.
వ్యవస్థలో ఎవరూ శుద్దపూసలు కారు… బయటికి కనిపించే మొహాలు వేరు, చెప్పే నీతులు వేరు, అసలు రూపాలు వేరు… సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్… సమాజంలో అవినీతిపై పోరాటం, పారదర్శకత, ‘రెజీమ్ ఛేంజ్’ (పాలనా వ్యవస్థ మార్పు) గురించి గళమెత్తుతున్నాడు కదా… ఓసారి తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలు ఓసారి తెలుసుకోవాలి… ఇది సందర్భమే…
ఆయన కుటుంబంపై గతంలో వచ్చిన తీవ్రమైన ఆరోపణలు ఈ రోజుకీ ప్రజా చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి… ఇతరుల నుంచి పరిపూర్ణ నిజాయితీని, జవాబుదారీతనాన్ని ఆశించే ప్రముఖులు తమ సొంత విషయంలో వాటి పాటిస్తున్నారా..? ఇదీ అసలు ప్రశ్న…
Ads
ప్రశాంత్ భూషణ్, ఆయన తండ్రి శాంతి భూషణ్‌లకు సంబంధించి గతంలో తీవ్ర దుమారం రేపిన ప్రధాన వివాదాల వివరాలు ఇవే… (శాంతి భూషణ్ భారత మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది)…
1. నోయిడా ఫామ్‌హౌస్ కేటాయింపుల వివాదం (మాయావతి హయాం)
ఏమి జరిగింది?:… 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి ప్రభుత్వ హయాంలో, నోయిడాలోని సెక్టార్ 165లో ప్రశాంత్ భూషణ్, ఆయన సోదరుడు జయంత్ భూషణ్‌లకు ఒక్కొక్కరికి 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల (మొత్తం దాదాపు 5 ఎకరాలు) రెండు ఫామ్‌హౌస్ ప్లాట్లను కేటాయించారు…
ఆరోపణలు & కాగ్ (CAG) నివేదిక:… ఈ ప్లాట్లను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత లేదా రాయితీ ప్రాతిపదికన కేటాయించిందని ఆరోపణలు వచ్చాయి….
ఈ కేటాయింపుల కోసం భూషణ్ కుటుంబం రూ. 3 కోట్లకు పైగా చెల్లించినట్లు చెబుతున్నప్పటికీ, నిబంధనలను పక్కనబెట్టి అతి తక్కువ ధరకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 145.8 కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి…
వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 1,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
2. ‘ప్రయోజనాల సంఘర్షణ’ (Conflict of Interest) ఆరోపణ
ఏమి జరిగింది?:… నోయిడాలో మాయావతి ప్రభుత్వం భూములు కేటాయిస్తున్న సమయానికే, జయంత్ భూషణ్ (ప్రశాంత్ భూషణ్ సోదరుడు) మాయావతి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన నోయిడా పార్క్ కేసులో (నొయిడా అంబేడ్కర్ పార్క్ కేసు) ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో వాదిస్తున్నాడు…
విమర్శ:… ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్న సమయానికే అదే ప్రభుత్వం నుంచి రాయితీ ధరకు విలువైన భూ కేటాయింపులు పొందడం స్పష్టమైన ‘కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కిందకే వస్తుందని, ఇది నైతిక విలువల ఉల్లంఘనేనని తీవ్ర విమర్శలు వచ్చాయి…
3. ఉత్తరాఖండ్ తేయాకు తోట (టీ ఎస్టేట్) భూముల వ్యవహారం
ఏమి జరిగింది?:… ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ కుటుంబం ఉత్తరాఖండ్‌లో ఒక విద్యాసంస్థ లేదా ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు పేరుతో 4.66 హెక్టార్ల (దాదాపు 11.5 ఎకరాలు) తేయాకు తోట భూమిని కొనుగోలు చేశారు.
ఆరోపణలు:… భూ పరిమితి చట్టాలు (Land Ceiling Act), స్థానిక నిబంధనల మినహాయింపులతో కొనుగోలు చేసిన ఈ భూమిని, తదనంతరం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికై ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విద్యా సంస్థల పేరుతో తక్కువ ధరకు భూములు పొంది లబ్ధి పొందారనే విమర్శలు దీనిపై వచ్చాయి. ఈ భూమి విలువ ప్రస్తుతం రూ. 35 కోట్లకు పైగా ఉంటుందని చెబుతారు.
4. అలహాబాద్ స్టాంప్ డ్యూటీ ఎగవేత వివాదం
ఏమి జరిగింది?:… 2011లో అలహాబాద్‌లోని అత్యంత ఖరీదైన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఆస్తిని శాంతి భూషణ్ కొనుగోలు చేశాడు…
ఆరోపణలు:… ఆస్తి యొక్క అసలు మార్కెట్ విలువను తగ్గించి చూపి, ప్రభుత్వానికి దాదాపు రూ. 1.35 కోట్ల వరకు స్టాంప్ డ్యూటీని ఎగవేశారని అసిస్టెంట్ స్టాంప్ కమిషనర్ ఆరోపించారు.
చర్యలు:… ఈ ఎగవేతపై నోటీసులు జారీ చేస్తూ, బకాయి ఉన్న ఫీజుతో పాటు భారీగా జరిమానా చెల్లించాలని అధికారులు ఆదేశించారు. భూషణ్ కుటుంబం దీనిని “రాజకీయ ప్రేరేపితమైనది”గా పేర్కొంటూ కోర్టుల్లో సవాలు చేసింది.
‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (IAC) వంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో ముందంజలో ఉండి, దేశంలో పాలనా మార్పులు రావాటిని కోరిన ప్రముఖులే ఇటువంటి తీవ్రమైన భూ కేటాయింపులు, ఆర్థిక లబ్ధి, పన్ను ఎగవేత ఆరోపణల్లో చిక్కుకోవడం పెద్ద చర్చకు దారితీసింది…
ఇతరులకు ఒక న్యాయం – తమకొక న్యాయమా?: ఇతరుల చిన్న చిన్న పొరపాట్లను సైతం అవినీతిగా వేలెత్తి చూపేవారు, తమపై వచ్చిన రూ. వందల కోట్ల కేటాయింపుల ఆరోపణలపై మాత్రం “రాజకీయ కక్షసాధింపు” అని దాటవేయడం ఎంతవరకు సమంజసం?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే నైతిక హక్కు:… ప్రజా జీవితంలో ఉంటూ విప్లవాత్మక మార్పులు, వ్యవస్థ మార్పులు కోరేవారు ముందుగా తమ పారదర్శకతను నిరూపించుకోవాలి. లేకపోతే అది కేవలం “ఆదర్శాల ముసుగులో సాగే రాజకీయ లబ్ధి”గానే మిగిలిపోతుందనే ఓ వైరాగ్యం ప్రజల్లో కలగడం సహజమే…
Share this Article