Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆల్వేస్ ‘లాగిన్’..! ఐటీ మనుషులా..? రోబోలా..? వేరే జీవితమే ఉండొద్దా..!!

July 23, 2024 by M S R

రోజుకు 25 గంటలు పని చేద్దామా? దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు- నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- “మాడరన్ టైమ్స్”. 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక విప్లవంతో మనిషి యంత్రంలో యంత్రంగా ఎలా మారిపోయాడన్నది సినిమా కథ.

యంత్రాలు చేయబోయే విధ్వంసం గురించి కూడా తమాషాగా చూపించాడు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు టేబుల్ ముందు కూర్చోగానే ఒక ప్లేటును యంత్రం ముందుకు తోస్తుంది. అందులో బ్రెడ్డు ముక్క, కేక్, ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి. యంత్రమే వాటిని మన నోట్లో పెడుతుంది. తిన్న తరువాత యంత్రమే మన మూతి తుడుస్తుంది. డెమోలో మొదట అంతా బాగుంటుంది. కాస్త వేగం పెంచగానే యంత్రం మన మూతి పళ్లు రాలగొట్టి, మొత్తం కేకును మన మొహానికి పూస్తుంది.

మనిషి యంత్రాల చక్రాల మధ్య ఎలా నలిగిపోతున్నాడో! బోల్టులో బోల్టుగా ఎలా మారిపోయాడో! మెదడు కోల్పోయి ఎలా యాంత్రికంగా తయారయ్యాడో! వందేళ్ల కిందటే మూగ బాసలతో చెప్పిన చార్లీ చాప్లిన్ దృష్టికోణం అనన్యసామాన్యం.

Ads

ఏదో హాస్యం పండించడానికి చాప్లిన్ తన సృజనాత్మక ప్రతిభతో అధివాస్తవికతను జోడించి సన్నివేశాలను సృష్టించినట్లు మొదట్లో అనుకున్నా… అదే వాస్తవ జీవన చిత్రమని అప్పుడే తేల్చి చెప్పారు. చాప్లిన్ ఊహించిన భయంకరమైన యాంత్రిక జీవనంలోనే మనమిప్పుడు బతుకుతున్నాం. కాకపొతే చాప్లిన్ ఊహించినదానికంటే వేనవేల రెట్లు ఎక్కువైన యాంత్రిక జీవనంలో బతుకుతుండడమే అసలు విషాదం.

ఈ విషాదానికి చట్టబద్ధత కల్పించే “మాడరన్ టైమ్స్” లో ఉన్నామని తెలిస్తే చాప్లిన్ ఎన్నెన్ని ” అల్ట్రా మాడరన్ టైమ్స్” సినిమాలు తీయాలో? పోయాడు కాబట్టి బతికిపోయాడు! బతికి ఉన్న మనం పోలేక చస్తున్నాం!!

సినిమా నుండి అసలు విషయంలోకి వెళదాం. కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ పరిశ్రమలకు స్వర్గధామం. రాజీవ్ గాంధీ హయాంలో 1986లో సార్క్ సమావేశాలేవో బెంగళూరు, నంది హిల్స్ ప్రాంతాల్లో జరపడంతో ఒక పెద్ద పల్లెలా ప్రశాంతంగా ఉన్న నగరం అంతర్జాతీయ యవనిక మీద రెపరెపలాడింది. ఆ తరువాత ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బెంగళూరును ఐటీకి మారుపేరుగా మార్చారు. ఇప్పుడు బెంగళూరు తనను తానే గుర్తు పట్టలేనంతగా మారిపోయి…ఆకాశమే హద్దుగా విస్తరించింది. విస్తరిస్తోంది. ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది.

ఐటీ ఉద్యోగులు రోజుకు పది గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే చాలదని… రోజుకు పన్నెండు గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి పద్నాలుగు గంటలు పనిచేయాలని ఆమధ్య ప్రఖ్యాత ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఎక్కడో ఏదో సందర్భంలో అన్నారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా అవునవును…లక్షలకు లక్షల జీతాలు, అంతులేని వసతులు, ప్రోత్సాహాలు ఇచ్చేప్పుడు రోజుకు పద్నాలుగు ఇంటూ వారానికి అయిదు రోజులు ఈక్వల్ టు డెబ్బయ్ గంటలు పనిచేస్తేనే పరిశ్రమ బతికి బట్టగట్టకలుగుతుందని వంత పాడారు.

భారతదేశంలో కార్మిక చట్టాలు ఎంతగా దేవాతావస్త్రాలైనా ఉద్యోగుల పనివేళలకు సంబంధించి ఏవో కొన్ని నియమ నిబంధనలు ఉండి చచ్చాయి. అవి ఐటీ కంపెనీలకు అడ్డొస్తున్నాయి. అందుకు చట్టాన్నే మార్చడానికి కర్ణాటక శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలుగా ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది.

ఈ బిల్లు చట్టమైతే ఉద్యోగుల గుండె గుభిల్లే.

ఆమధ్య కర్ణాటకలో ఇకపై ప్రయివేటు సంస్థల్లో కన్నడిగులకు కొన్ని పోస్టుల్లో యాభై, మరికొన్ని పోస్టుల్లో డెబ్బయ్ అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న బిల్లు తయారు చేసి…ముఖ్యమంత్రి సిద్దరామయ్య అభాసుపాలయ్యారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాల నుండి వ్యతిరేకత రావడంతో రిజర్వేషన్ లేదు…గిజర్వేషన్ లేదు…అంతా ఉత్తిదే…అని నాలుక కరుచుకున్నారు.

ఇప్పుడు పారిశ్రామిక దిగ్గజాలు మౌనంగా ఉండవచ్చు కానీ…ఉద్యోగులు రగిలిపోతున్నారు.

“ఊరికే ఉన్న ప్రాణానికి ఉరివేసుకోవడం”;
“గాలికి పోయే కంపను నెత్తిన వేసుకోవడం”
లాంటి సామెతలు ఎలా పుట్టాయో తెలుసుకోవాలంటే ఔత్సాహికులు సిద్దరామయ్యను సంప్రదించగలరు!

ఒడిలో ల్యాప్ టాప్. చేతిలో స్మార్ట్ ఫోన్. టేబుల్ ముందు డెస్క్ టాప్. ఆఫీస్ లో పని. ఇంట్లో ఆఫీస్ పని. బాత్ రూమ్ కాలకృత్యాల కమోడ్ మీద కూడా వదలని జూమ్ మీటింగులు. భార్యాభర్తల సరస శృంగార హనీమూన్లలో కూడా వదలని ఆఫీసు బాసులు. టార్గెట్లు. ఊస్టింగులు. చేసిన అప్పుల ఈఎంఐ లకు సరిపోయే నెల జీతాల ఐటీ జీవితాలు.

రాత్రీ పగలు పని చేస్తున్నట్టుగానే ఉంది.
కంప్యూటర్ కు- ఫోన్ కు మధ్య తేడా లేదు.
ఫోన్ కు- కెమేరాకు;
వ్యాలెట్ కు- ఫోన్ కు- పోస్టు కార్డుకు మధ్య తేడాల్లేవు.

ఉద్యోగులు 24 గంటలూ పైవారికి అందుబాటులోనే ఉంటున్నారు. చాలా మందికి అందుబాటులో ఉండటం కూడా ఒక పనే అనే సంగతి కూడా తెలియదు.

టెక్నికల్ గా ఆల్రెడీ రోజుకు 24 గంటల పని చేస్తూనే ఉన్నారు.

అన్నట్లు-
ఈ “కర్ణాటక మాడరన్ టైమ్స్” సినిమాను తీసే చాప్లిన్లు ఏరీ? ఎక్కడ? – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions