ఫాఫం తెలుగు సినిమా నిర్మాతలు…! ఇండస్ట్రీ అసలు సమస్య ఏమిటో వాళ్లకు అర్థం కావడం లేదా..? కానట్టు నటిస్తున్నారా..? ఎగ్జిబిటర్ల మాఫియాకు భయపడుతున్నారా..? ఇంకా ఇంకా ఊబిలోకి కూరుకుపోతున్నారా..? వేల కోట్ల టర్నోవర్‌కు రిస్క్ తీసుకుంటున్న పెద్ద పెద్ద నిర్మాతలతోపాటు చిన్న చిన్న బడ్జెట్లతో అదృష్టాల్ని పరీక్షించుకునే చిన్న నిర్మాతలూ ఉన్నారు… వాళ్లలో ఇక మాట్లాడేవాళ్లు, నిర్ణయాలు తీసుకోగల పరిణతి ఉన్నవాళ్లు ఎవరూ లేరా..?
నిర్మాతలకూ దిల్ రాజే ప్రతినిధి… ఎగ్జిబిటర్లకూ దిల్ రాజే ప్రతినిధి… ఏ సినిమా ఎప్పుడు విడుదల చేయాలో, ఎన్ని థియేటర్లు మాత్రమే ఇవ్వాలో, అసలు ఇవ్వాలో వద్దో కూడా డిసైడ్ చేసే డిక్టేటర్‌షిప్ ఎవరు కట్టబెట్టారు..? నిర్మాతల అసలు సమస్య ఏమిటంటే..? జనం థియేటర్ల వైపు రావడం లేదు… మరీ సూపర్, బంపర్ అనే టాక్ వచ్చిన సినిమాల్ని మాత్రమే థియేటర్లలో చూడటానికి సాహసిస్తున్నారు… మిగతా సినిమాలను దేకడం లేదు… థియేటర్లకు ఎందుకు రావడం లేదు..? ఇదీ బేసిక్ ప్రశ్న…
- అడ్డగోలు టికెట్ రేట్లు 2. ఆకాశంలో క్యాంటీన్ ధరలు 3. అడ్డూఅదుపూ లేని పార్కింగ్ ఫీజులు 4. రానుపోను ట్రాఫిక్ 5. పెట్రోల్ చార్జీలు 6. అడ్డగోలు టైమ్ టేకింగ్ టాస్క్ 7. సినిమా వీక్షణం అయ్యాక హోటళ్లకు వెళ్లే అదనపు చిలుం… దీనికన్నా ఓటీటీ అయితే ఎప్పుడంటే అప్పుడు సినిమా ఆపొచ్చు, మళ్లీ మళ్లీ చూడొచ్చు, చెత్తా పాటల్ని జంప్ చేయొచ్చు, హీరోల ఎంట్రీ సాంగ్స్, వ్యాంప్ సాంగ్స్, చెత్తా ఫైట్లను స్కిప్ చేయొచ్చు… ఇతర భాషల మంచి చిత్రాల్ని సబ్‌టైటిళ్లు, తెలుగు ఆడియోతో కూడా చూడొచ్చు… అన్నింటికీ మించి మన ఇల్లు, మన థియేటర్… అదీ లెక్క…
దిల్ రాజు చెబుతున్నాడు తాజాగా… 8 వారాల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేస్తాం అని…! ఇది ఇంకా సూసైడల్… దిల్ రాజు ఎగ్జిబిటర్లు అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నాడు… మిగతా నిర్మాతలకు అర్థమవుతున్నట్టు లేవు… పర్ సపోజ్, సుబ్బారావు ఓ సినిమా తీశాడు… చిన్న బడ్జెట్టే… ఇప్పుడు సినిమా హిట్టో, ఫట్టో మొదటి ఆటతోనే తేలిపోతుంది… బయ్యర్ బయటపడ్డాడా, నెత్తి మీద గుడ్డ వేసుకున్నాడా నాలుగు రోజుల్లో తేలిపోతుంది… వారాలా తరబడీ ఆడే సినిమాలు ఏమున్నాయి గనుక..? 90 శాతం సినిమాలు వారంపదిరోజుల బాపతే…
Ads
ఈ స్థితిలో వారానికే సుబ్బారావు సినిమాను ఎత్తిపారేశారు అనుకుందాం… (లాల్‌సింగ్‌చద్దా, రక్షాబంధన్ సినిమాల్నే వేల షోలను మొదటిరోజే లేపేశారు)… ఇక 7 వారాల దాకా ఆ సినిమా ఎక్కడా కనిపించదు… టీవీల్లో రాదు, ఓటీటీలో రాదు… జనం దాని గురించి మరిచిపోతారు… సో, ఓటీటీ వాడు కూడా అడ్డికిపావుశేరు రేటు అడుగుతాడు… అంతే మరి, జనం ఆసక్తి చచ్చిపోయిన కంటెంట్ కోసం వాడెందుకు వెంపర్లాడతాడు..? వెరసి, సుబ్బారావు మళ్లీ జన్మలో ఇక సినిమా తీయడు… ఇదే దిల్ రాజు చికిత్సతో ఒనగూరే అదనపు వ్యాధి… అసలు ఓటీటీయే థియేటర్ల సమస్యకు కారణం అనే రోగనిర్ధారణలోనే లోపముంది…
సినిమాలో దమ్ముండాలి, ఉంటే జనం థియేటర్లకు వస్తారు… సీతారామం, బింబిసార, కార్తికేయ-2 హిట్లకు కారణమదే… ఇంకా పిచ్చి పిచ్చి బిల్డప్పు సినిమాల్ని తీస్తానంటే జనం ఈడ్చితంతున్నారు… ఇంకా రియాలిటీలోకి వెళ్దాం… థియేటర్లలో పార్కింగ్ అనేది నిజానికి థియేటర్లు ఫ్రీగా కల్పించాల్సిన సౌకర్యం… అడిగేవాడు లేడు… క్యాంటీన్లలో ధరల మీద ఎవడి నియంత్రణా లేదు… టికెట్ రేట్లు ఎవరి ఇష్టారాజ్యం వాళ్లదైపోయింది… ఇప్పుడు దిల్ రాజు చెప్పే తగ్గింపులేమీ ఆచరణలోకి రావు… సో, థియేటర్ల అసలు సమస్య అలాగే ఉండిపోతుంది… సో, దిల్ రాజూ… జ్వరముంటే డోలో650 వేసేసుకోకు, అసలు ఆ జ్వరం ఎందుకొచ్చిందో తెలుసుకో…!!
Share this Article