ఏది నెగెటివ్…? ఏది పాజిటివ్..? ఒక కథనం ముందుగా చెప్పుకుందాం… ప్రపంచమంతా అద్భుతమైన స్పూర్తివంతమైన ఒలింపిక్ సీన్ అని కీర్తిస్తున్న వార్త ఇది… అసలు చిక్కు ప్రశ్న ఏమిటో తరువాత చెప్పుకుందాం… ఒలింపిక్స్‌లోనే కాదు, ఎక్కడైనా సరే గెలిచినవాడికి స్వర్ణం, ఓడినవాడికి రజతం… అంతే కదా… మరి పసిడి పతకాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే..? అబ్బే, అదెప్పుడూ జరగలేదు అంటారా..? అప్పుడెప్పుడో గత శతాబ్దిలో 1912లో జరిగింది… మళ్లీ మొన్న జరిగింది… అది హైజంప్ ఈవెంట్… ఫైనల్స్… ఖతర్‌కు చెందిన బార్‌షిమ్, ఇటలీకి చెందిన టాంబెరీ నడుమ పోటీ… 2.37 మీటర్ల ఎత్తును ఇద్దరూ అధిగమించారు… 2.39 మీటర్ల ఎత్తుపై ఇద్దరూ ఫెయిలయ్యారు… అంటే సమానంగా నిలిచినట్టే… సో, విజేతను తేల్చడానికి గాను, ఇద్దరికీ మరో ప్రయత్నం చేసేందుకు అవకాశం ఇవ్వబడింది… టై బ్రేక్ ఆడాలి… కానీ అకస్మాత్తుగా బార్ షిమ్‌కు ఓ ఆలోచన వచ్చి… ‘‘ఇక పోటీ వద్దు, ఇద్దరమూ ఈ గోల్డ్ పతకాన్ని పంచుకోవచ్చా..?’’ అనడిగాడు… ఒలింపిక్ అధికారి పంచుకోవచ్చు అన్నాడు… ఇంకేం..? ఆ అథ్లెట్లూ కలిసి బంగారు పతకాన్ని పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు… ఒలింపిక్స్ స్వర్ణం మా ఇద్దరి కల… ఇద్దరమూ ట్రాక్ బయట కూడా మంచి స్నేహితులమే… ఇప్పుడు ఇద్దరికీ బంగారం దక్కింది, నిజమైన క్రీడాస్పూర్తి ఇదేనని మేం ప్రపంచానికి చాటుతున్నాం అన్నారు ఇద్దరూ… రెండు జెండాలూ ఎగిరాయ్….
1912 ఒలింపిక్స్‌లో డెకాథ్లాన్, పెంటాథ్లాన్ పోటీల్లో ఇలా పతకాల్ని పంచుకున్నారట… అది కూడా ఓ పెద్ద కథ… ఇప్పుడు ఆ కథలోకి వెళ్లడం లేదు గానీ… ఒక పసిడి పతకాన్ని అప్పటికప్పుడు ఈవెంట్ ప్లేసులోనే పంచుకునే నిర్ణయం జరగడం మాత్రం ఇదే తొలిసారి… మీడియా కీర్తిస్తోంది ఈ సీన్‌ను… ఆహా ఓహో అంటోంది… నిజానికి ఇది క్రీడాస్ఫూర్తేనా..? దీన్ని త్యాగం అనాలా..? ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పే విశేషమేనా ఇది..? మరో కోణంలో ఓసారి చూద్దాం… సింపుల్ ప్రశ్న… ఆడితేనే కదా ఆట అనాల్సింది… గెలుస్తామా, ఓడతామా అనేది వేరే సంగతి… ఆడటం అనేదే ముఖ్యం కదా… టై బ్రేక్ కు వెళ్లకుండా… అంటే ఆడకుండా పతకాన్ని కలిసి పంచుకునే పక్షంలో ఇక ఆట దేనికి..? ఆట అంటేనే పోటీ… పోటీపడితేనే ప్రతిభ ప్రదర్శితమయ్యేది… సమస్కంధులైనా సరే, ఏదో చిన్న తేడా ఒకరిని విజేతగా నిలుపుతుంది… ఒకరిని పరాజితుడిగా పడదోస్తుంది… ఆటలో సహజం… సపోజ్, ఇద్దరికీ స్వర్ణం కావాలి, రిస్క్ దేనికి అనుకుని, ఇద్దరమూ కాంప్రమైజ్ అవుదాం, ఇద్దరికీ స్వర్ణం వస్తుంది అని ఇక అవకాశమున్న ప్రతీ ఈవెంటులోనూ… అంటే సేమ్ స్కోర్, సేమ్ మార్క్స్ వచ్చే సందర్భాల్లో, అందరూ ఇలాగే వ్యవహరిస్తే… ఇక ఆట అనే స్పిరిట్ ఎక్కడ ఉంటుంది..? ఇదా క్రీడాస్పూర్తి..? క్రీడాస్పూర్తి అంటే గెలుపూఓటములను సమానంగా స్వీకరించడం, గెలుపు కోసం శ్రమించడం, గెలుపును గౌరవించడం, ఓటమినీ హుందాగా స్వీకరించడం… ఇదే కదా ఆట అంటే… ఇక్కడ ఒలింపిక్ అధికారి కాదు ‘‘ఉమ్మడి విజేత’’ అని నిర్దేశించింది… ఆ ఇద్దరు ఆటగాళ్లే అడిగి, వాళ్ళే నిర్ణయం తీసుకుని ఉమ్మడి పతకాన్ని పొందారు… క్రికెట్‌లో తెలుసు కదా, సేమ్ స్కోర్లు గనుక సంభవిస్తే… బోలెడు మార్గాల్లో విజేతను లెక్కిస్తారు… పడిన వికెట్లు, కొట్టిన సిక్సులు గట్రా… అదే స్పిరిట్… అంతేతప్ప, మీరు పతకాన్ని జాయింటుగా షేర్ చేసుకోపొండి అని వదిలేయరు… ఏ చిన్న తేడానో పట్టుకుని, విజేతను తేలుస్తారు… (ఇద్దరూ సమానులే, కానీ ఒకరు ఎక్కువ సమానులు అనే డైలాగ్ గుర్తుంది కదా… ఆ ఎక్కువ సమానుడిని తేల్చేదే పోటీ…)
Ads
ఇదుగో ఇలా మాట్లాడితేనే చాలామందికి నెగెటివ్ ధోరణిగా కనిపిస్తుంది… ప్రపంచమంతా స్తుతిస్తున్నట్టుగా ఇదే క్రీడాస్పూర్తి అని మనం చెప్పుకుంటే అది పాజిటివ్ ధోరణి అయిపోతుంది… కానీ నిజానికి ఇది పాజిటివా..? నెగెటివా..? ఇంకా సింపుల్‌గా చెప్పుకుందామా..? సపోజ్… హాకీ టీంలు రెండు బలంగా పోటీపడుతున్నయ్… సమానంగా స్కోర్లు… అప్పుడు గనుక ఇద్దరు కెప్టెన్లు మేం గోల్డ్ పంచుకుంటాం అంటే వోకేనా..? తప్పేముంది..? 22 మంది ప్లేయర్లు హేపీ, కోచులు హేపీ, దేశాలు హేపీ… వెంట వచ్చిన అధికారులు హేపీ… మీడియా హేపీ… అంతా హేపీ అయినప్పుడు మరి పోటీ దేనికి..? ఈ ప్రశ్న మాత్రం ఎవరికీ పట్టదు… సమస్కంధులే అనుకుందాం… కానీ ఆ క్షణంలో ఎవరు వీసమెత్తు ఎక్కువ ప్రతిభ కనబరిస్తే వాళ్లే విజేతలు… అదుగో, అది తేల్చేదే ఫైనల్స్… పైన చెప్పుకున్న హైజంప్ ఈవెంటులో కూడా మరోసారి ఇద్దరినీ ట్రై చేయాలని నిర్దేశించాల్సింది… టై బ్రేక్ కు పంపాల్సింది… అదే అసలైన క్రీడాస్పూర్తి…!!
Share this Article