S.P బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన బ్రాహ్మణీయ సంస్కృతికి సమర్థకుడనీ, ఆయనకు కులతత్వం ఉందనీ విమర్శలెన్నో చేశారు… ఇప్పుడు కాశీనాథుని విశ్వనాథ్ మరణించాక అదే రచ్చ… బ్రాహ్మణీయ సినిమాలు తీశాడని సోషల్ మీడియాలో ఒకటే వాగ్వాదాలు…
అసలు విశ్వనాథ్ బ్రాహ్మణుడేనా..? ఇదీ ఒక ప్రశ్న… సుబ్రహ్మణ్యం పుట్టుక రీత్యా ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు… సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్ బంధువులు… అలాంటప్పుడు విశ్వనాథ్ వైదిక బ్రాహ్మణుడెలా అవుతాడు..? అసలు ఆరాధ్య బ్రాహ్మణులంటే ఎవరు..? ఈ ప్రశ్నకు ఓ జవాబు తెలుసుకోవడం కోసం ఆయన అంత్యక్రియల్ని గమనించాను… దహనం కాదు, ఖననం చేశారు… కాకపోతే లింగాయత్ సంప్రదాయంలో మృతదేశాన్ని కూర్చోబెట్టి పాడె మోస్తారు… చివరకు ఖననం కూడా కూర్చోబెట్టే చేస్తారు…
కూర్చోబెట్టి, మృతదేశం త్వరగా డీకంపోజ్ కావడానికి విభూతి ఉండలు, కర్పూరపు ఉండలు విరివిగా దేహం చుట్టూ ఉంచుతారు… విశ్వనాథ్‌ను మామూలుగా పడుకోబెట్టి ఖననం చేసినట్టు వీడియోల్లో కనిపించింది… దాంతో తను బ్రాహ్మణుడా కాదా అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది… నిజానికి తను సప్తపది వంటి సినిమాల్లో కులవాదాన్ని నిరసించాడు… బ్రాహ్మణుల్లోని పెడపోకడల్ని కూడా ఎత్తిచూపించాడు… అసలు ఎవరు ఈ ఆరాధ్య బ్రాహ్మణులు..? ఇది తెలియాలంటే ముందుగా వీరశైవం గురించి కొంతైనా తెలుసుకోవాలి… ( ఈ వీరశైవ మతవ్యాప్తి వివరాలు నెట్‌లో ముత్తేవి రవీంద్రనాథ్ sp బాలు మరణం సందర్భంగా రచించినట్టుగా కనిపించాయి… వాటిని కాస్త విశ్వనాథ్ కి వర్తింప చేశాను… వర్తిస్తాయి కాబట్టి…)
Ads
శైవ మతం నుండి చీలిన ఒక శాఖ. దీనిని లింగాయత మతం అని కూడా అంటారు. తమ మతాచారాలకు సూచనగా వీరశైవులు లింగాన్ని ధరిస్తారు కనుక వారిని లింగాయతులు అంటారు. వీరశైవం యొక్క ఆవిర్భావం కర్ణాటకలో జరిగింది. బసవేశ్వరుడి కాలంలో వీరశైవం ఉచ్చదశకు చేరుకుంది. శైవ మతాన్ని పునరుద్ధరించడం కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఆయన వాహనమైన నంది బసవేశ్వరునిగా భూలోకంలో అవతరించడం జరిగిందని వీరశైవుల విశ్వాసం. ఆయన రాసిన వచనాలు, ఆయన బోధనలు కన్నడ సీమలో భక్తి ఉద్యమానికి, శైవమత పునరుద్ధరణకు దారితీశాయి. బసవడు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించలేదు. వేదాలలో ప్రతిపాదించిన వర్ణాశ్రమ ధర్మాలను, యజ్ఞ సంస్కృతిని, పశుబలులను ఆయన తీవ్రంగా నిరసించాడు. అమానుషమైన వర్ణ వ్యవస్థను, అంటరానితనం వంటి దురాచారాలను తీవ్రంగా విమర్శించి వర్ణరహిత సమాజ స్థాపన కోసం కృషిచేశాడు.
జన్మతః తాను బ్రాహ్మణుడే అయినా సమాజంలో బ్రాహ్మణాధిక్యతను నిరసించాడు. సామాజిక పురోగతికి జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీల విముక్తి తప్పనిసరి అని ఆయన ఆనాడే గుర్తించాడు. వైదిక సాహిత్యంలో స్త్రీల పట్ల ఎంతటి వివక్షాపూరిత వైఖరి ఉందో తన రచనలలో ఎత్తిచూపిన బసవడు తన జీవితకాలమంతా స్త్రీలు, బలహీనవర్గాల విముక్తికే కట్టుబడి కృషిచేశాడు. కుల ప్రసక్తిలేని వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడు. తన సోదరి నాగలాంబికను ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు.
ఆ దంపతుల కుమారుడే చెన్న బసవడు. అనంతర కాలంలో చెన్న బసవడు లింగాయత మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. వీరశైవులు అంగము అని పిలిచే తమ శరీరానికి, పరమ శివుని ప్రతిరూపంగా భావించే లింగమునకు అభేదం పాటిస్తారు. తమ శరీరంపై సదా ఇష్టలింగాన్ని ధరిస్తూ, ఆత్మ – పరమాత్మల విడదీయరాని సాన్నిహిత్యానికి దానినొక సంకేతంగా భావిస్తూ, ఆ ఇష్టలింగాన్ని తమ శరీరాన్నుంచి ఎట్టి పరిస్థితులలోనూ తొలగించరు. ఇష్టలింగ ధారణలో భాగంగా వీర శైవులు సాధారణంగా హృదయానికి సమీపంలో ఒక లింగకాయ లేక రుద్రాక్షను ధరిస్తారు. వారు బ్రాహ్మణులలా యజ్ఞోపవీతాన్ని ధరించరు. తాము ధరించే ఇష్టలింగాన్ని వారు మరణానంతరం కూడా తొలగించరు. పార్థివ దేహాన్ని దహనం చేయడం కారణంగా తాము జీవించి ఉండగా ధరించిన ఇష్టలింగం చితిమంటలలో కాలిపోకూడదనే వారు తమ అంత్యక్రియలలో దహన పద్ధతిని కాకుండా ఖనన పద్ధతిని పాటిస్తారు.
వీరశైవ మతంలో ఆరాధ్యులు అనే ఐదుగురు ప్రవక్తలు ప్రసిద్ధులు. వారు – రేవణారాధ్యుడు, మరుళారాధ్యుడు, పండితారాధ్యుడు, ఏకోరామారాధ్యుడు, విశ్వారాధ్యుడు. వీరు ప్రాచుర్యంలోనికి తెచ్చినదే ఆరాధ్యశైవ మతం. కాశ్మీర శివాద్వైతం ప్రభావంతో బసవేశ్వరునికి పూర్వమే కన్నడనాట ప్రభవించిన వీరశైవ భావాలు గొప్ప సామాజిక సంస్కరణలు తెచ్చాయి. బసవేశ్వరుడి కాలంలో ఈ సామాజిక విప్లవం మరింత ముందడుగువేసి, వీరశైవం కులభేదాలను నిరసించి కులరహిత సమాజం కోసం కృషిచేసింది. దాదాపు అదే సమయంలో ఈ ఆరాధ్యులు ప్రవచించిన ఆరాధ్య సంప్రదాయం కన్నడ దేశం నుంచి ఆంధ్ర ప్రాంతానికి విస్తరించింది. కర్మ ప్రధానమైన వైదిక మతం అప్పుడు వెనుకపట్టు పట్టి తెలుగు నేలపై సైతం భక్తి ప్రధానమైన వీరశైవ మతం క్రమంగా పైచేయి సాధించసాగింది.
అయితే కుల ప్రసక్తిలేని కన్నడ సీమ నుంచి ఈ లింగధారులు వీరశైవ మత వ్యాప్తికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశం అంతటా వర్ణ వ్యవస్థ ఘనీభవించి ఉన్నది. బ్రాహ్మణులు అగ్ర వర్ణంగా ఉండి సమాజానికి దిశానిర్దేశకులుగా ఉన్నారు. ఆ దశలో ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టిన వీరశైవ ఆరాధ్య సంప్రదాయం ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వర్ణధర్మాలను విడనాడకుండా వాటికే కట్టుబడి ఉన్నది. ఆంధ్రదేశానికి ఆరాధ్య శైవులు వచ్చిన సమయంలో ఇక్కడి పరిస్థితుల ప్రభావం కారణంగా వారు వర్ణ వ్యవస్థను సమర్థించినప్పటికీ వారిని బ్రాహ్మణులుగా గుర్తించి, వారితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొనటానికి ఆంధ్ర బ్రాహ్మణులు – ముఖ్యంగా వైదికులు ముందుకు రాలేదట. కొంతకాలానికి ఈ అల్పసంఖ్యాక ఆరాధ్య శైవులతో ఆరువేల నియోగులలోని కొందరు మాత్రం అక్కడక్కడా వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారట. అలా నాటినుంచి ఆరాధ్యులు మిగిలిన స్థానిక బ్రాహ్మణులకు భిన్నంగా తమ ప్రత్యేక వీరశైవ సంప్రదాయాలు కొనసాగిస్తూ తెలుగు బ్రాహ్మణులలో ఒక మైనారిటీ వర్గంగానే కొనసాగుతూ వస్తున్నారు.
కాశీనాథుని, శ్రీపతి పండితారాధ్యుల (S.P.), మల్లికార్జున పండితారాధ్యుల (M.P.), ములుగు, శివలెంక, ముదిగొండ, మల్లంపల్లి వంటి ఇండ్లపేర్లు కలిగిన అతికొద్ది కుటుంబాలవారు ఈ ఆరాధ్యులు. శ్రీపతి పండితారాధ్యుల, శివలెంక, మల్లికార్జున పండితారాధ్యుల అనే మూడు ఇండ్లపేర్లు ఆరాధ్యులలో ప్రముఖులైన పండితత్రయం మీదుగా ఏర్పడ్డాయి. కాశీనాథుడు అనే ఆరాధ్య ప్రముఖుని పేరిట కాశీనాథుని అనే ఇంటి పేరు ఏర్పడింది. విశ్వనాథ్ ఇంటిపేరు కాశీనాథుని…
‘విశ్వదాత’ గా పేరొంది, ‘ఆంధ్రపత్రిక’, ‘అమృతాంజనం’ కంపెనీ ల స్థాపకులుగా ఖ్యాతిగాంచిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, తెనాలిలో ఓరియంట్ పబ్లిషింగ్ కంపెనీ నిర్వహించిన కాశీనాథుని శివరావు, రేపల్లె తాలూకా పెదపులివర్రుకు చెందిన సుప్రసిద్ధ సినీ దర్శకులు ‘ కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్, 1935 లో ‘వైద్యయోగ రత్నావళి’ అనే ఆయుర్వేద గ్రంథం రచించిన తెనాలికి చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు బ్రహ్మశ్రీ పండిత ములుగు రామలింగయ్య, వారి కుమారుడు, మరో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, గ్రంథ రచయిత ములుగు విశ్వేశ్వర శాస్త్రి, వారి అల్లుడు, పెదపులివర్రు గ్రామానికి చెందిన మరో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు కాశీనాథుని మల్లికార్జునరావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి వద్ద చిరకాలం వ్యక్తిగత సహాయకుడు (పి.ఏ.) గా పనిచేసిన తెనాలి వాసి ములుగు కుమారస్వామి (వీరి కుమార్తె శ్రీపతి పండితారాధ్యుల వరలక్ష్మి ఎస్పీ బాలు కి స్వయానా అన్న భార్య), నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్, వారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ, తెనాలికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, రంగస్థల – సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ముదిగొండ వీరభద్రయ్య, ప్రముఖ కవి, కావ్య పరిష్కర్త ముదిగొండ వీరభద్రమూర్తి, ప్రముఖ రచయిత ప్రొ. ముదిగొండ శివప్రసాద్, తెనాలి సమీప గ్రామం ఈమనికి చెందిన ముదిగొండ జ్వాలాపతిలింగ శాస్త్రి, ఈమనికే చెందిన ప్రముఖ కమ్యూనిస్టు, వ్యవసాయ కార్మిక సంఘ నేత కామ్రేడ్ శ్రీపతి పండితారాధ్యుల మల్లికార్జున శర్మ (ఈయన్ని 1948-51 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలోనూ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కాలంలో పోలీసులు చిత్రహింసలపాల్జేసి చంపేశారు), సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, సుప్రసిద్ధ సినీ నటుడు మల్లంపల్లి చంద్రమోహన్, తెనాలికి చెందిన రంగస్థల నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత మల్లికార్జున పండితారాధ్యుల (M.P.) కన్నేశ్వరరావు నాకు తెలిసిన కొందరు ప్రముఖ ఆరాధ్య శైవులు.
విశ్వనాథ్ బ్రాహ్మణ పక్షపాతా?
వందల ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతంలో వీరశైవం ఉద్ధృతంగా ఉన్న కాలంలో ఆరాధ్యులు అక్కడి నుంచి తెలుగునేలకు వలస రావటం, ఘనీభవించిన కులవ్యవస్థ, తీవ్రమైన కులకట్టుబాట్లు కలిగిన నాటి ఇక్కడి వర్ణ సమాజానికి ఆధిపత్యం వహించిన వైదిక బ్రాహ్మణులచే వారు చిన్నచూపు చూడబడటం మొదలైన కారణాల మూలంగా ఆరాధ్యులు సహజంగానే బ్రాహ్మణ శిష్టాచారాలకు అతుక్కుపోయి, మరింతగా సనాతన సంప్రదాయ ప్రియులుగా రూపొందారు. కన్నడదేశంలో ఉండగా వీరశైవ మతానుయాయులుగా, భక్తి ఉద్యమకారులుగా వేద ప్రామాణ్యాన్ని నిరసించి, వర్ణ వ్యవస్థకూ, సామాజిక దురాచారాలకూ, స్త్రీల అణచివేతకూ వ్యతిరేకంగా పోరాడిన తమ ప్రగతిశీల లక్షణాలను వీరు క్రమంగా కోల్పోయారు. ఆ దశలో మిగిలిన అన్ని బ్రాహ్మణ శాఖలలాగే ఆరాధ్యులు కూడా ఫక్తు సంప్రదాయ ప్రియత్వం అలవరచుకుని ఉండవచ్చు. ఆరాధ్యులలో అంతర్భాగమే అయినట్టి విశ్వనాథ్‌కు కూడా సంప్రదాయ ప్రియత్వమే ఉండి ఉండవచ్చు. అంతేగానీ ఆయనకు కులతత్త్వం ఆపాదించడం అమానవీయం.
స్వకులాభిమానం కూడా ఉంటే ఉండవచ్చు. అల్ప సంఖ్యాక సామాజిక వర్గాలన్నింటిలో అభద్రతా భావమో లేక మరేదైనా కారణం వల్లనో ఈ తరహా స్వకులాభిమానం మిగిలినవారిలోకంటే కొంచెం ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. మిగిలినవారికంటే అల్పసంఖ్యాక ఆరాధ్య సామాజిక వర్గంలోనే మనం ఈ తరహా స్వకులాభిమానాన్నీ, ఐక్యతా భావాన్నీ ఎక్కువగా చూస్తాం. సినిమా రంగాన్నే తీసుకుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మొట్టమొదటగా హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం (1967) లో గాయకునిగా పాడే అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.’ ఏమి ఈ వింత మోహం’ అంటూ సాగే పాటే ఆయన సినిమాల కోసం పాడిన మొదటి పాట.
బాలుకి, చంద్రమోహన్ కి, బాలు బావ ‘శుభలేఖ’ సుధాకర్ కి, ఎస్పీ శైలజకూ ‘కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్ ఇచ్చిన ప్రత్యేక అవకాశాలు సామాన్యమైనవేమీ కాదు. సీతామాలక్ష్మి’, ‘సిరిసిరి మువ్వ’, ‘శుభోదయం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలలో మల్లంపల్లి చంద్రమోహన్ కి ముఖ్య భూమికలు ఇచ్చి ఎదిగే అవకాశం కల్పించారు విశ్వనాథ్. నటనలో మెళకువలు పెద్దగా తెలియకపోయినా ఎస్పీ బాలు చెల్లెలు శైలజకు ‘సాగర సంగమం’ చిత్రంలో ఒక ముఖ్య భూమికను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమె గాయనిగా పరవాలేదనిపించినా నటిగా ప్రేక్షకుల అభిమానం పొందడంలో విఫలమయ్యారు. ఆమె భర్త సుధాకర్ కి ‘శుభలేఖ’, ‘సిరివెన్నెల’, ‘జనని – జన్మభూమి’ వంటి పలు చిత్రాలలో అవకాశాలిచ్చి ఆయన ఎదుగుదలకు తోడ్పడ్డారు…
నాకు ఇప్పటికీ జవాబు దొరకని ఓ ప్రశ్న… విశ్వనాథ్ వీరశైవానికి చెందిన ఆరాధ్య బ్రాహ్మణుడే అయితే అంతిమ యాత్ర సమయంలో గానీ, ఖననం గానీ… పార్థివదేహాన్ని కూర్చోబెట్టి ఎందుకు నిర్వహించలేదు..?! ఆరాధ్య బ్రాహ్మణులను వైదిక బ్రాహ్మణులు తమలో పూర్తిగా కలిపేసుకున్నట్టేనా..?!
Share this Article