నాలుగైదురోజులుగా ‘వాలి’ అనే ఓ స్నైపర్ గురించి అంతర్జాతీయ మీడియా పుంఖానుపుంఖాల కథనాలు వినిపించింది… ఓ మానవాతీతుడు అన్నంతగా చిత్రించింది… గుర్తుంది కదా… ఈయన మాజీ కెనెడియన్ సైనికుడు… గతంలో అఫ్ఘన్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు… మంచి నిపుణుడైన స్నైపర్ రోజుకు అయిదారుగురిని ఖతం చేస్తే గొప్ప… కానీ ఆయన ఏకంగా 40 మంది వరకూ నేలకూల్చగలడట… నలభయ్యేళ్ల ఈయన ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపుమేరకు రష్యాకు వ్యతిరేకంగా పోరాడటానికి రంగంలోకి దిగాడు… తన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు… వాలి అనేది నిక్‌నేమ్… అంటే అరబిక్‌లో రక్షకుడు అని అర్థం… ఇదీ సంక్షిప్తంగా ఈయన కథ…
రష్యా అనుకూల సోషల్ మీడియాలో వాలి మరణించినట్టుగా ప్రచారం సాగుతోంది… నిజానికి రెండుమూడు రోజులుగా తన గురించి వార్తలు మళ్లీ లేవు… అయితే తన మరణవార్త ఉత్త ఫేక్ అనీ, కావాలనే రష్యా ఆ ప్రచారం చేస్తోందనీ నాటో అనుకూల సోషల్ మీడియా కౌంటర్ చేస్తోంది… ధ్రువీకరించే వార్తలు కూడా ఏమీ లేవు… ఇక కాసేపు ఈయన సంగతిని పక్కన పెడితే… ఈయనకు తాత వంటి మరో కేరక్టర్ చరిత్రలో ఉంది… ఇదీ రష్యాకు లింకైన కథనమే…
Ads
ఆ స్నైపర్ పేరు సిమో హయ్‌హా… తన మీద కూడా గతంలో చాలా కథనాలు వచ్చాయి… అబ్బురంగా చదువుకునేలా…!! తనను వైట్‌డెత్ అని పిలుస్తారు… ఈయన గురించి కూడా కాస్త సంక్షిప్తంగానే చెప్పుకోవాలంటే… రెండో ప్రపంచ యుద్ధంలో ఫిన్లాండ్ తరఫున వింటర్ వార్‌లో సోవియట్ సైనికులతో పోరాడాడు… ఖచ్చితంగా తన తూటాలకే బలైనట్టు చెప్పబడే శత్రుసైనికుల సంఖ్య 505… వాళ్లంతా తను గురిచూసి టార్గెట్ చేసి కొట్టినవాళ్లు… ఇక తన సబ్‌మెషిన్ గన్ తూటాలకు మరో 200 పైచిలుకు సైనికులు నేలకూలినట్టు చెబుతారు… జస్ట్, 3 నెలల కాలంలో తన స్కోర్ అది… అంటే రోజుకు 8 మంది…
1905లో పుట్టిన ఆయన పోరాటపద్ధతి గురించి కూడా ఆసక్తికరంగా చెబుతుంటారు… ఓ తెల్లటి రగ్గు వంటిది పూర్తిగా కప్పుకుంటాడు… మంచులో కలిసిపోతాడు… దాదాపుగా ఎవరి దృష్టికీ రాడు… అందుకే తనను వైట్‌డెత్ అని పిలుస్తారు… తను ఎప్పుడూ లెన్సులు అమర్చిన తుపాకీ కూడా వాడలేదు… జస్ట్, బోల్ట్ యాక్షన్ రైఫిల్… దాన్ని చేతిలో పట్టుకున్నాడంటే మారణహోమమే… తనను చంపడానికి సోవియట్ రష్యా పంపించిన అన్ని స్నైపర్ యూనిట్లను టార్గెట్ చేసి చంపేశాడు…
అనేకసార్లు తన మీద అటాక్ జరిగింది… ప్రాణాలతో బయటపడ్డాడు… ఓసారైతే ఓ గ్రనేడ్ సరిగ్గా తన మొహం మీదే పేలింది… మొహం చిన్నాభిన్నమైపోయింది… కానీ ఆ దాడిలో కూడా బతికాడు… మరోసారి తలలోకి తూటా దూసుకుపోయి, స్పృహ కోల్పోయాడు… తరువాత రష్యా, ఫిన్లాండు మధ్య రాజీకుదిరి, యుద్ధవిరమణ జరిగిన రోజే స్పృహలోకి వచ్చాడు… తరువాత 2002లో తన 96వ ఏట మరణించాడు… కాలయముడు… వాలి అంటే, వాలిని మించిన తాత ఈయన…!!
Share this Article