.
తెలుగు కడుపు చించుకుంటే ఇంగ్లిష్ కాళ్ళమీద పడుతుంది. తెలుగు రాయబోతే ఇంగ్లిష్ అక్షరాలు దొర్లుతాయి. తెలుగు ప్రమిదను వెలిగించబోతే ఇంగ్లిష్ గాలికి ఒత్తులు ఎగిరిపోతాయి లేదా ఆరిపోతాయి. తెలుగును నాటబోతే తెగుళ్లు ఎదురవుతాయి.
తేట తెలుగును నాటబోతే కలుపు మొక్కలు ఎదురవుతాయి. తేనె తెలుగును పలకబోతే పంటికింద ఇంగ్లిష్ రాళ్ళు అడ్డుపడతాయి. ఇంగ్లిష్ లో లేని అక్షర దోషాలు తెలుగులో దొర్లిపోతూ ఉంటాయి. ఇంగ్లిష్ లో అయితే స్పెల్లింగ్ మిస్టేక్. తెలుగులో అయితే టేక్ ఇట్ గ్రాంటెడ్. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
Ads
ఇస్కోన్ టేమ్పల!
హైదరాబాద్ మెట్రోలో రోజూ లక్షలమంది ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి మెట్రో స్టేషన్ల పేర్లు పైన తెలుగు, కింద వరుసగా ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో రాసి ఉంటాయి. ఆయా స్టేషన్ల బోర్డులమీద ఇంగ్లిష్ లో ఉన్న అక్షరాలను చదివితే తప్ప మనకు ఏమీ అర్థం కాదు. అంటే తెలుగును చదవబోతే మొదట కళ్ళు బైర్లు కమ్మి, తల తిరిగి పడిపోతాం. అయినా ప్రాణాలకు తెగించి ఒకవేళ చదివితే కడుపులో తిప్పుతుంది.
వికారంగా ఉండి తరువాత స్టేషన్ రాకుండానే పట్టాలమీద రన్నింగ్ ట్రెయిన్లో నుండి దూకేయాలనిపిస్తుంది. కావాలంటే మీరొకసారి “వుడ్ పాకేర్స్ షో రూమ్” దగ్గర మెట్రో మెట్లమీద పాకి చూడండి! లేదా మెట్రో మోక్ష సిద్ధికి “ఇస్కోన్ టేమ్పల” టెంపుల్ స్టేషన్ ఎక్కడుందో వెతుక్కోండి. ఇంగ్లిష్ లో రాని తప్పులు తెలుగులోనే ఎందుకొస్తాయని ఆ పాకేర్స్ బోర్డు కింద ఇస్కాన్ కృష్ణుడే అడుక్కోవాలి!
అనువధ
అడయార్ ఆనందభవన్ ముందు ఒక బోర్డు. ఇంగ్లిష్ లో “We are not responsible for your valuable things” అని సరిగ్గానే ఉంది. తెలుగులో “ప్రియమైన కస్టమర్లు మేము కాదు మీ విలువైన వస్తువులకు బాధ్యత వహిస్తారు” అని ఉంది.
ఈ తెలుగు చదివిన తెలుగువారు ఎవరైనా ఆ ఆనంద భవన్లో తినగలగరా? తిని జీర్ణం చేసుకోగలరా? అయినా మన పిచ్చిగానీ…తెలుగువారెవరైనా మొదట చదివేది ఇంగ్లిష్ బోర్డులే కదా! కాబట్టి ఈ అనువధకు ఆనందభవన్ ను బాధ్యత తీసుకోమనడం భావ్యం కాదు!
తెలుగు మరణించే ప్రమాదం
రోడ్లమీద “Be Careful Dead End” అన్న ఇంగ్లిష్ బోర్డులకు తెలుగులో “జాగ్రత్త మరణించే ప్రమాదం ఉంది” అని ఉంటోంది. ఎవరోగానీ ఇదొక్కటి అక్షర సత్యంగా అనువాదం చేసి పెడుతున్నారు. నిజమే. ప్రతి దారిలో, ప్రతి మలుపులో, ప్రతి సందర్భంలో, ప్రతి సంభాషణలో, ప్రతి రాతలో, ప్రతి అనువాదంలో వర్తమానంలో, భవిష్యత్తులో తెలుగు మరణించే ప్రమాదంలోనే ఉంది! కాదు కాదు- మరణిస్తూనే ఉంది!!
అమంగళము ప్రతిహతమగుగాక!
కొస వెలుగు:-
కర్ణాటక రాజధాని బెంగళూరులో అదే మెట్రో. అవే స్టేషన్లు. కానీ కన్నడ కస్తూరి, కన్నడ కావేరి అని వారు గర్వంగా చెప్పుకునే అందమైన కన్నడలో అచ్చు తప్పులు లేకుండా ఎంత చక్కగా రాసుకున్నారో! జాగృతరాగిరి (జాగ్రత్తగా ఉండండి) గాజిన మేలె నిమ్మ కైగళన్ను ఇడబేడి (గాజుమీద మీ చేతులు పెట్టకండి) అని.
తికమక తెలుగు అక్షరాల టేమ్పల ఇస్కోన్ పాకేర్స్ మెట్లెక్కి భాష మరణించే మలుపులదగ్గర గాజులు గుచ్చుకుని తెలుగు చేతులకు రక్తం కారుతుంటే… కన్నడ చేతులు ఎక్కడ పెడితే గుచ్చుకుంటాయో అచ్చుతప్పుల్లేని కన్నడలో చదివి, తెలుసుకుని జాగ్రత్తపడుతున్నాయి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article