బతుకమ్మను ఎవరూ ఉద్దరించనక్కర్లేదు… వందల ఏళ్ల పరాయి పాలనలోనూ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది… సగటు తెలంగాణ మహిళ ఆత్మ ఆ బతుకమ్మ… తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ… కేసీయార్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మను అధికారిక ఉత్సవంగా ప్రకటించాక, బతుకమ్మ మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్లు భ్రష్టుపట్టించారు… బాధపెట్టించారు…
ఒక్క నిఖార్సయిన ఉదాహరణ చెప్పుకుందాం… అధికారిక ఉత్సవం కదా, ఏదో ఒకటి మమ అనిపించాలి… ఓ చోట అధికారులు అటూఇటూ చూశారు… దగ్గరలో ఓ కుండీ కనిపించింది… అందులో ఏదో డెకరేటివ్ మొక్క… ఇంకేం… తీసుకొచ్చి… మధ్యలో ఓ తివాచీ వేయించి… మగ అధికారులే బూటు కాళ్లతో ఇష్టారాజ్యంగా తిరగడం స్టార్ట్ చేశారు… ఈలోపు డీజేలో ఎవరో ప్రైవేటు యూట్యూబ్ వాడు పాడించిన ఓ చెత్తా పాట వేశారు… దీన్ని బతుకమ్మ ఉత్సవ నిర్వహణ అనాలట… ఆ ఫోటోలు చూసి కలుక్కుమంది…
ఎవడు పడితే వాడు బతుకమ్మ పాటను, ఆటను, పండుగను, విశిష్టతను, ఆ సంబరాన్ని, ఆ మురిపాన్ని ఇలా ధ్వంసం చేశారు… సీన్ కట్ చేస్తే… ఈమధ్య సినిమాల్లో తెలంగాణతనం ఎక్కువైంది… ఆ పాట, ఆ ఆట, ఆ పండుగలు, ఆ కన్నీళ్లు, ఆ ఆనందాలు, ఆ కథలు హైలైట్ అవుతున్నయ్… జనం ఆదరిస్తున్నారు… జీవమున్న సాంస్కృతిక ధార కదా… మరోసారి సీన్ కట్ చేయండి… రజాకార్ అనే సినిమా ఒకటి వస్తోంది…
Ads
నాటి రజాకార్ల, జమీందార్ల అరాచకాల కంటెంట్ జోలికి గానీ, సాయుధ పోరాటాల సాహసాల కథల జోలికి గానీ… ఆ సినిమా వెనుక ఉద్దేశాల జోలికి గానీ, పాత గాయాల్ని కెలికే ప్రయత్నమని రజాకార్ల అభిమానులు చేసే వ్యాఖ్యల జోలికి గానీ ఇక్కడ వెళ్లడం లేదు మనం… ఒక పాట గురించి మాత్రమే… ఆ పాట ఆ టీజర్‌లో కనిపిస్తోంది… అది బతుకమ్మ పాట తరహాలో రాయబడిన పాట… రాసిన కాసర్ల శ్యామ్ కలం బాగానే పదునుగానే పరుగులు తీసింది… సంగీతం సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో కంపోజింగూ బాగుంది… ఎటొచ్చీ దీని కొరియోగ్రఫీ చూస్తేనే కలుక్కుమంటోంది…
ఇదీ రజాకార్ మూవీ టీజర్ యూట్యూబ్ లింక్…
మొత్తం పాట సినిమా రిలీజయ్యాక చూద్దాం గానీ, టీజర్‌లో ఆ పాటకు మహిళలు నాలుగైదు రకాల స్టెప్పులు వేయడం కనిపించింది… దారుణం… బతుకమ్మ చుట్టూ తిరగడానికి ఓ రిథమ్ ఉంది… పాదం కదిలినా, పదం కలిసినా, చప్పట్లు కొట్టినా ఓ పద్ధతి ఉంది… అది బతుకమ్మ విశిష్టత… దానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా సినిమాటిక్ స్టెప్పులు సమకూర్చడం కరెక్టు కాదు… సినిమాటిక్ లిబర్టీ ఎక్కడైనా తీసుకొండి, కానీ తెలంగాణ సాంస్కృతికధారతో ఆడుకోకండి… డీజేలో యూట్యూబ్ సాంగ్స్ మోతలు, పిచ్చి సినిమా గెంతులు బతుకమ్మ ఆట కానేకాదు… లేదు, మా ఇష్టం అంటారా..? మీ ఇష్టం, మీ నిర్మాత గూడూరు నారాయణరెడ్డి టేస్ట్… అంతే…
అదేదో పరమ నాసిరకం నాటు పాట రాసి, ఆస్కార్ కొట్టిన చంద్రబోస్ మాట్లాడితే తెలంగాణతనం గురించి ఏదేదో చెబుతాడు… చేతల్లో ఏమీ లేకపోయినా సరే… ఆయన భార్య సుచిత్ర గతంలో కొరియోగ్రాఫర్… ఆమె కెరీర్‌లో ఏమేం గొప్ప సినిమాల స్టెప్పులు ఉన్నాయో తెలియదు గానీ చాన్నాళ్లుగా ఆమె ఫీల్డ్‌లో లేదు… ఆమె స్వస్థలం ఏదో తెలియదు గానీ తెలంగాణ మాత్రం కాదేమో… లేకపోతే ఈ బతుకమ్మ పాటకు ఇలా సగటు తెలుగు సినిమా బాపతు స్టెప్పులు కంపోజ్ చేసి ఉండకపోవును… ఇక ఆ దర్శకుడు ఈ స్టెప్పుల్ని ఎలా ఆమోదించాడో ఆయనకే తెలియాలి… అమ్మా, సుచిత్రమ్మా… తెలంగాణ మీద పాత కోపాలు, పాత కక్షలేమైనా ఉన్నాయా మనసులో..?! చివరగా… అనసూయ ఆ పాత్రకు అస్సలు నప్పలేదు..!!
Share this Article