్షియల్ భవన యజమానుల పునరావాసం, కాలువ పునర్నిర్మానానికి 349 బిలియన్ WONలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అంటే భారత కరెన్సీలో 22 వేల కోట్లకు పైగానే..
దీంతో 2003లో Chenggyechen Restoration Project ప్రారంభమైంది. మొదటిగా ఆ కాలువపై నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వేను తొలగించారు. దీని ప్రభావం సోల్ నగర ట్రాఫిక్‌పై పడింది. అప్పుడే ఆల్టర్నేట్ రూట్లను అభివృద్ధి చేశారు. అంతే కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మెరుగు పరిచారు. ఆ తర్వాత కాలువను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూలగొట్టారు. అక్కడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజ్ అందించారు. ఈ కాలువ పునరుద్దరణ ప్రాజెక్టు కోసం కేటాయించిన బడ్జెట్‌లో అత్యధిక మొత్తం పునరావాసానికే వాడారు.
ఇక 10 కిలోమీటర్ల మేర కాలువను పూర్తిగా పునర్నిర్మించి.. అందులోకి హాన్ రివర్, సబ్‌వే లోని గ్రౌండ్ వాటర్‌ను పంప్ చేశారు. నిత్యం ఆ నీటిని పంప్ చేయడంతో కాలువలో పరిశుభ్రమైన నీళ్లు ప్రవహించడం ప్రారంభమయ్యింది. కాలువ పూడిపోకుండా పటిష్టమైన కాంక్రీట్ బెడ్స్, బ్యాంక్స్ నిర్మించారు. నిత్యం సబ్‌బేలో ఊరే అండర్ గ్రౌండ్ వాటర్ ఈ కాలువలో ప్రవహించేలా ఏర్పాటు చేశారు.
ఈ మొత్తం రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కేవలం రెండేళ్లలో పూర్తి చేశారు. మొదట్లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన వాళ్లే.. ఆ తర్వాత Chenggyechen కాలువ అందం చూసి మైమరచిపోయారు. ఇప్పుడు Chenggyechen నదిలో అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. అంతే కాకుండా ఈ కాలువ పారే చుట్టు పక్కల 3.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గిపోయిందట. అప్పటి వరకు ఇక్కడ ఒక స్లమ్ మాదిరిగా ఉండే ప్రాంతం.. ఇప్పుడు సోల్ నగరవాసులకు ఒక టూరిస్ట్ స్పాట్‌లా మారింపోయిందట.
10 కిలోమీటర్ల కాలువ రిస్టోరేషన్‌కు అప్పట్లోనే 22 వేల కోట్ల ఖర్చు అయ్యింది. ఇప్పుడు మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు అంచనా వేశారు. అయితే Chenggyechen కాలువను పూర్తిగా పునర్నిర్మించారు. కానీ మూసీకి ఆ పని చేయనవసరం లేదు. కేవలం ఆక్రమణలు తొలగించి.. మురుగు నీరు కలువకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
నదిలో నిత్యం నీళ్లు ప్రవహించే ఏర్పాట్లు కూడా చేయవచ్చు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి గోదావరి, కృష్ణ నీటికి పంపింగ్ చేయడం ద్వారా.. అక్కడి నుంచి మూసీలోకి మంచి నీటిని వదలవచ్చు. అలా Chenggyechen కాలువను మంచినీటితో నింపినట్లు.. నింపవచ్చు.
అసలైన పరీక్ష..
ఇక్కడ అసలైన పరీక్ష పునరావాసమే. ప్రభుత్వం లక్షన్నర కోట్ల నిధుల్లో కనీసం 50 శాతం నిధులు పునరావాసానికి కేటాయించి.. ఇళ్లు కోల్పోయిన వాళ్లకు సరైన న్యాయం చేయాలి. అప్పుడే మూసీ సుందరీకరణకు ఒక న్యాయం జరుగుతుంది. ఇక్కడ నివసించే వారికి ఎక్కడికో తరిమేసి.. నదిని సుందరంగా మలిచినా.. వారి ఏడ్పులు మాత్రం మరిచిపోలేము. ఒకరి జీవితాన్ని నాశనం చేసి.. మనం ఎంజాయ్ చేయలేము. అందుకే పునరావాసం మీద ముందు దృష్టిపెట్టి.. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి.
ఇక అప్పట్లో కేసీఆర్, కేటీఆర్.. మూసీ నది మీద ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామని చెప్పారు. ఆ పని మాత్రం అస్సలు చేయవద్దు. సోల్ నగరంలో Chenggyechen మీద ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడం వల్లే అసలైన సమస్య మొదలైంది. అది Chenggyechen మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఎలాగో మూసీ ఆక్రమణలు తొలగిస్తున్నారు. కాబట్టి.. నదికి ఇరువైపులా నడక, రవాణాకు ప్రత్యేకంగా రహదారులు నిర్మించాలి. పైన బ్రిడ్జీల జోలికి అస్సలు పోవద్దు.
ఇక మూసీలోకి స్వచ్చమైన నీటిని పంపింగ్ చేయడం ద్వారా.. డౌన్ స్ట్రీమ్‌లో వ్యవసాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కువ ప్రయోజనం, సూర్యపేటకు తాగునీరు లభ్యం అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వం పూర్తిగా ఆలోచించాల్సిన విషయాలు.
Chenggyechen రిస్టోరేషన్ సాధ్యమైనప్పుడు.. మూసీ మాత్రం ఎందుకు కాదు? #భాయ్‌జాన్….. జాన్ కోరా
Share this Article