.
అంతరిక్షంలో తప్పిన పెను ప్రమాదం: శుభాంశ్ శుక్లా సహా ఆ నలుగురు వ్యోమగాముల ప్రాణాలు కాపాడిన ఇస్రో ఇంజనీర్లు
అంతరిక్షంలోకి వెళ్లిన మన వ్యోమగామి శుభాంశ్ శుక్లా తిరిగి వచ్చాడు క్షేమంగా… దేశం మొత్తం అభినందనలు చెప్పింది… మోడీని కూడా కలిశాడు… పార్లమెంటులో కూడా ప్రస్తావన వచ్చింది… మొత్తం శుభం, విజయం కదా…
Ads
కానీ తను వెళ్లినా ఆ రాకెట్ పేలిపోయి ఉండేది… స్పేస్‌ఎక్స్ నిర్లక్ష్యం కారణంగా మనకు మరో కల్పనా చావ్లా దుర్ఘటన అనుభవంలోకి వచ్చి ఉండేది… థాంక్ గాడ్, థాంక్ ఇస్రో… అవును, మన ఇస్రోయే సకాలంలో రంగంలోకి దిగింది…
తన అంతరిక్ష ప్రయాణాల నైపుణ్యాన్ని, సందర్భశుద్ధిని, సమయానుకూల విజ్ఞతను ప్రదర్శించింది… దాంతో శుభాంశ్ శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ప్రాణాల్ని కాపాడినట్టయింది… అదెలాగంటే…
స్పేస్‌ఎక్స్ సంస్థ గురించి మనందరికీ తెలుసు… అద్భుతమైన రాకెట్ టెక్నాలజీతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, ఒక చిన్న పొరపాటు వల్ల నలుగురు వ్యోమగాముల ప్రాణాలను ప్రమాదంలో పడేసేంత పని చేసింది…
అందులో ఒకరు మన భారత వ్యోమగామి శుభాంశ్ శుక్లా కూడా ఉన్నాడు… కానీ, సరిగ్గా అదే సమయంలో ఇస్రో (ISRO) ఇంజనీర్ల పట్టుదల, నిశిత పరిశీలన ఆ పెను ప్రమాదాన్ని అడ్డుకుని, ఆ నలుగురి ప్రాణాలను రక్షించాయి… ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించాడు స్వయంగా…
ఇటీవల Axiom-4 మిషన్ కింద నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లాల్సి ఉంది… వీరంతా స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో ప్రయాణించనున్నారు… జూన్ 11న ఈ ప్రయోగం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి… ప్రయోగానికి ముందు రాకెట్ పనితీరును పరీక్షించడానికి ఎనిమిది సెకన్ల పాటు పరీక్ష నిర్వహించారు… ఈ సమయంలో రాకెట్‌కు ఆక్సిజన్ సరఫరా చేసే లైన్లలో లీకేజ్ ఉందని సెన్సార్ గుర్తించింది…
“స్పేస్‌ఎక్స్ దీన్ని తేలిగ్గా తీసుకుంది”
ఇస్రో ఛైర్మన్ నారాయణన్ చెప్పిన వివరాల ప్రకారం.., ఈ లీకేజీని స్పేస్‌ఎక్స్ సిబ్బంది మొదట పెద్దగా పట్టించుకోలేదు… ఇది ఒక చిన్న లీకేజ్ కావచ్చని భావించి, ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూశారు… కానీ, అప్పటికే 40 ఏళ్లకు పైగా లిక్విడ్ ఆక్సిజన్ ఆధారిత ఇంజిన్లపై అనుభవం ఉన్న ఇస్రో ఇంజనీర్లు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు…
“ఆక్సిజన్ లీక్ అయినప్పుడు, అది చిన్న లీకేజ్ కాదు, లోపల ఏదో సమస్య ఉంది,” అని ఇస్రో టీమ్ వాదించింది… ఖచ్చితంగా అది కనిపెట్టి, సమస్యను పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టింది… దీంతో తప్పనిసరై స్పేస్‌ఎక్స్ మరోసారి లోతుగా పరిశీలించగా, ఆక్సిజన్ లైన్‌కు ఒక పెద్ద పగులు ఉన్నట్లు గుర్తించారు…
భూమికి ప్రమాదమని స్పేస్‌ఎక్స్ భయం
“ఒకవేళ పగులు ఉన్న రాకెట్ బయలుదేరి ఉంటే, ప్రయాణంలో వైబ్రేషన్ల కారణంగా ఆ పగులు విరిగిపోయి, రాకెట్ కూలిపోయేది. అదొక పెను ప్రమాదం” అని నారాయణన్ వివరించాడు… ఈ పగులును చూసి స్పేస్‌ఎక్స్ బృందం కూడా ఆశ్చర్యపోయింది… చివరికి, ఇస్రో బృందం ఒత్తిడి మేరకు స్పేస్‌ఎక్స్ ఆ సమస్యను పూర్తిగా సరిదిద్దింది… “మొత్తం సమస్యను సరిదిద్దకపోతే, అది ఒక పెను విపత్తుగా మారి ఉండేది. ఆ నలుగురు వ్యోమగాముల ప్రాణాలను మనం కాపాడాం…” అని నారాయణన్ గర్వంగా చెప్పాడు…
ఆసక్తికరంగా, ఈ ఆలస్యం ఎందుకో, సమస్య ఏమిటో వ్యోమగాములకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించారు… ఏదీ దాచిపెట్టలేదు… వ్యోమగామి శుభంశ్ శుక్లా ఈ విషయంపై స్పందిస్తూ, “స్పేస్‌ఎక్స్, నాసా, యాక్సియం, ఇస్రో బృందాలు మాతో చాలా పారదర్శకంగా వ్యవహరించాయి… ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలుసు… ఏ సమస్య ఉన్నా సరే రాకెట్‌ను పంపరు…” అని చెప్పారు. “నేను నా ప్రాణాలను డాక్టర్ నారాయణన్ చేతుల్లో పెట్టినా భయపడను… ఆయన రాకెట్ వెహికల్ తయారు చేస్తే అందులో నేను వెళ్లడానికి సిద్ధం… ఆయనపై నాకు అలాంటి నమ్మకం ఉంది..,” అని శుక్లా ఇస్రో ఛైర్మన్‌పై తన నమ్మకాన్ని వెల్లడించాడు…
ప్రమాదం తర్వాత మరో సమస్య
ఆ పగులును సరిచేసిన తర్వాత, జూన్ 12న నాసా మరో సమస్యను ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న రష్యన్ భాగం (Zvezda module)లో కూడా లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు… దీనితో మరోసారి ప్రయోగం వాయిదా పడింది… చివరికి, అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత, జూన్ 25న ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి యాక్సియం-4 మిషన్ విజయవంతంగా బయలుదేరి, జూలై 15న కాలిఫోర్నియా తీరం దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది…
ఈ ఘటన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు, మన ఇంజనీర్ల నైపుణ్యానికి మరోసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది… సుదూర భవిష్యత్తులో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లకు ఇస్రో ఎంతవరకు సిద్ధంగా ఉందో ఇది నిరూపిస్తుంది…
Share this Article