.
ఒక జర్నలిస్టుగా నేను గర్విస్తున్నాను… ఎక్కడో నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను కేసీఆర్– జగన్‌కు టార్గెట్ అయ్యే స్థాయికి, ఇద్దరూ నన్ను ప్రధాన ప్రత్యర్థిగా భావించే స్థాయికి ఎదగడం నా మటుకు నాకు గర్వకారణం…
…… ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్వోత్కర్ష… అనగా సెల్ఫ్ డబ్బా… ఎవరో రాజకీయ నాయకులు పదే పదే టార్గెట్ చేస్తే అది జర్నలిస్టుగా అత్యంత ఎత్తులో ఉన్నట్టా..? ఓ విచిత్ర సూత్రీకరణ… ప్రభుత్వాలు యాడ్స్ ఆపేస్తే, చలించకుండా, నిబ్బరంగా, తన పొలిటికల్ లైన్ మార్చుకోకుండా, వంగిపోకుండా, లొంగిపోకుండా, సాగిలబడకుండా నిలబడటం వరకూ గుడ్… మంచి టెంపర్‌మెంట్…
Ads
కానీ, జగన్‌తో తన వైరం వెనుక సామాజికవర్గ కోణం, పార్టీ కోణం, చంద్రబాబు విధేయత వంటి చాలా అంశాలున్నయ్… ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ ఇందిరాగాంధీతో పోల్చుకునేంత సీన్ లేదిక్కడ… సో, ఇది ఒక జర్నలిస్టుకూ ఒక రాజకీయ నాయకుడికీ నడుమ ఘర్షణ ఎలా అవుతుంది..? ఇలా చెప్పుకుంటే రేప్పొద్దున చివరకు మహాన్యూస్ వంశీ కూడా ఇలాగే జబ్బలు చరుచుకుంటాడు…
రారాపోరా బాపతు దోస్తులు కదా, కేసీయార్‌కు హఠాత్తుగా కోపమొస్తుంది రాధాకృష్ణ మీద… మళ్లీ తనే అగ్నిప్రమాదం మాట వినగానే వెళ్లి పరామర్శించి, ఆప్యాయంగా అలుముకుంటాడు… ఇదో విచిత్రమైన బంధం, ఆగ్రహం, వైరం… అసలు వాళ్ల నడుమ దూరానికి కారణాలేమిటో కూడా ఎవరికీ అంతుపట్టవు… సో, దీన్ని కూడా ఓ జర్నలిస్టుకూ, ఓ పొలిటిషియన్‌కూ నడుమ ఘర్షణగా చూడలేం…
రేవంత్‌రెడ్డి మీద ప్రస్తుతం కనబరిచే సానుకూలతకూ, రేవంత్ రెడ్డి- చంద్రబాబు నడుమ సత్సంబంధాలే కారణమనే విశ్లేషణలూ జర్నలిస్టు సర్కిళ్లలో వినిపించేదే… సో, రాధాకృష్ణ వ్యక్తిగత రాగద్వేషాలే తన జర్నలిజాన్ని ప్రభావితం చేస్తున్నాయి తప్ప… ఇదంతా ‘ప్రభుత్వాలతో, పార్టీలతో ట్రూ జర్నలిజం ఘర్షణ’ కాబోదు…
తను తాజాగా రాసుకున్న కొత్తపలుకు వ్యాసంలో ఓచోట అంటాడు… ‘‘కొంత మంది రాజకీయ మరుగుజ్జులు, విదూషకులు చేసే ప్రకటనలకు స్పందించవద్దని, అలా చేస్తే వారి స్థాయి పెరుగుతుందని భారత రాష్ట్ర సమితికి చెందిన కొంత మంది ముఖ్యులు నాకు సలహా కూడా ఇచ్చారు. ఈ సలహాను పాటించాలనే నేను నిర్ణయించుకున్నాను…’’ (ఆమధ్య బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్థాయిని పెంచాడు తనే…)
కరెక్టు… కానీ పారడాక్స్ ఏమిటంటే… అదే పేరాలో ‘‘తమ చర్యల ద్వారా నన్ను పెంచుతూ తమను తాము తక్కువ చేసుకుంటున్న వాస్తవాన్ని కేసీఆర్, జగన్‌రెడ్డి గుర్తిస్తే వారికే మంచిది…’’ అంటాడు… ఇక్కడ రాధాకృష్ణ నన్ను అనవసరంగా మీరే పెంచుతున్నారు అని జగన్‌ను, కేసీయార్‌ను ఆక్షేపిస్తూ, పరోక్షంగా నేనొక ఆఫ్టరాల్‌ను అని చెప్పుకుంటున్నట్టుగా ఉంది…
ఎప్పటిలాగే జగన్ మీద, ఆయన పర్యటనల మీద ఏదేదో రాజకీయ కోణంలో రాసుకొచ్చాడు… కానీ అక్కడక్కడా కొన్ని నిజాలున్నయ్… చీకట్లో కన్ను కొట్టగానే పనై పోవాలి గానీ రప్పా రప్పా అంటూ గోల చేయడం ఏమిటి? మన శత్రువులను చెప్పకుండా వేసేయాలి అని పేర్ని నాని మాటలు చాలా అభ్యంతరకరం… ఇలాంటి ధోరణి తెలంగాణ రాజకీయాల్లోకీ ప్రవేశిస్తోంది…
అమరావతి మహిళలపై సాక్షి టీవీ చర్చలో దిగజారుడు వ్యాఖ్యలు, ఓ లేడీ ఎమ్మెల్యేపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు… అంతకు గోరంట్ల మాధవ్ వెగటు ప్రవర్తన… చంద్రబాబును కూడా ఏడిపించిన వెకిలి నీచ బూతులు… ఇవన్నీ జగన్ క్యాంపు ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకోవాల్సిన అంశాలే…
అబ్బే, టీడీపీ క్యాంప్ ఏమైనా శుద్ధపూసా, లేడీ లీడర్ల మీద చిల్లర ప్రచారంలో అదేమైనా తక్కువా..? అనేవాళ్లూ ఉన్నారు… సరే, ఏపీ రాజకీయాలంటేనే… ప్రపంచంలో ఎక్కడా లేనంత బురద, రోత… కాకపోతే ఎవరెంత తక్కువ, ఎవరెంత ఎక్కువ, జనంలోకి ఎలా ప్రొజెక్ట్ అవుతున్నారనేదే తేడా… అంతే… వైసీపీ క్యాంపుకి ఈ తేడా అర్థమవుతోందా..?
Share this Article