నిన్న ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించడం మరిచిపోయింది, ప్రశంసించడం విస్మరించింది మన మీడియా… ఆ జిల్లా పేరు కన్నూరు… కేరళ… నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన పావర్టీ ఇండెక్స్‌లో ఆ జిల్లా ప్రత్యేకత ఏమిటో తెలుసా..? జీరో పావర్టీ… నిజం… ఆ జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లెవరూ లేరు… నీతి ఆయోగ్ తీసుకున్న ప్రమాణాల మేరకు..! ఈ ప్రమాణాలు కరెక్టేనా అనే చర్చలోకి వెళ్దాం కానీ, వాళ్లు ఎంచుకున్న ఆ ప్రమాణాల మేరకైనా సరే, ఈ దేశంలోని ఒక జిల్లా దారిద్య్రం నుంచి పూర్తిగా విముక్తమైందనే ఓ సూచిక ఆనందాన్నిస్తోంది… అదొక్కటే కాదు, ఎర్నాకుళం (0.10), కొజికోడ్ (0.26) త్రిసూర్ (0.33), కన్నూరు (0.44) పాలక్కాడ్ (0.62), అలప్పుజ (0.71), కొల్లం (0.72), పతనంతిట్ట (0.83) కూడా లీస్ట్ పావర్టీ జిల్లాలు… సగటున మొత్తం రాష్ట్రమే 0.71 శాతం పేదలతో ‘ప్రగతి సూచిక’గా నిలిచింది…
మన తెలుగు రాష్ట్రాల సంగతేమిటీ అంటారా..? తెలంగాణ 18 వ ప్లేసు… ఏపీ 20వ ప్లేసు… చాలా వెనక్కి దేనికి..? జస్ట్, 1984 నుంచి తీసుకుందాం… ఎన్టీయార్, తరువాత ఇద్దరో ముగ్గురో కాంగ్రెసోళ్లు, చంద్రబాబు, వైఎస్, మరో ఇద్దరు కాంగ్రెసోళ్లు, ఇప్పుడు జగన్, కేసీయార్… అందరూ గొప్పోళ్లే… వాళ్ల ఫ్యాన్స్‌ను అడగండి, డప్పు కొట్టడం స్టార్ట్ చేస్తే అది ఆగనే ఆగదు… తీరా చూస్తే మన అభివృద్ధి స్థానాలు అవి… మన జీవననాణ్యత అది… ఇక్కడ జగన్‌కు, కేసీయార్‌కు మినహాయింపు ఇవ్వాలి… ఎందుకంటే, ఈ పావర్టీ ఇండెక్స్ 2015-16 లెక్కల ప్రకారం రూపొందింది కాబట్టి…! మన నేతలకు రాజకీయాలు తప్ప ఇంకేమీ పట్టవు… ప్రాంతాభివృద్ధి అంటే ఎవరికీ ఓ ఫోకస్ లేదు, ఓ ప్లానింగ్ లేదు… వెరసి మన స్థితీ గతీ ఇది… దక్షిణాదిలో కేరళ దాదాపు పావర్టీ లెస్… తమిళనాడు బిలో 5 శాతంతో చాలా బెటర్… దిగువ నుంచి నాలుగో స్థానం… ఎటొచ్చీ మనం ప్లస్ కర్నాటకే దయనీయం… కర్నాటక 19 వ ప్లేసు, అంటే ఏపీ, తెలంగాణ నడుమ…
Ads
ఎహె, ఈ ప్రమాణాలే తప్పు అనేవాళ్లు ఉన్నారు… ప్రజల్లో పేదవాళ్ల లెక్క తీయడానికి నానా మార్గాలు, విధానాలున్నయ్… ఇదే నీతి ఆయోగ్ గత ఏడాది పావర్టీ లెక్కల్ని తీస్తే, ఈ సంవత్సరం లెక్కలతో పూర్తి తేడా… అది Tendulkar method on Mixed Reference Period (MRP)… పౌరసరఫరాల శాఖ లెక్క వేరు, గ్రామీణాభివృద్ధి లెక్క వేరు, ఉపాధి హామీ లెక్క వేరు, ఆరోగ్యశాఖ లెక్క వేరు… ఏదో ఓ మెథడ్… లెక్క తీశామా, లేదా… అంతే… ఈసారి పద్ధతి National Multidimensional Poverty Index (NMPI)… దీనికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లెక్కల్ని తీసుకున్నారు… అదేమిటి..? ఆరోగ్య సూచికలకూ దారిద్య్రపు లెక్కలకూ పొంతన ఏమిటి అనడక్కండి… మరో 12 మంత్రిత్వ శాఖ లెక్కల్ని కూడా జోడించాం, United Nations Development Programme (UNDP), Oxford Poverty and Human Development Initiative (OPHI) కూడా ఈ పద్ధతులే పాటిస్తున్నయ్ అంటున్నారు ఇప్పుడు…
అది ఏ అంశాలను తీసుకున్నదంటే… పక్కా ఇల్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వంట ఇంధనం, ఆర్థిక స్థితి (బ్యాంక్ అకౌంట్), స్కూల్ అటెండెన్స్, స్కూల్ వెళ్లే కనీస వయస్సు, పౌష్టికాహార స్థాయి, తల్లీబిడ్డల ఆరోగ్యం… ఈ డేటాలన్నీ ఒక్కచోట మిక్సీ కొట్టి, చివరకు ఈ లిస్టు తీశారు… కానీ ఇవి 2015-16 గణాంకాలు… అంటే ప్రస్తుత సిట్యుయేషన్ కాదు… తరువాత సర్వే 2019-20 గణాంకాల ఆధారంగా జరుగుతుంది… నిజానికి ఇవన్నీ ఆయా ప్రాంతాల ప్రజల జీవననాణ్యతను పట్టి ఇచ్చే సూచికలు… కానీ ఎంత స్థిరమైన ఆదాయం ఉంటే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడ్డట్టు భావించాలి..? ఈ కీలకప్రశ్నకు నీతి ఆయోగ్ వద్ద సమాధానం లేదు… నిజానికి ఒక కుటుంబానికి స్థిరమైన ఉపాధి మార్గం ఉండి, తమ అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే ఆ కుటుంబం పేదరికంలో లేనట్టు పరిగణిద్దాం… ఎస్, ఇప్పుడు నీతిఆయోగ్ తీసుకున్న ప్రమాణాలు కూడా తీసిపారేయదగినవి కావు, అవి ప్రజల జీవనప్రమాణాల్ని సూచించేవి… బీమారు రాష్ట్రాల దురవస్థను, కేరళ వంటి రాష్ట్రాల ప్రగతిని తెలియనివాళ్లెవరు… ఆ కారణాల చర్చలోకి వెళ్తే అది ఒడవదు, తెగదు… కాకపోతే ఈ పావర్టీ ఇండెక్స్ ఏమీ యాక్యురేట్ కాదు, ఇదే అల్టిమేట్ కూడా కాదు..!!
Share this Article