హుర్రే…. ప్రపంచంలో కరోనాను జయించిన తొలి దేశం ఇజ్రాయిల్… దాని తాట తీసేసింది… దాని ముళ్లు విరిచేసింది… ప్రజలు మాస్కులు పీకేశారు, పారేశారు… స్వేచ్ఛగా గాలులు పీలుస్తున్నారు… మనసారా దగ్గుతున్నారు, నిర్భయంగా తుమ్ముతున్నారు… శ్రీలంకలో మూడోవంతు కూడా ఉండని ఆ చిన్న దేశం కరోనా పీచమణిచింది… అసలు ఒక జాతి అంటే అదీ… ఎంత క్రమశిక్షణ… తమ వేక్సిన్ తామే తయారు చేసుకున్నారు… మొత్తం టీకా సూదులు పొడిపించుకున్నారు… మొత్తం ఉచితమే… యుద్ధప్రాతిపదికన గత డిసెంబరులో స్టార్ట్ చేసిన వేక్సినేషన్ పూర్తయ్యింది… ఒకప్పుడు రోజుకు 10 వేల కేసులు నమోదైన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య మరీ నూరూ నూటాయాభైకి పడిపోయింది… అవీ జీరోకు వస్తాయి… హోటళ్లు, టూరిస్ట్ స్పాట్లు మాత్రమే కాదు, స్కూళ్లు ఓపెన్… బార్లు, థియేటర్లు ఓపెన్… ఇజ్రాయిల్‌లోనే కాదు, తమ పొడ గిట్టని పాలస్తీనాలోనూ వేక్సిన్లు వేయించారు… చాలారోజులుగా ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా వీథుల్లోకి వస్తున్నారు… షేక్ హ్యాండ్స్, హగ్స్, వేడుకలు… ఇజ్రాయిల్ పండుగ చేసుకుంటోంది…
హమ్మయ్య… నిన్నటి నుంచీ మన వాట్సప్ గ్రూపులు, సోషల్ పోస్టుల్లోనూ తెగ చక్కర్లు కొడుతున్నది ఈ సమాచారం… చప్పట్లు కొడుతున్నది మన సమాజం… నిజమే, సంతోషమే… ఒక చిన్న దేశం శాస్త్రీయంగా ఓ విపత్తును జయించడం అంటే మామూలు విషయం కాదు… ప్రతి క్షణమూ క్షుద్ర రాజకీయాలే లోకంగా బతికే ఇండియా వంటి దేశాల్లో కరోనాను గెలవడం కష్టం గానీ… ఇజ్రాయిల్ వంటి దేశాల్లో కష్టమేమీ కాదు… ప్రతి మనిషికీ అక్కడ తమ జాతి పట్ల, తమ దేశం పట్ల ఓ కన్సర్న్ ఉంటుంది… సామూహిక, సామాజిక బాధ్యత ఎక్కువ ఫీలయ్యే దేశం అది… అయితే ఈ వార్తలన్నీ నిజమేనా..? ఇజ్రాయిల్ నిజంగానే కరోనా తాటతీసినట్టేనా..? ఇప్పుడు అది ‘కరోనా ఫ్రీ’ దేశమేనా..? ‘మాస్క్ రహిత దేశమేనా..? కొంత నిజముంది, కొంత నిజం కాదు… ఎలాగంటే..?
Ads
దాని జనాభా కోటిలోపు… (93 లక్షలు)… ఒక దశలో వేలకువేల కేసులతో అల్లాడిపోయింది ఈ దేశం కూడా… సవాల్‌ను స్వీకరించింది… వేక్సిన్ రెడీ అయ్యింది… ఫైజర్ బయోటెక్ వేక్సిన్లను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా వేయడం స్టార్ట్ చేసింది… ముందుగా వృద్ధులకు, తరువాత 20 ఏళ్లు పైబడిన ప్రతివాళ్లకూ వేక్సిన్… పిల్లలకు కంపల్సరీ కాదు… కాకపోతే పెద్దల్లో కరోనా వ్యాప్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో సహజంగానే పిల్లల్లోనూ ఇన్ఫెక్షన్ రేటు తగ్గిపోయింది… వంద శాతం వేక్సినేషన్ అనేది అబద్ధం… కాకపోతే 60, 70 శాతం వరకూ డబుల్ డోస్ పూర్తి చేశారు… పక్కనే ఉన్న పాలస్తీనీయులకు కూడా వేక్సిన్ వేశారు అనేది కూడా అబద్ధం… ఇజ్రాయిల్‌లో పనిచేసే దాదాపు లక్ష మంది పాలస్తీనియన్లకు వేక్సిన్లు వేసి ఉంటారని అంచనా… అంతే…
కరోనా ఆంక్షల్ని, జాగ్రత్తల్ని తొలగించారు, మాస్కులు అవసరం లేదు అనే వార్త కూడా సగమే నిజం… ఎందుకంటే..? ఓపెన్ ప్లేసుల్లో మాస్కులు అక్కర్లేదు అన్నారు… కానీ క్లోజ్డ్ ఏరియాల్లో మాస్కులు మస్ట్, అంటే రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు వంటి ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి… అక్కడే వ్యాప్తి అధికం కాబట్టి… దేశాధినేత స్వయంగా ప్రకటించాడు, కరోనా ఫ్రీ అనగానే ఇష్టారాజ్యంగా మెలగకండి, జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మళ్లీ మొదటికి వస్తాం, బహుపరాక్ అన్నాడు… తమ దేశానికి వచ్చే పర్యాటకుల పట్ల ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నయ్… కోవిడ్ వైరస్ కలిగి ఉన్న వారిని రెండు కిలో మీటర్ల దూరం నుండే పసిగట్టి సంబంధిత అధికారులకు వాళ్ళ సమాచారమిచ్చే రాడార్ లాంటి ఒక పరికరాన్ని వాళ్ళు ఇప్పటికే తయారు చేశారనీ, తమ విమానాశ్రయాలు, నౌకా రేవులు, ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయబోతున్నారనీ వస్తున్న వార్తలు కూడా అబద్ధం… ఇంకా అలాంటి టెక్నాలజీ ఏమీ డెవలప్ కాలేదు… కాకపోతే ఒకటి నిజం… కరోనాను నియంత్రించాల్సింది వేక్సినేషన్, మెడికేషన్, ముందు జాగ్రత్తలు వంటి శాస్త్రీయమైన పద్ధతులతోనే… దాన్ని నియంత్రించాల్సిందే, నిర్మూలించలేం..!! ఇజ్రాయిల్ బాటే ఎవరికైనా శరణ్యం..!!
Share this Article