బోయపాటి…. మితిమీరిన హీరోయిజాన్ని చూపిస్తాడు… బాలయ్య… అచ్చం బోయపాటికి తగిన హీరో… ఇప్పటికీ అదే టెంపర్, అదే స్టయిల్… సినిమాల్లో ఎవడెన్ని ప్రయోగాలైనా చేసుకోనీ, తన సినిమాలు మాత్రం సూపర్ హీరోయిజంతో దద్దరిల్లాల్సిందే… బ్లడ్డు, బ్రీడు టైపు పంచ్ డైలాగులు పడాల్సిందే… అవీ ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు, అది వేరే కథ… అయితే పొలిటికల్ పంచులు వేయడం బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో తొలిసారి కావచ్చు బహుశా… రాబోయే అఖండ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యిందిగా… అందులో ఓ డైలాగ్… ‘‘ఏయ్, అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామువా..? పట్టిసీమ తూమువా..? పిల్ల కాలువ’’… ఇది ఎవరి మీద పరోక్షంగా విసిరిన డైలాగ్… జగన్‌పైనేనా..? పట్టిసీమ అనగానే బాబు గుర్తొస్తాడు… విపరీతంగా ప్రచారం చేసుకున్నారు కదా… అధికారం పోవడంతో పోలవరం డ్యామ్ సగంలో ఆగింది… జగన్ నవయుగను తరిమేయడం, మేఘాను దింపడం అందరికీ తెలిసిందే… మరి ఈ పిల్ల కాలువ అనే వెక్కిరింపు వెనుక ఉద్దేశం ఏమిటి హఠాత్తుగా..?!
సినిమా కథలో సందర్భానికి తగినట్టు బాలయ్య మార్క్ డైలాగ్ అనుకునేలా లేదు ఇది… సరే., తను టీడీపీ ఎమ్మెల్యే, జగన్ ప్రబల ప్రత్యర్థి చంద్రబాబుకు వియ్యంకుడు, కాబోయే సీఎంను అనుకునే లోకేష్‌కు స్వయానా మామ, టీడీపీ వ్యవస్థాపకుడి కొడుకు… వైసీపీ మీదో, జగన్ మీదో ఓ పొలిటికల్ పంచ్ వేయడం అసాధారణం ఏమీ కాదు, కాకపోతే బాలయ్య సినిమాలో ఎంతసేపూ స్వోత్కర్షలే తప్ప ఇలాంటి గెలికే పొలిటికల్ పంచులు అరుదే… ట్రెయిలర్‌లో మాత్రం ఈ డైలాగ్ ఉంది, మొత్తం సినిమాలో ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయో తెలియదు… సినిమా సంగతికొస్తే ఎన్టీయార్ బయోపిక్కులు, శాతకర్ణి వంటి ఫ్లాపులతో చాలారోజులుగా బాలయ్య కెరీర్ నిరాశాజనకంగా ఉంది, వయస్సు పైనబడుతోంది… కొడుకు మోక్షజ్ఞ వెండితెరకు ఎంతవరకు పనికొస్తాడో తనకే తెలియదు… మరోవైపు బోయపాటి కథా అంతే… వినయవిధేయ అని అప్పట్లో ఏదో ఫ్లాప్ సినిమా తీశాడు, జనం ఠారెత్తిపోయారు అందులోని అత్యంత అసహజమైన సీన్లకు… అసలు రాంచరణ్ ఎలా అంగీకరించాడు వాటికి..? బోయపాటికీ ఓ హిట్ కావాలి, బాలయ్యకూ ఓ హిట్ కావాలి… చూడబోయే అఖండ ట్రెయిలర్ ఆ హోప్, ఆ హైప్ క్రియేట్ చేస్తున్నట్టే ఉంది…
Ads
ఉన్నంతలో కొన్ని డైలాగులు కూడా బాగున్నట్టే అనిపిస్తున్నయ్… కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పందీ… కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…. హహహ… ఈ డైలాగ్ సరిగ్గా అఖండ వేషానికి తగ్గట్టుగా ఉంది… సరిగ్గా మీసాలకు నలుపు రంగు, జుట్టుకు నలుపు రంగు, మిగతా గడ్డం తెలుపు… చేతిలో త్రిశూలం బదులు పంచశూలం… చేతిలో కపాలమాల… రుద్రాక్షమాలలు… కొత్త వేషం మాత్రం భలే కుదిరింది బాలయ్యా..! డైలాగులు ఎవరు రాశారో గానీ ట్రెయిలర్‌లో ఒకటీరెండు బాగున్నయ్… అందులో… 1) విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు… 2) నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడ్డొచ్చింది, నాకడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెబుతూ పని ఆపితే… 3) ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే అది శాసనం… దైవశాసనం… 4) మీకు సమస్యొస్తే దండం పెడతారు… మేం ఆ సమస్యకే పిండం పెడతాం… ఫైట్లలో మనుషుల దేహాలు ఎగిరిపోవడం వంటి సీన్లంటారా..? బాలయ్య మార్క్ సినిమా అంటే అంతే… క్వయిట్ నేచురల్… అవి లేకపోతేనే ఆశ్చర్యపోవాలి… పైగా బోయపాటి…!! అవును గానీ బోయపాటి సార్… ‘‘40 మంది సచ్చిపోయారు నీవల్లే’’ అనే డైలాగ్ పుష్కర ప్రమాదాన్ని గుర్తుచేస్తూ, నీపై నీవే ఓ డైలాగ్ వేసుకున్నావా..? నువ్వు గ్రేట్ సార్…!!
Share this Article