Kandukuri Ramesh Babu………. ప్రవల్లికను బలి తీసుకున్న సిగ్గులేని చైతన్య సమాజం…
ప్రజలను ఓటు బ్యాంకుగా తప్పించి చూడలేని ప్రభుత్వము,
ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా లేని ప్రతిపక్షము,
Ads
మతపరమైన కార్యాచరణ తప్పించి మరేమీ లేని బీజేపీ,
దళిత బహుజనులను రాజ్యాధికారంలోకి తెస్తామని చెప్పడం తప్ప ఈ వర్గాల చైతన్యాన్ని పెంచే రాజకీయాల లేమి,
సుదూర ఆశయమైన నూతన ప్రజాస్వామిక విప్లవం తప్పించి మరి విశ్లేషణలు, తక్షణ పరిష్కారాలు లేని సాయుధ పార్టీల వైఫల్యాలు,
పార్లమెంటరీ పంథాను ఎంచుకొని కూడా అస్తిత్వ సంక్షోభంలో ఉన్న కమ్యూనిస్టులు,
బతుకమ్మను ఈవెంట్ గా మార్చిన జాగృతి,
ప్రజా శ్రేణులను చైతన్యపరిచే కార్యాచరణ లేని బహుజన బతుకమ్మలు,
క్షేత్రస్థాయిలో ఈ దశాబ్దంలో జరిగిన మంచి చెడులను చెప్పడానికి నోరు పెగలని, ప్రభుత్వంలో భాగమైన ఉద్యమ కారులు,
పదవులకు, పైసలకు అమ్ముడుపోయిన పాటగాళ్లు,
తాము రాసిన రచనల్లోని ఇతివృత్తాలను సైతం మరిచిపోయి కీర్తి పురస్కారాలకు దాసోహం అంటున్న కవులు, రచయితలు.
బీసీ రాజకీయాల పేరుతో వైఫల్య తెలంగాణను పరోక్ష మద్దతునిస్తున్న ఇంటలెక్చువల్స్,
ఎన్నికల సర్వేలు చేసి పెట్టి బతక నేర్చిన జర్నలిస్ట్ కూలీలు,
మరణాలను, సంక్షోభాలను అద్భుతమైన చిత్రాలుగా మలిచే సినీ దర్శక నిర్మాతలు,
కెసిఆర్ లేదా కేటీఆర్ ప్రసన్నత కోసం పడిగాపులు పడే మన సాంస్కృతిక యోధులు,
జాతీయ అంతర్జాతీయ సమస్యలపై నిత్యం పోస్టులు పెడుతూ ప్రజలతో ఉన్నట్టు నటించే సోషల్ మీడియా సెలబ్రిటీలు,
రేటింగ్ కోసం వివాదాస్పద అంశాలపై పని చేసే రైట్ – లెఫ్ట్ వింగ్ అన్న తేడాలేని యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులు,
సామాజిక సంక్షోభాన్ని ఆర్టికులేట్ చేయగలిగి ఉండి ఉదాసీన వైఖరి తీసుకున్న ప్రతి మేధావి,
హక్కులు అడగడమే తప్ప బాధ్యతలను విస్మరించిన వీరంతా నేటి ప్రవల్లిక ‘హత్య’కు, మరెందరో జీవత్సవాల బ్రతుకులకు నిశ్శబ్ద సాక్షులు, ప్రత్యక్ష హంతకులు.
ప్రభుత్వాన్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను విమర్శించే పేరుతో వీళ్ళందరూ తప్పించుకోవాలని చూడటం సిగ్గు సిగ్గు. ప్రవల్లికకు నివాళిగా ఇంకా చాలామంది చనిపోక ముందే అసలు తెలంగాణ స్థితిగతి ఎలా ఉన్నదో గట్టిగా నలుగురితో పంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం తీవ్ర సంక్షోభంలో ఉందన్న సంగతి అంగీకరించవలసి కూడా ఉంది,
సమీపంలో ఉన్న ఎన్నికల్లో ఎవరిని గెలిపించడం అన్నదే ముఖ్యం కాకుండా ఒక్కొక్కరం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యమైన వ్యక్తులుగా మారి, సకల జనులం ఇప్పుడైనా మాట్లాడకపోతే రాష్ట్ర సాధనలో బలిదానాలను మించే ఆత్మహత్యలను కళ్లారా చూస్తాం. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు ఇలా రాయక తప్పని విషాద స్థితి…. కందుకూరి రమేష్ బాబు, Samanyashastram Gallery
Share this Article