ఏదైనా విపత్తు సంభవిస్తే చాలు… డాక్టర్లు, సహాయక సిబ్బంది కూడా అడుగుపెట్టకముందే… నాయకులు వాలిపోతారు… పరామర్శలు, ప్లాస్టిక్ ప్రేమలు… మీడియాలో కవరేజీ… అంతే, మళ్లీ ఒక్కడూ కనిపించడు… మీడియా కూడా బోలెడు ఫోటోలు వేసి, ఆయా నేతల డొల్ల రాజకీయానికి డప్పు కొట్టీ కొట్టీ అలిసిపోయి, నాలుగు రోజులకు తనూ మరిచిపోతుంది… ఆఫ్టరాల్, మీడియా కూడా రాజకీయానికి ఓ ప్రచారవిభాగం… నిజం అంతేకదా… ఏలూరు వ్యాధులు కూడా అంతే…
పార్టీల పరస్పర విమర్శలు, తిట్లు, పరామర్శలు, ప్రకటనలు అయిపోయాయి… ఆ వింత వ్యాధి బాధితుల సంఖ్య 607కు చేరింది… ప్రస్తుతం 35 మందికి చికిత్స అందిస్తున్నారు… వీరిలో దాదాపు 538 మంది డిశ్చార్జ్ అయ్యారు… అలాగే విజయవాడ, గుంటూరులో 33 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు… బాధితుల్లో ఎక్కువగా, అంటే 76 మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు… ఇప్పటికి ముగ్గురు చనిపోయారు…
Ads
ఆ తాగునీటిలో రకరకాల విషరసాయనాల ఆనవాళ్లు ఉన్నాయని ఓ వార్త… రకరకాల కాలుష్య కారకాలు తాగునీటిలో కలుస్తున్నాయని మరో వార్త… ఎంతోకాలంగా క్రిమిసంహారకాలు తాగునీటిలో కలుస్తున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఇంకో వార్త… మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించవోయ్ అని ఓ ప్రధాన పార్టీ నేత డిమాండ్… రోజూ ఇవే వార్తలు… విషరసాయనాలు కలిశాయనేది నిజమే కావచ్చుగాక.., కానీ హఠాత్తుగా ఆ ఒక్కరోజే ఎందుకిలా జరిగింది..? అసలు ఆ నీటిలో ఏం కలిసింది..? ఎక్కడి నుంచి..? అది కదా తేలాల్సింది..? అది తప్ప, అన్ని దర్యాప్తులూ సాగుతుంటాయి…
21 మందితో తాజాగా ఓ హైపవర్ కమిటీ వేసింది… అందులో ఎవరూ అంటే..? చైర్మన్ చీఫ్ సెక్రెటరీ… కన్వీనర్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ… ఇక ఈ కమిటీ వ్యాధి కారణాలను తెలుసుకుంటుందట… టిపికల్ బ్యూరోక్రటిక్ స్టెప్స్… జగన్ ప్రభుత్వమైనా, బాబు ప్రభుత్వమైనా… ఇలాగే… కమిటీ ఏర్పాటుతో ఒనగూడే సపరేట్ ఫాయిదా ఏముంటుంది..?
చీఫ్ సెక్రెటరీ, ఆరోగ్య సెక్రెటరీల పనే అది కదా… ఈ విపత్తు వేళ కారణాల అన్వేషణ, దర్యాప్తు, బాధ్యులపై చర్యలు… ఇవన్నీ వాళ్ల బాధ్యతలే కదా… విడిగా కమిటీలు వేస్తేనే చేయాలా..? సైంటిస్టులను, డాక్టర్లను, ఇతర నిపుణులను ఎంగేజ్ చేయవచ్చు… డబ్బు ఖర్చు చేయవచ్చు… ఆల్ రెడీ వాళ్లకు ఆ అధికారాలున్నయ్… బాధ్యతలూ ఉన్నయ్…….. ఇదేకదా మనకు కమిటీ ఏర్పాటు వార్త చదవగానే, స్థూలంగా అనిపించేది… కానీ సీఎం జగన్ ఇంకేవో రాజకీయ కారణాలను అనుమానిస్తున్నట్టుగా కనిపిస్తోంది… ఇంకా ధ్రువపడని ఏదో సమాచారం ఉన్నట్టు సమాచారం… లీగల్‌గా, అఫిషియల్‌గా, పర్ఫెక్టుగా ఎవరినో… ఈ కమిటీ ద్వారా బుక్ చేయటానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది…
కానీ నిజానికి ఇది ఓ నేరదర్యాప్తులాగా సాగాలి… వ్యాధిగ్రస్తుల రక్తం విశ్లేషణలు… ఆ రసాయనాల గుర్తింపు… తాగునీటి శాంపిళ్ల విశ్లేషణ… అవీ ఇవీ ఒకటేనా..? వేరే కారణాలున్నాయా..? తాగునీరే అయితే ఆ రసాయనాలు ఎలా కలిశాయి..? ఆ చుట్టుపక్కన ఆ రసాయన వ్యర్థాల అవకాశమున్న ఫ్యాక్టరీలు లేదా వర్క్ షాపుల గుర్తింపు… హఠాత్తుగా ఆరోజే అంత భారీ సంఖ్యలో రసాయనాలు కలవడానికి కారణాలు, బాధ్యులు… తాగునీరు కాకపోతే ఒక ఏరియాకు పంపిణీ అయిన పాలు… వాటి శాంపిళ్లు… కారణాలు, కారకులు… ఇలాంటి శాస్త్రీయమైన ధోరణిలో దర్యాప్తు జరగాల్సి ఉంది…
పోనీ, ఈ కమిటీలోనే నేరదర్యాప్తులో మంచి అనుభవం, పేరు ఉన్న పోలీసు అధికారులను వేసి, వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి చూడండి..! వాళ్ల జోలికి ఒక్క నాయకుడూ రాకుండా చూడండి… నిజంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉందా..? ఒకవేళ అలాంటి కుట్రే ఉండి ఉంటే… ప్రభుత్వ ముఖ్యుల వద్ద ఆల్రెడీ కొంత సమాచారం ఉండి ఉంటే… బాధ్యులను బలంగా ఫిక్స్ చేయాలి… మళ్లీ ఇలాంటివి చేయాలంటే వణికిపోయే శిక్షలుండాలి… చూడాలిక, జగన్ ఏం చేయబోతున్నాడో….!!
Share this Article