ఆయన ఇస్రోకు చీఫ్… పేరు సోమనాథ్… తను బాధ్యతలు తీసుకునేనాటికి చంద్రయాన్ ఫెయిల్యూర్ వల్ల ఇస్రోను ఓ నిరాశాపూర్వక వాతావరణం నెలకొని ఉంది… చంద్రయాన్-3 సక్సెస్ చేయాల్సిన బాధ్యత తనదే… అది గాకుండా ఆదిత్య ఎల్1 ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది… గగనయాన్ కసరత్తు ఆరంభించాలి…
పని ఒత్తిడి… చంద్రయాన్-3 సమయంలోనే కడుపులో ఏదో ఇబ్బంది… నొప్పి… పని ఒత్తిడితో ఏదో చిన్న డిస్‌కంఫర్ట్ అనుకున్నాడు… సమస్యను దాటవేస్తూ వచ్చాడు… చంద్రయాన్-3 సక్సెస్… ఆ వెంటనే ఆదిత్య ఎల్-1 పని… కానీ కడుపు సతాయిస్తోంది… ఆదిత్య లాంఛింగ్ దగ్గర పడుతోంది… ఏవో స్కానింగు చేయించుకుని వచ్చాడు, మళ్లీ పనిలో మునిగాడు…
తీరా ఆదిత్య లాంచింగ్ రోజు… ప్రపంచమంతా మనవైపు చూస్తున్న రోజు… ఉత్కంఠ… తన స్కానింగ్ రిపోర్టుల్లో కేన్సర్ కావచ్చునేమో అనే ప్రాథమిక ఫలితం వచ్చింది… షాక్… ఐతేనేం, నిబ్బరంగా జరగాల్సిన కార్యక్రమం పర్యవేక్షించాడు… ఎక్కడా తొణకలేదు… డౌన్ కాలేదు… లాంచింగ్ అయిపోయాక, ఇస్రో సంబరాల్లో మునిగిపోయింది… సోమనాథ్ మళ్లీ తదుపరి పరీక్షలకు వెళ్లాడు… కేన్సర్ నిర్ధారణ అయ్యింది…
Ads
అది వంశపారంపర్యంగా వచ్చే ఓ అరుదైన కేన్సర్… కడుపు కేన్సర్లలో ఇలాంటివి (Hereditary diffuse gastric cancers (HDGC) 1 నుంచి 3 శాతం వరకూ ఉంటుంటాయి… CDH1 జన్యువు ఉత్పరివర్తనం వల్ల వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి… కడుపులో కేన్సర్ కణితి పెరగడమే ఈ డిజార్డర్… నిజానికి తను చంద్రయాన్ సమయంలోనే కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఉంటే ఆ ప్రాథమిక దశలోనే చికిత్స మరింత సులభమయ్యేది… కానీ ఆదిత్య లాంచ్ దాకా ఆగకతప్పలేదు…
కానీ తనకు చికిత్స విజయవంతంగా జరిగిపోయింది… కణితిని సర్జరీ ద్వారా తీసేశారు, చుట్టూ ఉన్న కేన్సర్ కణాల నిర్మూలనకు కీమోథెరపీ చేశారు… జస్ట్, నాలుగు రోజులు… అంతే, అయిదోరోజు మళ్లీ తన విధుల్లో చేరిపోయాడు… ఇదంతా తనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు… ప్రతి ఏటా ఇకపై పరీక్షలు తప్పనిసరి… ఇక్కడ సోమనాథ్‌ను అభినందించే కొన్ని అంశాలున్నయ్…
ఎందుకో చాలామంది తమ వ్యాధుల గురించి బయటికి అస్సలు చెప్పుకోరు, కేన్సర్ గురించి అసలే చెప్పుకోరు… ఈమధ్య కొందరు సెలబ్రిటీలు కూడా బయటికి చెప్పుకుంటున్నారు… గుడ్, అది తమ తప్పు కాదు కదా… తనకు కేన్సర్ అని నిర్ధారణ అయ్యాక కూడా ఎక్కడా ఆయన నిబ్బరం కోల్పోలేదు… చాలా అరుదైన విషయం… అంతేకాదు, ప్రాథమిక దశలో గుర్తిస్తే కేన్సర్ అన్ని వ్యాధుల్లాంటిదేననీ, దానికి చికిత్సే పరిష్కారం అనీ, దానికి తనే ఉదాహరణ అనీ చెప్పాడు… ఖచ్చితంగా కేన్సర్ బారినపడే వారికి ఇలాంటి ఉదాహరణలు మానసికంగా భరోసానిస్తాయి… సో, ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమిటి తనకు… సదా ఆరోగ్యమస్తు..!! మీ నేతృత్వంలో మనకు మరిన్ని ఖగోళ విజయాలు రావాలి..!
Share this Article