.
సినిమా అంటేనే పత్తాలాట… అవును, పేకాట… జూదం… కోడిపందేలు… బెట్టింగులు… సక్సెస్, ఫ్లాప్ నువ్వెంత కష్టపడినా నీ చేతిలో ఉండదు… ఎందుకంటే..? కారణాలు అనేకం కావచ్చు, ప్రేక్షకుడు జడ్జి, నియంత, నిరంకుశుడు… వాడు కాదంటే ఏ సరుకూ వినోద మార్కెట్‌లో చెల్లుబాటు కాదు…
త్రిబాణధారి బార్బరిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ ఓ వీడియో రిలీజ్ చేశాడు…. ఏమనీ..? తాను తెరకెక్కించిన ‘బార్బరిక్’ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో బోరున ఏడ్చారు అందులో… అలాగే తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు…
Ads
ఎస్, కొందరు నిర్మాతలు ఇలా బహిరంగంగా కొట్టుకుంటారు… చాలామంది ఇంటికెళ్లి ఏడుస్తూ కొట్టుకుంటారు… అంతే తేడా… ఆశలు సహజం, తమ వర్క్ మీద లాభాలు ఆశించడమూ సహజం… కానీ ప్రేక్షకుడికి నీ కష్టం, నీ ఖర్చు అక్కర్లేదు… వాడు నియంత, నాకు నచ్చిందా లేదా అనేదే చూస్తాడు…
నువ్వెంత బ్రదర్..? పెద్ద పెద్ద దర్శకులే ఫ్లాపులు ఎదుర్కుని రోజుల తరబడీ ఏడ్చారు… సహజమైన ఉద్వేగమే… కానీ ఇది ఎలాంటిదీ అంటే..? నేను పందెం కట్టిన గుర్రం గెలవలేదు అని ఏడ్వడంలాంటిదే… ఎస్, ఇది అక్షరాలా జూదమే… పెద్ద పెద్ద స్టార్లే మట్టిగరిచిన కథలు బోలెడు ఈ ఇండస్ట్రీలో…
‘బార్బరిక్ ఆడుతున్న థియేటర్కు వెళ్లగా 10 మంది ప్రేక్షకులు ఉన్నారు… వారిని సినిమా ఎలా ఉందని అడగ్గా బాగుందని చెప్పారు… కానీ ప్రేక్షకులు సినిమాకు రావడం లేదు… ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డా… నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య భయపడుతోంది..’ అని వాపోయాడు ఈ దర్శకుడు…
‘‘మీరు మళయాళ సినిమాలకు అలవాటు పడ్డారు’’ అనీ ఆవేదన వ్యక్తం చేశాడు… తప్పు, తప్పున్నర… ఇది థియేటర్ తప్పు, ఆ నలుగురి సిండికేట్ తప్పు… అడ్డగోలు టికెట్ రేట్లు, పార్కింగ్, క్యాంటీన్ రేట్లు… వచ్చీపోయే రవాణా, ఫ్యామిలీ ఖర్చులు…
అసలు సినిమా థియేటర్‌లో చూడటం అంటేనే ఓ పెద్ద టాస్కు… ఈ తొక్కలో సినిమాలకు సగటు ప్రేక్షకుడు అంత త్యాగాలు చేయాల్సిన అవసరమే లేదు… అది ఇండస్ట్రీ ఖర్మ… ఇది రియాలిటీ… వేలకువేలు ఖర్చు పెట్టుకుని థియేటర్‌కు ఎందుకు రావాలి..? మరీ నాగవంశీ తిక్క డైలాగులు కొట్టాల్సిన పనిలేదు…
నువ్వు రెండేళ్లు కష్టపడ్డావా..? సర్వం త్యాగం చేశావా..? ఇవేవీ ప్రేక్షకుడికి అస్సలు ఏమాత్రం అక్కరలేదు… సరుకు క్వాలిటీ మాత్రమే ముఖ్యం… ఐనా సినిమాలో ఏముందోయ్,, నిజం చెబితే నిష్ఠురం గానీ…. నీ బిడ్డ నీకు ముద్దు… డబ్బు ఖర్చు పెట్టి థియేటర్ దాకా వచ్చేవాడికి ఏం ముద్దు..?
అసలు నీ టైటిలే పెద్ద బ్లండర్… ఇంగ్లిషో, తెలుగో, హిందీయో, సంస్కృతమో అర్థం కావడం లేదు కదా… దాన్ని దుష్ట సమాసం అంటారు…
-
“త్రి” (संस्कृतం/సంస్కృత మూలం) → మూడు అని అర్థం.
-
“బాణధారి” (తెలుగు నిర్మాణం) → బాణం (అంబు/arrow) + ధారి (ధరించువాడు, పట్టువాడు).
ఇలా కలిపి “మూడు బాణాలు ధరించినవాడు” అనే అర్థం వస్తుంది… వీటినే భాషాశాస్త్రవేత్తలు దుష్ట కలయికలు లేదా మిశ్రిత పదాలు అని పిలుస్తారు…
పోనీ, ఘటోత్కచుడి కొడుకు కథను తీసుకున్నావు… అబ్బో, ఇప్పటి ట్రెండ్ కదా పురాణాలు అనుకుని థియేటర్‌కు వస్తే నువ్వు మోసం చేశావు… బర్బరీకుడి కథకూ ఈ సినిమా కథకూ ఏదో పొంతన లేని లింక్ పెట్టి, ఏదో సగటు రొటీన్ ఫార్ములా కథను ఎంచుకున్నావు…
ఏదో సత్యరాజ్ బాగానే చేశాడు… ఉదయభాను ఫాఫం, మళ్లీ భంగపడింది… ఇంకేముంది సినిమాలో..? సోది ప్రజెంటేషన్… ఒక్క సీన్ కూడా ఎలివేట్ కాలేదు… హై లేదు… మరి ఎందుకు రావాలి నీ సినిమా చూడటానికి వేల ఖర్చు పెట్టి థియేటర్‌కు..?
నిజాలు ఇలాగే ఉంటయ్… పోనీ, నువ్వు ఏడ్వడం ద్వారా మరో నష్టం… కాస్తో కూస్తో డబ్బు పెట్టే ఓటీటీలు కూడా వెనక్కి తగ్గుతాయి… వెరసి, సర్వమంగళం..! తిరుక్షవరం..!! అందుకే కాస్త ఏడవడానికీ సంయమనం అవసరం అనేది..!!
Share this Article