పొద్దున్నే అభినందించడం మరిచిపోయా… వందల మందిని ఓ విపత్తు నుంచి కాపాడిన మాజీ లష్కర్ రామయ్య… తన వార్తకు తగిన ప్రయారిటీ ఇచ్చిన ఆంధ్రజ్యోతి… వార్త రాసిన రిపోర్టర్‌కు అభినందనలు… మీకు ధర్మాడి సత్యం అనే పేరు గుర్తుందా..? పెద్ద పెద్ద ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ చేతులెత్తేసిన చోట, గోదావరి అడుగు నుంచి ఓ లాంచిని నొగలు పట్టి, మెడలు పట్టి, ఒడుపుగా గట్టు మీదకు లాక్కొచ్చి పడేసిన సత్యం… తనకు తెలిసిన సంప్రదాయిక టెక్నిక్స్, అనుభవం, ఒడుపు, తన టీంతో పనిచేయించుకునే తెలివి… ఆ లాంచి తలవంచింది… ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చాడంటే… పోలిక కుదరక కాదు… సేమ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ విపత్తు నివారణ, సన్నద్ధత బృందాలు, వ్యూహాలు గట్రా ఫెయిల్… ఉద్యోగం ఎప్పుడో విరమించిన ఓ లష్కర్ ఓ ప్రమాదాన్ని అంచనా వేశాడు, తన ప్రాణం తను చూసుకుని వదిలేయలేదు, అందరినీ అలర్ట్ చేశాడు, గుట్టల మీదికి తరిమాడు… తెగిన అన్నమయ్య ప్రాజెక్టు నీరు అనేక మందిని మింగేయకుండా అడ్డుపడ్డాడు… శెభాష్ రామయ్యా…
30 ఏళ్లుగా ఆ ప్రాజెక్టే తన కొలువు, తన నెలవు… దగ్గరలోనే ఇల్లు… బతుకంతా అన్నమయ్యే… ఒకవైపు ఇరిగేషన్ ఇంజనీర్లు గేట్లు ఎత్తుతూనే ఉన్నారు… వరదనీరు దిగువకు వెళ్లిపోతూనే ఉంది… కానీ విపత్తులు అధికశాతం అర్ధరాత్రే కమ్ముకొస్తాయి… ఇప్పుడూ అంతే, ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పెరుగుతోంది… ఇన్నేళ్ల లష్కర్ అనుభవంలో ఇంత వరద ధాటి ఎప్పుడూ చూడలేదు… అంతే… మూడు నాలుగు గ్రామాల్లో తెలిసినవాళ్లందరికీ ఫోన్లు చేయసాగాడు… ఎవరూ తన మాటల్ని తేలికగా తీసిపారేయలేదు… అలర్టయిపోయారు… పంటనష్టాలు, ఆస్తినష్టాలు, గొడ్డూగోదానష్టం ఎలాగూ తప్పలేదు… కానీ ప్రాణనష్టం జరగకుంగా కాపాడబడింది… ఇక్కడ ఓ ప్రశ్న… వర్షాలొస్తున్నయ్, వరద నీరు వస్తోంది… ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు… కానీ తెల్లారేసరికి దాన్నలాగే కనిపెట్టి ఉండాల్సిన యంత్రాంగం ఏమైంది..? ఇదే విపత్తు సన్నద్ధత…? ఎక్కడుంది లోపం..?
Ads
ఈ సమీక్ష ఏమైనా జరిగిందా..? లేక అందరూ బాగానే పనిచేశారు, ఊరూరా ప్రమాదహెచ్చరికలు చేశారు, రామయ్య పెద్దగా చేసిందేమీ లేదని సింపుల్‌గా తేల్చిపడేశారా..? ఇలాంటి సందర్భాల్లో అందరికీ తెలిసిన సూత్రం ఒకటే… స్కిన్ సేవింగ్…! ఎలాగూ ఎవడూ రాయడు… కనీసం ఇంతరాసిన ఆంధ్రజ్యోతి ఆ కోణాన్ని కూడా టచ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది… అవునూ, గతంలో పలుప్రాంతాల్లో జరిగిన పలు తుపాన్ నష్టాల మీద గాయిగత్తర చేసిన మీడియా, ప్రభుత్వం నిజంగా మొన్నటి సీమ వరదకష్టాల మీద సరైన రీతిలో స్పందించాయా..? మిగతా ప్రాంతాల పౌర సమాజం కూడా..!! సీమ తన కన్నీటికి తనే ఎందుకు వదిలేయబడింది..?!
Share this Article