.
ఫాంటసీ కాదు, కల్పన కాదు, అతిశయోక్తి కాదు… ఇదీ చరిత్ర… నిజసంఘటనే… జాగ్రత్తగా చదవండి… చేతనైతే ఎవరైనా ఓ వెబ్ సీరీస్ తీయాల్సిన కథ… కాదు, యదార్థం…
ఆమధ్య… అంటే, ఐదారేళ్ల క్రితం… ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా… దాదాపు 150 మందికి పైనే గల్లంతు… 32 మృతదేహాలు దొరికాయి… ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఐటీబీపీ బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి…
Ads
భారీ హిమఫలకం ఒకటి కరిగి (అవలాంచి) నదీప్రవాహాల్లో పడి, ఆ వరదల వల్ల ఈ ఉత్పాతం జరిగిందనేది ప్రాథమిక అంచనా… కాదు, కొండచరియలు విరిగిపడి, డ్యామ్ ఒకటి పగిలి ఈ విపత్తుకు దారితీసిందనేది మరొక అంచనా… చివరికి ఏమీ ఎవరూ తేల్చలేదు… కట్ చేస్తే…
టైమ్స్‌లో ఓ వింత వార్త కనిపించింది అప్పట్లో… అది ఏమిటంటే..? ఒక రేడియో ధార్మిక పరికరం వల్లే ఈ ప్రళయం వచ్చిందని విధ్వంసం జరిగిన తపోవన్ ఏరియాకు చెందిన రైనీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారట… అకస్మాత్తుగా హెడింగ్ చూడగానే, ఇదీ చైనా పనేనా అని సందేహం కలుగుతుంది…
అది ఏదైనా చేయగలదు కాబట్టి… కానీ గ్రామస్థులు ఆరోపిస్తున్న సదరు రేడియో ధార్మిక పరికరం అమెరికాది… ప్లస్ మనది… చైనాకు వ్యతిరేకం అది… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
ఈ వరదలు ముంచెత్తినప్పుడు తామెప్పుడూ ఎరుగని ఓ వింత, ఘాటు వాసన వ్యాపించిందనీ… అందుకే తమకు రేడియో ధార్మిక పరికరం యాక్టివేట్ అయ్యిందేమో, అదే ఈ హఠాత్ వరదలకు కారణమైందేమో అనే అనుమానాలొస్తున్నాయనీ అంటున్నారు రైనీ గ్రామస్థులు… అసలు ఏమిటా పరికరం..?
చెప్పాలంటే పెద్ద స్టోరీ… తీస్తే పెద్ద సినిమా… రాస్తే పెద్ద పుస్తకం… సాగదీస్తే ఓ వెబ్ సీరీస్… అది 1965… చైనా అణుపరీక్షలు, క్షిపణి ప్రోగ్రాం మీద అమెరికాకు బోలెడు సందేహాలు… కానీ చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కదా… అందుకని అమెరికన్ గూఢచార సంస్థ సీఐఏ ఓ ప్లాన్ వేసింది…
చైనా సరిహద్దుల్లో, ఇండియాలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతశిఖరం మీద అణుధార్మికతతో నడిచే ఓ స్పయింగ్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనేది ఆ ప్రణాళిక…
అందుకని ఇండియా సహకారం తీసుకుని ఆ పరికరాన్ని ఏర్పాటు చేయడానికి ఓ టీం నందాదేవి పర్వతపంక్తి మీదకు బయల్దేరింది… ఒకరిద్దరికి మినహా ఆ పరికరం ఏమిటో ఆ టీంలో ఎవరికీ తెలియదు… కానీ అనుకున్నట్టుగా ప్లాన్ ఆచరణ సాధ్యపడలేదు… అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది…
టీం సభ్యులు బతుకుజీవుడా అంటూ ఎవరికివారు చెల్లాచెదురై బేస్ క్యాంపు చేరుకున్నారు, కానీ ఆ రేడియో యాక్టివ్ పదార్థమున్న పవర్ జనరేటర్ పరికరం ఎక్కడో మిస్సయిపోయింది… అదసలే రేడియో యాక్టివ్… దాని అణుధార్మిక వేడికి మంచు కరిగి, ఆ కాలుష్యపు నీరు నదీప్రవాహాల్లో చేరితే ప్రజారోగ్యానికి ముప్పు కదా అనేది ఆందోళన…
కొన్నాళ్లు దానికోసం వెతికి, ఇక ఆ ఏరియాల్నే మూసేసింది ప్రభుత్వం… ఆమధ్య ఉత్తరాఖండ్‌కు చెందిన కేంద్ర మంత్రి ఆ పరికరం కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించాలని మోడీని కోరాడు… అదెక్కడో మంచు లోతుల్లో కూరుకుపోయి ఉంటుంది, ప్రమాదం ఏముందిలే అనేది కేంద్రం వైఖరి…
నో, నో, ఇప్పుడదే యాక్టివేట్ అయినట్టుంది అంటారు తాజా విధ్వంసబాధితులు..? ఆ పరికరం ఒకవేళ మంచు కుప్పల నుంచి బయటపడినా సరే, ఆ వేడికి మెల్లిమెల్లిగా మంచు కరగాలే తప్ప, ఒకేసారి మంచు పర్వతాలే విరిగిపడేంత విపత్తుకు కారణమెలా అవుతుంది..? అందుకని గ్రామస్థుల సందేహాలు డౌట్‌ఫుల్లే కానీ… వాళ్ల భయసందేహాలు మళ్లీ ఆ పాత రేడియో యాక్టివ్ డివైజ్ గురించి గుర్తుచేశాయి..!!
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘ముచ్చట’ ఈ స్టోరీ పబ్లిష్ చేసింది… మళ్లీ ఇప్పుడు ఎందుకు గుర్తుచేసుకోవడం అంటారా..? మన వాళ్లు కథల్లేవు మొర్రో అని మొత్తుకుంటూ దిక్కుమాలిన రొటీన్, ఫార్ములా కథలతో పనికిమాలిన చెత్తను మనమీదకు విసిరేస్తూ ఉంటారు కదా… కానీ కోలీవుడ్ ఇదే నందాదేవి అణుపరికరం మిస్టరీని బేస్ చేసుకుని ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం తీస్తోంది… పేరు మిస్టర్ ఎక్స్…
ఈ టైటిల్‌తో వస్తున్న ఆ సినిమా టీజర్ కూడా వైరల్ అయిపోయింది… అందులో హీరో ఆర్య.., గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ తదితరులూ నటిస్తున్నారు… ఓ లుక్కేయండి…
Share this Article