Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రకాష్‌రాజ్ అంత గొప్పోడా..? అరెరె.., మనమెంత పెద్ద తప్పుచేశాం..!!

October 19, 2021 by M S R

తెలుగుదేశం, జనసేన మళ్లీ కలిస్తే జగన్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం కాబట్టి… పవన్ కల్యాణ్ అడుగులు ఈమధ్య చంద్రబాబు వైపు పడుతున్నాయి కాబట్టి… కమ్మ, కాపు కలిస్తే జగన్‌రెడ్డికి నష్టదాయకం కాబట్టి… ఆ రెండు కులాల నడుమ వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి… అంటూ ‘మా’ ఎన్నికల్లో కులకోణాల్ని ఇంతలోతుగా అర్థం చేసుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఎక్కడికో వెళ్లిపోయాడు తను..! తను ఏం రాసుకున్నాడు అని వదిలేస్తే, నిజంగానే మొన్నటి మా ఎన్నికల్లో కులకలకలమే ప్రధానంగా కనిపించిందనీ, ప్రత్యేకించి కమ్మ వర్సెస్ కాపు అన్నట్టుగా వర్గాలు చీలిపోయాయనే ప్రచారం బలంగా జరిగింది… దీనికి తగ్గట్టే ఒకవైపు మెగా క్యాంపు సపోర్ట్‌గా నిలిచిన ప్రకాష్‌రాజ్… మరోవైపు మంచు మోహన్‌బాబు… ఇక్కడ తన అవసరం కోసం జగన్‌రెడ్డి క్యాంపు సపోర్ట్ మోహన్‌బాబుకు దక్కిందట… ఎందుకంటే..? మోహన్‌బాబు కొడుకు, మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు సాక్షాత్తూ జగన్‌కు బంధువు… అనగా లెక్కప్రకారం ప్రకాష్‌రాజ్ అంటే జగన్ క్యాంపుకి పడకూడదు… అనగా ఒక సాక్షి టీవీయో, సాక్షి పత్రికో ప్రకాష్‌రాజ్ పల్లకీ మోయకూడదు… మోస్తే అది ‘‘రాజద్రోహం’’ అవుతుంది… ఇప్పటి పాత్రికేయ, రాజకీయ విలువల ప్రకారం అంతే కదా… కానీ..? సాక్షి లెక్కలు వేరుంటయ్, జగన్ లెక్కలు వేరుంటయ్… కొన్నిసార్లు అవి వేర్వేరు దారుల్లో పయనిస్తూ ఉంటయ్… ఉదాహరణకు…

maa Elections

సాక్షి ఎడిట్ పేజీలో ఈరోజు ప్రముఖ మాజీ సంపాదకుడు, ఇప్పటికీ సాక్షి ఆస్థాన కాలమిస్టుగా ‘జగన్ కోణంలో’ చాలా విషయాల్ని దర్శించి, ఆవిష్కరించే ఏబీకే ప్రసాద్ రాసిన ఓ వ్యాసం… ఆయన కూడా రాధాకృష్ణ స్థాయికి ఎన్నోరెట్లు ఎ‘దిగిపోయాడు’… ప్రకాష్‌రాజ్‌ను న్యూనపరిచారట, తద్వారా బలమైన, చారిత్రికమైన కన్నడ, తెలుగు సంబంధాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందట… అనేకానేక సామాజిక సమస్యల మీద ప్రకాష్‌రాజ్ ఓ చేయి తిరిగిన రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడట… ‘మా’లోని ‘పొట్టి బావలు’ ప్రకాష్‌రాజ్‌ను కించపరచడం ఒకరకంగా కృష్ణదేవరాయల స్పూర్తిని, వారసత్వాన్ని కూడా విస్మరించినట్టేనట… అంతేకాదు, ‘మా’లో ఈ వివక్షను కనబరిచారు కాబట్టే ఆ కళానిధి ప్రకాష్‌రాజ్ బాధతో ‘నేను కన్నడిగనే కానీ తెలుగువాడిని కాను’ అంటూ ‘మా’ నుంచి వెళ్లిపోయాడట…

Ads

‘మా’ను బహుళార్థ సాధక, సాంస్క‌ృతిక సంస్థగా తీర్చిదిద్దాలనే ప్రత్యామ్నాయ, అభ్యుదయ ఎజెండాతో ముందుకొచ్చిన ప్రకాష్‌రాజ్‌ను కాదనడం ఏమిటి అంటూ చాలా బాధపడిపోయాడు ఏబీకే… అసలు ఇప్పటికిప్పుడు ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ఓటమి, తనను ప్రాంతీయేతరుడిగా ముద్రవేయడం వల్ల బెంగుళూరు, హైదరాబాదు నడుమ ఏదో అర్జెంటు వైరం పుట్టుకొచ్చిందన్న రీతిలో తెగరాసేశాడు… (స్థూలంగా ఏబీకే పాత్రికేయ జీవితం, ఈరోజుకీ కలం వదలని నిర్విరామ అధ్యయనం, భావజాలం అంటే నాకూ ఇష్టమే… కానీ ఈ ఇష్యూలో ఆయన ఆలోచనల సరళి మరీ మరీ విచిత్రంగా ఉంది… అసహజంగా ఉంది… అదే ఇప్పుడు మనం చెప్పుకునేది… కొందరు అప్పుడే చొక్కా చేతుల్ని పైకి ముడవాల్సిన అవసరం లేదు… ప్రశ్న – విమర్శ ఆయనకూ ఇష్టమే…)

అసలు సాక్షిలో ప్రకాష్‌రాజ్ పల్లకీ మోయడం ఏమిటీ అనే ప్రశ్నను పక్కనపడేయండి… ఇదేమిటయ్యా అంటే, అది సదరు కాలమిస్ట్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని సమర్థించుకుంటారేమో… కానీ సాక్షి ఓనర్లు కూడా అలాగే ఆలోచిస్తారా..? రేప్పొద్దున చంద్రబాబు పల్లకీ మోస్తూ ఇంకెవరైనా వ్యాసం రాస్తే పబ్లిష్ చేస్తారా..? నిజంగా సాక్షి ఎడిట్ పేజీకి ఆ నిష్పాక్షికత ఉందా..? జగన్ క్యాంపు ధోరణికి భిన్నంగా కూడా ఇలా వ్యాసాలు అచ్చేసేంత స్వేచ్ఛ సాక్షి సంపాదకీయ బృందానికి ఉందా..? జగన్‌ ఎలాగూ చదవడు… చదివే సజ్జల, జీవీడీ, అమర్ ఎట్సెట్రా ఇలాంటివి జగన్‌కు ఏమీ చెప్పరు… ప్రస్తుతం జగన్ ప్రయారిటీల్లో సాక్షి అనేది చాలా చాలా చిన్నవిషయం కాబట్టి ఈ ప్రశ్నల్ని కాసేపు అటక మీద పారేద్దాం… అయితే… నిజంగా ప్రకాష్‌రాజ్ అంత గొప్పోడా..? (మోహన్‌బాబుల గురించీ, నాగబాబుల గురించీ కాసేపు మరిచిపోదాం…) ఏబీకే కీర్తించేంత ఘనత ప్రకాష్‌రాజ్‌లో ఉందా..? ఆయన రచనలు, ప్రవచనాలు గట్రా అభ్యుదయ సమాజానికి అంతటి మార్గదర్శనాలా..? యాంటీ-మోడీ కాబట్టి అనవసరంగా ఆయన్ని టార్గెట్ చేస్తోందా ఓ సెక్షన్..?

అంత లోతుల్లోకి ఎందుకులే గానీ… పైపైన ఒకటీరెండు విషయాలు ఫర్ డిబేట్ సేక్ చెప్పుకోవాలనుకుంటే… ఓటమిని హుందాగా అంగీకరించడం ఓ రాజకీయ, ప్రజాస్వామిక సంస్కారం… ప్రకాష్‌రాజ్‌కు ఆ సంస్కారం లేదు, నిజానికి ఈ తత్వమున్నవాళ్లు పోటీకే అనర్హులు… ఓటమిని రచ్చ చేయడం, ఏ సంస్థ అధ్యక్ష పదవికి పోటీచేశాడో ఆ సంస్థకే ఓటమి అసహనంతో రాజీనామా చేసేయడం, విమర్శలు చేయడం, అందరూ కలిసి నన్ను ప్రాంతీయేతరుడు అని ముద్రవేశారు దేవుడోయ్ అని బాధపడిపోవడం… సగటు ‘మా’ వోటరును అవమానించడం..! ఐనా ఒక ప్రకాష్‌రాజ్ అనే వ్యక్తి మాకు వద్దు అని ఆఫ్టరాల్ నాలుగొందల మంది చెబితే… ఇక అది కన్నడ-తెలుగు చారిత్రిక బంధాలకు విఘాతం, స్పూర్తిరాహిత్యమా..? పైగా ‘మా’ను బహుళార్థసాధకం చేద్దామని, సాంస్కృతిక సంస్థగా మార్చాలని అనుకున్నాడని ఏబీకే సర్టిఫికెట్టు..!! ఆఫ్టరాల్, అది ఒక భాషకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో నటించేవాళ్లు పెట్టుకున్న అసోసియేషన్… జస్ట్, లైక్ ఏ ట్రేడ్ యూనియన్… దాన్ని బహుళార్థసాధకం చేసేది ఏముంది సార్..? ఒక తెలుగువాడు, ఒక కన్నడవాడు పోటీచేస్తే, తెలుగువాళ్లు మావాడు అనే ప్రేమతో తెలుగువాడినే ఎన్నుకుంటే దానికి ఇన్నిరకాల విపరీత బాష్యాలు అవసరమా..?

ముక్తాయింపు ఏమిటంటే..? సినిమా ఇండస్ట్రీలు మరీ అంత సంకుచితంగా ఏమీ లేవు… వ్యక్తుల తత్వాలను, అడుగులను బట్టే మద్దతు లేదా వ్యతిరేకత దక్కుతాయి… ఉదాహరణకు… శ్రీకాంత్ గెలవలేదా..? శివబాలాజీ గెలవలేదా..? అంతెందుకు..? విపరీతమైన భాషాధిపత్యం చూపించే తమిళనాట చూడండి, ఒక రజనీకాంత్ కన్నడిగుడు కాదా..? అక్కడి నటీనటుల సంఘం అధ్యక్షుడు విశాల్ తెలుగువాడు కాదా..? మనం ప్రదర్శించే ధోరణులే మనల్ని నిలబెడతాయి లేదా వ్యతిరేకిస్తాయి… సింపుల్… మొన్నటి ప్రకాష్‌రాజ్ ఓటమి ఒక వర్గం ఓటమి, తన వెనుక నిలబడిన వర్గం ఓటమి, అంతేతప్ప ప్రకాష్‌రాజ్ ప్రాంతీయత మీద వ్యతిరేకత కాదు… కాదు… ఈ కొత్త రంగులు పూస్తూ, కొత్త బాష్యాలు చెబుతూ నిజానికి కన్నడ- తెలుగు నడుమ వైషమ్యానికి బీజాలు వేస్తున్నది ఇదుగో ఇలాంటి ఏబీకే, ఆర్కే మార్కు విశ్లేషణలే… ఈమాత్రం దానికి మరీ కృష్ణదేవరాయలు, బహమనీ సుల్తానులు, వరంగల్ విముక్తి దాకా వెళ్లిపోయాడు ఏబీకే..! ఏమైంది సార్ మీకు అకస్మాత్తుగా…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions